దేశ భద్రతపై నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం సాయంత్రం ఆరు గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు.
పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ఇవాళ ఉదయం జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. దేశ సైన్యం పట్ల ప్రజల మద్దతును ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమయంలో రాజకీయాలు, పార్టీ భావజాలాలకు తావు లేదని, దేశ భద్రతే ముఖ్యమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరస్థితుల నేపథ్యంలో అత్యవసర సేవల విభాగాల్లో పనిచేసే ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. మంత్రులు, అధికారులు అప్రమత్తంగా, అందుబాటులో ఉండాలని, అలాగే, విదేశీ పర్యటనలు తక్షణమే రద్దు చేసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు మీడియా లేదా సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
మరోవైపు.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి వచ్చి అనధికారికంగా నివసిస్తున్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌మాచార వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని, రక్త నిల్వలు, అత్యవసర ఔషధాలు సిద్ధంగా ఉంచాలని, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్లు, వసతులపై నిరంతర సమాచారం సేకరించి పెట్టుకోవాలని, అలాగే, రెడ్ క్రాస్ సమన్వయంతో సహకారం తీసుకోవాలని, ఆహార నిల్వలు తగినంతగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులకు మార్గ నిర్దేశం చేశారు.
ప్రస్తుత గంభీర పరిస్థితుల నేపథ్యంలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే వారిపై ఉక్కు పాదం మోపాలని, ప్రజల్లో భయాందోళనలు తలెత్తకుండా, ఫేక్ న్యూస్‌ని అరికట్టేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని, సైబర్ సెక్యూరిటీపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ సూచించారు. రాజధాని హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయాలన, అన్ని జిల్లా కేంద్రాలు, సున్నిత ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేయాలని, విదేశీ రాయబార కార్యాలయాలు, ఐటీ కంపెనీల వద్ద భద్రతను పెంచాలని, అవసరమైతే పీస్ కమిటీలతో చర్చలు జరపాలని, పాత నేరస్తులు, హిస్టరీ షీటర్లపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచాలని రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.