- మీకిలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్?
- కేఏపాల్ కు సుప్రీం చురకలు
ఈవీఎంల ఓటింగ్ మోసపూరితమైనదని ట్యాంపరింగ్ కు ఆస్కారముందని వాదించే వాళ్లకి సుప్రీం కోర్టు ఘాటైన రిప్లయ్ ఇచ్చింది. ఎన్నికల్లో గెలిస్తే అది తమ ఘనత ఓడిపోతే అది ఈవీఎంల మోసం అనడం అందరికీ మామూలైపోయిందని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈవీఎంల నుంచి బ్యాలెట్ విధానానికి ఎన్నికలు మార్చాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే. ఏ పాల్ పిటిషన్ తో పాటు, ఎన్నికల్లో డబ్బులు పంచుతూ పట్టుబడిన వారిని ఐదేళ్ల పాటు అనర్హులుగా ప్రకటించాలన్న పిటిషన్లపైనా సుప్రీం కోర్టు స్పందించింది. ఈ అంశాలపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ విక్రమ్ నాథ్, పీ.బీ. వరాలే ల బెంచ్‌తో కూడిన ధర్మాసనం పరిశీలించి ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్లో గెలిస్తే అది తమ ఘనత.. ఓడిపోతే ఈవీఎంల మోసం అనడం ప్రతీ వారికి అలవాటుగా మారిందంటూ చురకలేసింది.
మీకిలాంటి ఐడియాలెలా వస్తాయని పిటిషనర్ కే. ఏ. పాల్ ను ధర్మాసనం తీవ్రంగా ప్రశ్నించింది. ఎక్కడా వినని వింతైన ప్రజా ప్రయోజనాల పిటిషన్లు ఎలా వేస్తారు? ఇలాంటి బ్రిలియంట్ ఐడియాలు మీకెలా వస్తాయి? అని సూటిగా ప్రశ్నించింది. మీరు చేసేపని, కార్యకలాపాల ఫీల్డ్ వేరు కదా ఎన్నికల సంఘంలో మీరెందుకు తల దూరుస్తున్నారని ప్రశ్నించింది. కే. ఏ. పాల్ క్రైస్తవ మిషనరీకి అధ్యక్షుడుగా ఉంటూ గాస్పెల్ ప్రచారం చేస్తుంటారు. తాను ప్రపంచ శాంతికి పాటుపడినట్లు , మూడు లక్షల మంది అనాధలను రెస్క్యూ చేసినట్లు, 40 లక్షలమంది వితంతువులకు ఆర్థికంగా సాయపడినట్లు చెబుతుంటారు. అలాంటి పాల్ ఇలా ఎన్నికల ప్రక్రియలో తలదూరుస్తూ చీటికి, మాటికీ పిల్స్ దాఖలు చేయడమేంటని సుప్రీంకోర్టు మందలించింది.
టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ కూడా ఈవీఎంలను ట్యాంపర్ చేయచ్చని, హ్యాక్ చేయవచ్చని అన్నాడని, గతంలో చంద్రబాబు, మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ కూడా ఇదే రకంగా ఆరోపణలు చేశారని పాల్ కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు బ్యాలెట్ పేపర్ విధానాన్నే అనుసరిస్తున్నాయని పాల్ తరపు పిటిషనర్ కోర్టు దృష్టికి తేగా, ఇతర దేశాలకన్నా భారత్ భిన్నంగా ఉండాలని ఎందుకు కోరుకోరు అని సుప్రీం కోర్టు తిరిగి ప్రశ్నించింది.