ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ నియమించిన ప్రభుత్వం
గుల్జార్ హౌజ్ సమీపంలో మొన్న ఆదివారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గానూ ఆరుగురు ఉన్నతాధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు – హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈనెల 18 వ తేదీన చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని గుల్జార్ హౌజ్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదం పై సమగ్ర విచారణ చేపట్టాలని ఆరుగురు ఉన్నతాధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, హైదరాబాద్ సీపీ సివి ఆనంద్ , ఫైర్ డీజీ నాగిరెడ్డి , హైడ్రా కమిషనర్ రంగనాథ్ ,టీఎస్ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ లు సభ్యులగా ఉంటారు. ఈ కమిటీ 18వ తేదీ జరిగిన గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదంపై క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి ఘటనకు గల కారణాలు ఘటన అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలు, ఆగ్నిమాపక శాఖ, పోలీసు, వైద్య శాఖలు స్పందించిన తీరుల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమగ్ర నివేదిక ఇస్తుంది. అలాగే భవిష్యత్ లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా క్షేత్రస్థాయి ప్రజలకు సూచనలు స్థానిక పరిస్థితులు అంచనా వేసి భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు ప్రతిపాదనలతో సూచనలు చేస్తూ ప్రతిపాదనలు కూడా కమిటీ సీయంకు అందజేయనుంది. కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి తగు చర్యలు తీసుకుంటారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో తెలిపారు.