29.2 C
Hyderabad
Friday, May 1, 2026

Live Video

spot_img

రంగంలోకి టెరిటోరియల్‌ ఆర్మీ – ఇదేంటంటే?

పాకిస్తాన్‌తో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రతా పరిస్థితులు మరింత గంభీరంగా మారుతున్న నేపథ్యంలో, భారత ఆర్మీ చీఫ్‌కు అదనపు అధికారాలను అప్పగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దుల్లో పాకిస్తాన్ ఏకపక్షంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తున్న తరుణంలో, భారత ఆర్మీ వాటిని సమర్థంగా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ఆ దాడులు విఫలమైన తర్వాత పాక్ మరిన్ని కుట్రలకు పాల్పడే అవకాశముందని కేంద్రానికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భారత భద్రతను మరింత బలోపేతం చేయడానికి అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించేలా ఆర్మీ చీఫ్‌కు అధికారం ఇచ్చారు. ఈ ఆర్మీలో ఉన్న అధికారులు,నమోదయిన సిబ్బందిని అవసరాన్ని బట్టి పిలిపించే హక్కు కూడా ఆయనకు కల్పించారు. రెగ్యులర్ ఆర్మీతో కలిసి టెరిటోరియల్ ఆర్మీ సన్నద్ధంగా ఉండాలని కేంద్రం స్పష్టంచేసింది.

గతంలో అనేక యుద్ధాలు, ప్రకృతి విపత్తుల సమయంలో టెరిటోరియల్ ఆర్మీ తమ సేవలందించిన సందర్భాలు ఉన్నాయి. 1962, 1965, 1971 యుద్ధాల్లో కూడా ఈ బలగాలు భారత సైన్యంతో కలిసే పనిచేశాయి. ఇటీవల కేరళలో సంభవించిన భారీ వరదల్లో ప్రముఖ నటుడు మోహన్‌లాల్ తనవంతు సేవలను అందించారు. ఆయన లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో టెరిటోరియల్‌ ఆర్మీలో ఉన్నారు. అంతేకాదు, మాజీ క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మాజీ కేంద్రమంత్రి సచిన్ పైలట్, క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, ఎంపీ అనురాగ్ ఠాకూర్, ఒలింపిక్ విజేత అభినవ్ బింద్రా లాంటి ప్రముఖులు కూడా టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ స్థాయిలో ఉన్నారు.

ఇది సాధారణంగా ఒక రిజర్వ్ బలగంగా పనిచేస్తుంది. దేశానికి ఆపత్కాలంలో సాయపడే ఉద్దేశంతో ఏర్పాటైన ఈ బలగానికి 1948లో చట్టబద్ధత లభించగా, 1949లో అధికారికంగా ప్రారంభమైంది. రెగ్యులర్ ఆర్మీ తరహాలోనే శిక్షణ పొందే టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది సాధారణంగా ఇతర ఉద్యోగాలలో కొనసాగుతూ అవసరమైనప్పుడు దేశ రక్షణకు రంగంలోకి దిగుతారు. ప్రస్తుతం దాదాపు 50 వేల మంది మన దేశ టెరిటోరియల్‌ ఆర్మీలో ఉన్నట్లు సమాచారం. వీరిలో చాలా మంది శౌర్య, విశిష్ఠ సేవా అవార్డులు కూడా పొందారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com