ఫేక్ న్యూస్ వైరల్ చేస్తోన్న పలు సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. రేపు జరగనున్న నీట్ యూజీ పరీక్షకు సంబంధించి పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లకు చెందిన అకౌంట్లలో తప్పుడు వార్తలు షేర్ చేశారు. అలాంటి అకౌంట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గుర్తించింది. 120కి పైగా సోషల్ మీడియా అకౌంట్ల నిర్వాహకులపై కేసులు పెట్టింది.
జాతీయ స్థాయిలో వైద్య విద్యలో ప్రవేశాల కోసం ప్రతియేటా నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తారు. నీట్ యూజీ పరీక్ష కోసం 550 నగరాల్లో 5వేలకు పైగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే, ఈ పరీక్షకు సంబంధించి తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. దీంతో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ – ఎన్‌టీఏ ఇలాంటి అకౌంట్లపై దృష్టి సారించింది. ఈ సమయంలో నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంటూ తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌టీఏ అలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసిన 120కి పైగా అకౌంట్లను గుర్తించి కేసులు నమోదు చేసింది. ఎన్‌టీఏ కేసులు పెట్టిన వాటిలో 106 టెలిగ్రామ్ ఛానళ్లు, 16 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయి. నీట్ యూజీ 2025 పరీక్ష ప్రశ్నాపత్రం అందుబాటులో ఉందని ఈ ఛానళ్లలో ఫేక్ న్యూస్ పోస్ట్ చేసి.. విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు. జాతీయ స్థాయి వైద్య ప్రవేశ పరీక్షకు ముందు అభ్యర్థులను తప్పుదోవ పట్టించి భయాందోళనలు సృష్టించడమే ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉద్దేశంగా కనిపిస్తుందని ఎన్‌టీఏ పేర్కొంది.
ఈ కేసులన్నింటినీ కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ)కు రిఫర్ చేశారు. అందుకే తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా, విద్యార్థులు భయాందోళనకు గురికాకుండా ఈ ఛానళ్లను తక్షణమే తొలగించాలని టెలిగ్రామ్, ఇన్‌స్టాకు కూడా ఆదేశాలు వెళ్లాయి.