- భారత రక్షణ శాఖ వెబ్ సైట్స్ హ్యాకింగ్
- హ్యాకింగ్ కు గురైన ఎంఈఎస్, పరికర్ సంస్థల సైట్లు
- హ్యాక్ చేసిన పేజీలను అప్లోడ్ చేసిన పాక్
- మన యుద్ధ ట్యాంక్ స్థానంలో పాక్ ట్యాంక్ రీప్లేస్
- సాయుధ వాహన నిగం లిమిటెడ్ వెబ్ సైట్ డీఫేస్ చేసే యత్నం
- భారత రక్షణాధికారుల వివరాల హ్యాకింగ్
- నిరంతరంగా చెక్ చేస్తున్న భారత అధికారులు
- హ్యాకర్ల చేతిలో పరికర్ సంస్థకు చెందిన 10 జీబీ డాటా
పెహల్గాం లో ఉగ్రదాడి పై ఆగ్రహంతో రగిలిపోతున్న భారత్ తో కోరి కోరి గొడవలు తెచ్చుకుంటోంది పాకిస్థాన్. రెండు దేశాలమధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంటే పాకికస్థాన్ తన దుష్ట బుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది. తాజాగా పాక్ హ్యాకర్లు భారత రక్షణ శాఖ వెబ్ సైట్ ను హ్యాక్ చేశారు.అత్యంత కీలకమైన వ్యక్తిగత సమాచారాన్నిఈ హ్యాకర్లు తస్కరించి ఉండొచ్చని మన రక్షణ శాఖ అనుమానిస్తోంది. రక్షణ శాఖలో కీలక అధికారుల సమాచారంతో పాటు వారి లాగిన్ క్రెడెన్షియల్స్ కూడా హ్యాక్ అయినట్లు అనుమానిస్తున్నారు.
పాకిస్థాన్ సైబర్ ఫోర్స్ తన ట్విటర్ హాండిల్ లో హ్యాకర్లు భారత రక్షణ శాఖ వెబ్ సైట్ నుంచి, మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్ సెంటర్ నుంచి, డిఫెన్స్ అధ్యయన సంస్థ మనోహర్ పరికర్ సంస్థ నుంచి అత్యంత కీలకమైన సమాచారం చోరీ చేసినట్లు పాకిస్థాన్ ట్వీట్ చేసింది. రక్షణ శాఖ అధీనంలో ఉన్నపబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ సంస్థ సాయుధ వాహన నిగం లిమిటెడ్ కంపెనీ వెబ్ సైట్ ను డీఫేస్ చేసేందుకు హ్యాకర్లు ప్రయత్నించారని మన అధికార వర్గాలు కూడా థృవీకరించాయి. ఇప్పటికే వెబ్ సైట్ ను ఆఫ్ లైన్ చేసి ఆడిట్ చేస్తుండగా, హ్యాకింగ్ ప్రయత్నం వల్ల వెబ్ సైట్ కు ఏదైనా నష్టం జరిగిందా అన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
నిరంతర పర్యవేక్షణ…
సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఎప్పటికప్పుడు సైబర్ స్పేస్ ను మానిటర్ చేస్తూ పాకిస్థాన్ కు లింకున్న ప్రమాద కార సంస్థలేవైనా మరిన్ని దాడులు చేస్తాయేమోనని పరిశీలిస్తున్నారు.మరిన్ని సైబర్ దాడులు, చొరబాట్లు జరగకుండా మన రక్షణ మౌలికవనరులను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
పాకిస్థాన్ సైబర్ ఫోర్స్ ట్విటర్ హ్యాండిల్ హ్యాకింగ్ కు గురైన సాయుధవాహన నిగం లిమిటెడ్ వెబ్ సైట్ కు చెందిన వెబ్ పేజీల ఇమేజ్ ను ట్విటర్ లో అప్ లోడ్ చేసింది. ఆ ఇమేజ్ లో ఇండియన్ ట్యాంక్ స్థానంలో పాకిస్థానీ ట్యాంక్ ను రిప్లేస్ చేశారు. ఇక మరొక పోస్టులో భారత రక్షణ అధికారుల పేర్లు అప్ లోడ్ చేశారు. దానిపై హ్యాక్డ్.. మీ భద్రత ఒక భ్రమ.. ఎంఈ ఎస్ డాటా సొంతం చేసుకున్నాం అనే సందేశాన్ని వదిలారు. మనోహర్ పరికర్ ఇనిస్టిట్యూట్ కు చెందిన1600 మంది యూజర్లకు చెందిన 10 జీబీ డాటా ని హ్యాకర్లు యాక్సెస్ చేశారు.
దాయాది దేశం గుంటనక్క బుద్ధి
పెహల్గాం దాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. పాక్ ప్రేరిత ఉగ్రవాదుల హస్తాన్ని భారత్ ఆధారాలతో బయటపెడుతున్నా పాకిస్థాన్ తమకు సంబంధం లేదని బుకాయిస్తోంది.26 మంది అమాయక టూరిస్టుల ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రవాదులకు పాక్ మద్దతు ఇవ్వడంపై మండిపడుతున్న భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తామని ప్రకటించగానే పాకిస్థాన్ చెలరేగింది. అదే జరిగితే ఇది యుద్ధానికి దారి తీసే చర్యగా పరిగణించి తాము కూడా తలపడతామని హెచ్చరించింది. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఉద్రిక్త పరిస్ఙితుల్లోనే పాకిస్తానీ హ్యాకర్లు భారత రక్షణ దళాల వెబ్ సైట్ ని హ్యాక్ చేశారు. శ్రీనగర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్మీ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్ డాటా బేస్, ఐఏఎఫ్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ పోర్టల్ లను అటాక్ చేశారు.