తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన దశాబ్దం తర్వాత కూడా ఇంకా తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం సమసిపోలేదు. అధికార, ప్రతిపక్షాల మధ్య విగ్రహం రూపకల్పనపై వాదనలు, ప్రతివాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు సెక్రెటేరియట్ ప్రాంగణంలో ప్రభుత్వం ఈనెల 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. అయితే, ఆ విగ్రహం ఎలా ఉంటుందన్న సందేహాలు అందరినీ వెంటాడుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే, ఈ విగ్రహం విషయంలో తరచూ విమర్శలు చేస్తోంది. అసలు తెలంగాణ తల్లి విగ్రహంలో ఏయే ఎలిమెంట్లు ఉంటాయో, విగ్రహం ఎలా తీర్చి దిద్దుతున్నారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తోంది. కానీ, ప్రభుత్వం మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం తయారీని రహస్యంగా ఉంచుతోంది.
మరోవైపు.. సచివాలయంలో ప్రతిష్ఠించనున్న తెలంగాణ తల్లి విగ్రహం తయారీ పనులు వేగంగా కొనసాగున్నాయి. పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని కోహెడ సమీపంలో మూడునెలలుగా పనులు జరుగుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి ఇటీవలే విగ్రహాన్ని పరిశీలించి 9న సచివాలయంలో ఆవిష్కరించేందుకు వీలుగా ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని శిల్పికి సూచించారు. రాష్ట్ర ప్రజలంతా ఒకేసారి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తిలకించాలన్న ఉద్దేశంతో విగ్రహం ఆకృతి, రూపకల్పనలపై ప్రభుత్వం అత్యంత గోప్యతను పాటిస్తోంది. సీఎం కోహెడకు వెళ్లిన విషయాన్ని పోలీసులు కూడా బహిర్గతం చేయలేదు.
వాస్తవానికి గత ఆగస్టులోనే ముఖ్యమంత్రి రేవత్రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పనకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. గడీల ఆనవాళ్లు లేకుండా.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారుచేయిస్తామన్నారు. ఉద్యమ సమయంలో జరిగిన మిలియన్ మార్చ్ తరహాలో లక్షలాది మంది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించారు. దొరల గడీల ఆనవాళ్లు విగ్రహంలో ఉండకూడదని, అందుకే తెలంగాణ ప్రజల అభిమతానికి తగినట్టు తెలంగాణ తల్లి విగ్రహం రూపొందిస్తున్నామన్నారు.
గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేశారు. అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో తయారు చేయించారన్న విమర్శలు వచ్చాయి. అలాగే, తెలంగాణ తల్లి తలపై కిరీటం, నగలు ఎందుకని కాంగ్రెస్పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించింది. ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్రెడ్డి కూడా ఈ ప్రస్తావన చేశారు. గడీల్లో ఉండే తెలంగాణ తల్లి వద్దని, తెలంగాణ ఉట్టిపడేలా, ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహం రూపొందిస్తామని ప్రకటించారు.
అయితే, బీఆర్ఎస్ ఈ అంశంపై విమర్శలు కొనసాగిస్తోంది. ఎవరిని సంప్రదించారు. ఏవర్గం ప్రజల అభిప్రాయాలు తీసుకొని తెలంగాణతల్లి విగ్రహం రూపొందిస్తున్నారని నిలదీస్తోంది. ఎవరికీ తెలియకుండా గుట్టుగా విగ్రహం తయారుచేయించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్పార్టీ మాత్రం ఈ విమర్శలపై మౌనం పాటిస్తోంది.