రాజ్యసభలో అడుగు పెట్టాలని మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ఉత్సాహ పడుతున్నారు. ఖాళీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజ్యసభ సీటు ప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరు లోక్ సభ స్థానం నుంచి రెండు పర్యాయాలు విజయం సాధించిన జయదేవ్ మూడో పర్యాయం బరిలో నుంచి తప్పుకున్నారు. లోక్ సభ సభ్యుడిగా ఉండి తనకున్న వ్యాపారాల మూలంగా ప్రజలకు అందుబాటులో ఉండలేకపోతున్నాననే భావనతో పాటు ఎన్నికలకు దూరంగా ఉన్నారని సన్నిహితులు చెప్పుకుంటారు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో డాక్టర్ పెమ్మసానికి పోటీ చేసే అవకాశం లభించగా ఆయన ప్రస్తుతం కేంద్రసహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
గత ఎన్నికల్లో పోటీకి దూరమైనా పార్టీ పట్ల విధేయత
పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపును కాంక్షిస్తూ కుటుంబ సమేతంగా గల్లా వచ్చి ఓటు కూడా వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు మంత్రి నారా లోకేశ్ తో కూడా గతంలో లాగే సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో అడుగుపెట్టాలనే ఆకాంక్షను ఆయన ఇప్పటికే చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళారు. వివాద రహితుడు, నిజాయితీ పరుడైన జయదేవ్ అభ్యర్థిత్వాన్ని అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.