రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుతం సంజయ్ మల్హోత్రా రెవెన్యూ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ గా సంజయ్ మూడేళ్ళ పాటు కొనసాగుతారు. బుధవారం ఆయన రిజర్వ్ బ్యాంక్ 26వ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. 1990 బ్యాచ్ కి చెందిన రాజస్థాన్ క్యాడర్ ఐఎఎస్ అధికారి అయిన సంజయ్ మల్హోత్రా కాన్పూర్ ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం ప్రిన్స్ టన్ యూనివర్శిటీ నుంచి తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ని పబ్లిక్ పాలసీలో చేశారు. దాదాపు 33 సంవత్సరాల ప్రభుత్వ సర్వీసులో ఫైనాన్స్, టాక్సేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పవర్, మైన్స్ వంటి కీలక శాఖల్లో పనిచేశారు. ఆర్థిక రంగంలో విశేష అనుభవం ఉన్న మల్హోత్రా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్ పదవీ కాలం మంగళవారంతో ముగియనుంది.