- 41 సంస్థలకు 300 ఎకరాలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
- నిర్మాణాల్లో జరుగుతున్న తీవ్ర జాప్యంపై కేంద్రానికి త్వరలో లేఖ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల నిర్మాణ పనులకే తీవ్రం జాప్యం జరుగుతోంది. అమరావతి ప్రాంతంలో నలభై ఒక్క సంస్థలకు 300 ఎకరాలు పైగా భూములు కేటాయించి చాలా కాలం అయినా పనులు ముందుకు సాగడంలేదు. గత ప్రభుత్వం అమరావతి రాజధాని పనులను పక్కన పెట్టడంతో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటు వ్యవహారం సందిగ్ధంలో పడింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంతకు ముందు అనుకున్న విధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధల ఏర్పాటుకు మళ్ళీ గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇటీవలే ప్రధాని నరేంద్రమోడీ రాజధాని అమరావతి పనులకు రెండో సారి శంకుస్ధాపనలు కూడా చేశారు. అయితే ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంస్ధల నిర్మాణ పనుల విషయలో ఉలుకూ పలుకు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తు్న్నా అమరావతిలో కేంద్ర సంస్ధల నిర్మాణాలు చేపట్టకపోవడంపై కేంద్రానికి మరోసారి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏవైతే సంస్ధలు అమరావతిలో స్ధాపించడానికి అనుమతులు లభించాయో ఆ సంస్ధలకే ఈసారి నేరుగా లేఖలు రాయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్ధల నిర్మాణాల విషయలో జరుగుతున్న జాప్యం గురించి ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి కూడా తీసుకు వెళ్ళాలనే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సత్వరమే కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణం పనులు ప్రారంభించకపోతే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశముందని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆందోళణ చెందుతున్నట్లు కనిపిస్తోంది.
అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్మాణాలు అమరావతిలో ప్రారంభించాలంటే అందుకు పరిపాలనా పరమైన అనుమతులతో పాటు కేంద్ర నుంచి నిధుల కేటాయింపులు కూడా జరగాలి. దీనివల్లే నిర్మాణాల ప్రారంభానికి జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. అమరావతిలో ఏర్పాటుకు పలు సంస్ధలకు అనుమతులు అయితే ఇచ్చారు కానీ వాటిలో చాలా సంస్ధలకు పాలనా పరమైన అనుమతులు ఇంకా రాలేదని సమాచారం. అదేవిధంగా నిధుల విడదలపై కూడా ఇంకా క్లారిటీ లేదు. దీనివల్లే కేంద్ర సంస్ధల నిర్మాణాల విషయంలో ఆలశ్యం అవుతోందని తెలుస్తోంది. ఈ వ్యవహరంలో కూటమికి చెందిన పార్లమెంట్ సభ్యులు ఢిల్లోలో ఉన్న ఆయా కేంద్ర ప్రభుత్వ సంస్ధల ప్రధాన కార్యాలయాలకు వెళ్లి పనుల పురోగతిని వాకబు చేస్తున్నారు.
రాజధాని అమరావతిలోని తుళ్లూరు, రాయపూడి తదితర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలకు ప్రభుత్వం స్థలాలను కేటాయించింది. వీటిలో కొన్ని సంస్ధలు నిర్మాణలు ప్రారంభించి సగంలో ఆగిపోయినవి కూడా ఉన్నాయి. రాయపూడి పరిధిలోని జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థకు కేటాయించిన రెండు ఎకరాలు స్థలం ప్రహరీ గోడల వరకే పరిమితమైంది. ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కార్యాలయం భవన నిర్మాణ పనులు కూడా అరకొరగా సాగుతున్నాయి. రాజధాని ప్రాంతంలో మొత్తం 114 ప్రయివేటు, ప్రభుత్వ సంస్థలకు ప్రభుత్వం 1,277 ఎకరాలను కేటాయించింది. అందులో 41 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, శాఖలు, కార్యాలయాలకు 300 ఎకరాలు కేటాయించింది. స్థలాలు కేటాయించి తొమ్మిదేళ్లు పైగానే అయినా ఇంత వరకూ పనులు ప్రారంభించకపోవడం పట్ల అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్, సిఏజి, సిబిఐ, నేవీ, ఆర్మీ, పోస్టల్ , ప్రభుత్వ బ్యాంకులు, ఎల్ఐసి, ఆయిల్ సంస్థలు, హడ్కో, ఫ్యాషన్ టెక్నాలజీ, కేంద్రీయ విద్యాలయాలు, పలు సాంకేతిక సంస్థలకు స్థలాలు కేటాయించినా నిర్మాణాలు చేపట్టకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతి నిర్మాణాలతో పాటు ఈ సంస్ధల నిర్మాణ పనులు కూడా వీలయినంత త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని ప్రజలుకోరుతున్నారు.