ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిలోని మంగళగిరి ఎయిమ్స్‌లో మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎయిమ్స్‌లో ఇప్పటికే ఉన్న విభాగాలతోపాటు.. గుండెకు సంబంధిత ఆపరేషన్ యూనిట్‌ను కూడా ప్రారంభించామని ఎయిమ్స్ డైరెక్టర్ అహంథెం సాంతా సింగ్ తెలిపారు. గుండె చికిత్సలు, శస్త్ర చికిత్సలకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలు చేయడానికి అవసరమైన పరికరాలు ఎయిమ్స్‌లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని, అయితే, ఓపెన్ హార్ట్ సర్జరీని కూడా ఇప్పుడు విజయవంతంగా చేశామని ఆయన తెలిపారు. అంతేకాదు.. మంగళగిరి ఎయిమ్స్‌లో రోబోటిక్ సర్జరీలను కూడా ప్రారంభించామని చెప్పారు.
మరోవైపు.. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిని సీఎం అత్యవసర వైద్యసేవల కోసం కంటింజెన్సీ హాస్పిటల్‌గా కూడా ప్రభుత్వం తాజాగా ఎంపిక చేసింది. ఇప్పటి వరకు మణిపాల్ ఆసుపత్రి ఒక్కటే కంటింజెన్సీ ఆస్పత్రిగా కొనసాగుతోంది. రాష్ట్ర విభజన చట్టానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అమరావతి పరిధిలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్‌ను నిర్మించింది. ఓవైపు.. నిర్మాణం సాగిస్తూనే.. అన్ని హంగులు రూపొందిస్తూనే.. వెసులుబాటును బట్టి, అవకాశాన్ని బట్టి ఒక్కో విభాగాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఎయిమ్స్‌లో ప్రజలకు ఇప్పటికే పలు రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక, కొనసాగింపులో భాగంగా.. ఎయిమ్స్‌లో ట్రామా కేర్ సెంటర్ నిర్మాణం కోసం అదనంగా భూమిని కూడా కేటాయించారు. జాతీయ రహదారిని ఆనుకొని 10 ఎకరాల స్థలం కోసం ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటికే కేటాయించిన 183 ఎకరాల్లో నిర్మించిన ఎయిమ్స్‌లో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయలేదు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం ట్రామా కేర్ సెంటర్ ఆవశ్యకతను గుర్తించింది. ఈ మేరకు ఎయిమ్స్‌కు వెళ్లే దారిలో నేషనల్ హైవే పక్కన కొలనుకొండలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించడం కోసం ప్రతిపాదనలు పంపించారు. దీంతో, ఎయిమ్స్ నిర్వహణలో అక్కడ ట్రామా కేర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎయిమ్స్‌కు మొత్తం 965 పడకలు మంజూరు కాగా.. ప్రస్తుతం 650 పడకలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సంఖ్యను వెయ్యికి పెంచడంతో పాటు అదనంగా ట్రామా కేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేయనున్నారు.