తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమంలో ఈ ఏడాది జరగనున్న సరస్వతి పుష్కరాల కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. పవిత్రమైన ఈ సంగమం వద్ద జరిగే పుష్కర స్నానానికి లక్షలాది భక్తులు తరలి రానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి యాత్రికులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈనెల 14వ తేదీ రాత్రి 10:35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించనుండగా, అదే సమయంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇక, మరుసటిరోజు ఉదయం నుంచి పుణ్యస్నానాలు ప్రారంభమవుతాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సరస్వతి పుష్కరాలు కావడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
సరస్వతీ నది పుష్కరాల నేపథ్యంలో భక్తులకు సమాచారం అందించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కాళేశ్వరం పుష్కరాలకు సంబంధించిన వివరాలు భక్తులకు తెలియ జేయనున్నట్లు తెలిపారు.
పుష్కరాల కోసం తరలివచ్చే భక్తుల కోసం స్నాన ఘాట్లు, చలువ పందిళ్లు, శాశ్వత మరుగుదొడ్లు, టెంట్‌లు వంటి పలు సౌకర్యాల కల్పనపై అధికారులు దృష్టి పెట్టారు. మిగిలిన చిన్న చిన్న పనులు కూడా మే 14 నాటికి పూర్తయ్యేలా చూస్తున్నామని మంత్రులు తెలిపారు. ఆర్టీసీ బస్సులను అవసరానికి అనుగుణంగా నడపాలని అధికారులకు సూచించారు. తెలంగాణలో అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకంతో దేవాదాయ శాఖకు లాభం కూడా లభిస్తోందని మంత్రి కొండా పేర్కొన్నారు.
పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలంటూ అధికారులను ఆదేశించారు. ఉత్తరభారతంలో ప్రయాగ్ వంటి పవిత్ర సంగమాల తరువాత, దక్షిణ భారతంలో కేవలం కాళేశ్వరం త్రివేణి సంగమంలోనే సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని తెలిపారు. పుష్కర స్నానం చేసిన వారికి పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
ప్రతి రోజు ఒక పీఠాధిపతి పుష్కర స్నానంలో పాల్గొననున్నట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. పుష్కర ప్రారంభ రోజైన మే 15న మెదక్ జిల్లా రంగంపేటలోని శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠానికి చెందిన మాధవానంద సరస్వతి స్వామి, ఈ పుణ్యస్నాన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు.
సమ్మక్క సారలమ్మ జాతర, భద్రాచలం కల్యాణం మాదిరిగానే సరస్వతీ నది పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.