30.8 C
Hyderabad
Thursday, June 25, 2026

Live Video

spot_img

సామాన్యుడికి అందని ద్రాక్ష… స్టార్ హీరోల సినిమాలు

తెలుగు సినీ రంగంలో ఇటీవల కొత్త ట్రెండ్ మెదలైంది. సినిమా విడుదలకు ముందే టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం నుంచి కొందరు నిర్మాతలు, హీరోలు అనుమతులు తీసుకుంటున్నారు. ఇందుకోసం కొన్ని సందర్భాల్లో స్టార్ హీరోలు ముఖ్యమంత్రిని కలిసి మరీ విన్నవిస్తున్నారు.

ప్రజా సమస్యలను ఏ మాత్రం పట్టించుకోని సినీ హీరోలు, వాళ్ల సినిమాల టికెట్ల రేట్లు పెంచేందుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావటం ఈ మధ్య కాలంలో పరిపాటిగా మారింది.

ఒకప్పుడు కేవలం స్పెషల్ మార్నింగ్ షో మాత్రమే ఉండేది. విడుదలకు ముందే బెనిఫిట్ షో పేరుతో ప్రతి రోజు ఏడు షోలు నిర్వహించి నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారనే అరోపణలు ఉన్నాయి. అర్దరాత్రి ఒంటిగంటకు షో నిర్వహించటం ఎవరికి మేలు చేస్తోందనే వాదన ఉంది.

ఒకేసారి తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ తదితర దేశాల్లో బెనిఫిట్ షోలు నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా మన డిస్ట్రిబ్యూటర్సే థియేటర్లు తీసుకొని హవా నడిపిస్తున్నారు. ఈ ఆంశాలపై కోర్టుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసినా ఫలితం ఉండటం లేదు.

మరోవైపు చిన్న హీరోలు, నిర్మాతల పరిస్థితి దారుణంగా ఉంది. థియేటర్స్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్స్ వరకు అదొక పద్మ వ్యూహం. చిన్న సినిమాల హీరోలకు థియేటర్స్ దొరకటం లేదు. వాటి వసూళ్లు బాగానే ఉన్నా ఒకోసారి బలవంతంగా థియేటర్ల నుంచి తీసేయాల్సిన దుస్థితి నెలకొంది.

ఈ వ్యవహారాలన్నీ సినీ పెద్దల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. దీనికి తోడు రాజకీయ అండ తోడైతే… ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా తయారైంది. పెద్ద హీరోల సినిమాలకు టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వాలు విధాన పరమైన నిర్ణయాలు తీసుకున్నా… ప్రత్యేక అనుమతుల పేరుతో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు.

స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీసున్న నిర్మాతలు ఆ సొమ్మ రాబట్టుకునేందుకు టికెట్ల రేట్లు పెంచుకుని రాబట్టుకుంటున్నారనేది బహిరంగ రహస్యం.

ప్రత్యేక అనుమతుల పేరుతో 800 వరకు పెంచుతున్నారు. ఈ లెక్కన కుటుంబంలో పది మంది కలిసి వెళితే పది వేలు ఖర్చు చేయాలా అని పుష్ప2 విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

తెలంగాణలో ప్రస్తుతం పుష్ప2 ధరలు నగరాల్లోని మల్టిప్లెక్సుల్లో 1239 రూపాయలు కాగా ఆంద్రప్రదేశ్లో 944 రూపాయలుగా ఉంది. సినీ చరిత్రలో ఇది వరకు ఎన్నడూ లేని రీతిలో పుష్ప2 తో కొత్త విధానానికి తెర లేపింది.

విడుదలకు ముందే ప్రీమియర్ షోల పేరుతో సినిమా ప్రదర్శిస్తున్నారు. ప్రీమియర్ షోలకు భారీగా సొమ్ము వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సినీ అభిమానులు మండిపడుతున్నారు. మధ్యతరగతి కుటుంబం ఇద్దరు పిల్లలతో కలిసి సినిమాకు వెళితే 5 వేల వరకు జేబు గుల్ల అవుతోంది.

సినీ పరిశ్రమలో ఈ విపరీత ధోరణి ఎక్కడికి దారితీస్తుందో అని సినిమా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com