కేంద్ర ప్రభుత్వం దేశంలో కులగణన చేపట్టబోతున్నట్టు ప్రకటించిన వెంటనే, దీనిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ ఘర్షణ మొదలయ్యింది. కేంద్రంలో అధికార ఎన్డీఏ తరపున బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పరస్పరం క్రెడిట్ తమదంటే తమదంటూ వాదించుకుంటున్నాయి. ఈ ప్రకటన వచ్చిన మరుసటి రోజే ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సమీపంలో రాహుల్ గాంధీకి కులగణన క్రెడిట్ ఇస్తూ ఓ పోస్టర్ దర్శనమిచ్చింది.
ఈ పోస్టర్‌లో రాహుల్ గాంధీ ఫొటోతో పాటు.. “కులగణన కోసం మేము పోరాడాము. మేమే విజయానికి కారణం” అనే నినాదం ఉంది. రాహుల్ గాంధీ గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా కులగణన వాదన వినిపిస్తున్నారు. ఇది వెనుకబడిన వర్గాల సాధికారతకు మార్గం సుగమం చేస్తుందని రాహుల్ గత ఎన్నికల ముందు నుంచీ చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటన తర్వాత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. “మోదీ జీ, కులగణన అవసరం. మేమే చెప్పాం. మేమే చేయించాం. పారదర్శకమైన కులగణన అవసరం. ఏ రంగంలో ఎవరికెంత ప్రాతినిథ్యం ఉందో దేశ ప్రజలకు తెలుస్తుంది” అని సోషల్ మీడియా పోస్ట్‌లో రాహుల్ పేర్కొన్నారు. దేశ ప్రజలకు గర్వ కారణంగా పోరాటం చేశామన్నారు.
అయితే, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ వాదనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. “కులగణన విషయంలో తప్పుడు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ మొదలుకుని, ఇందిరా గాంధీ వరకు కాంగ్రెస్ నేతలు కుల ఆధారిత చర్చలకు ఎప్పుడూ వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు రాజకీయ లబ్దికోసం అదే అంశాన్ని మళ్ళీ తెరపైకి తెస్తున్నారు” అని విమర్శించారు. మండల్ కమిషన్ అమలును గుర్తు చేస్తూ.. ఆ సమయంలో బీజేపీ పూర్తి మద్దతు ఇచ్చిందని, అది వెనుకబడిన వర్గాలకు జరిగిన నిజమైన న్యాయం అని, కానీ కాంగ్రెస్ మాత్రం ఎప్పుడూ తటస్థంగా ఉండేదని ధర్మేంద్రప్రధాన్ స్పష్టం చేశారు.
మరోవైపు.. ఇదే అంశంపై తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు కూడా స్పందిస్తున్నారు. కుల గణన అంశంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు ప్రకటిస్తున్నారు. అవసరమైతే జాతీయస్థాయిలో కుల గణనకు తాము సహకరిస్తామని కూడా చెబుతున్నారు. కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచన మేరకే తాము తెలంగాణలో విజయవంతంగా కుల గణన చేశామని కూడా చెబుతున్నారు.
ఈ కులగణన అంశం రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన అజెండాగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరు నిజంగా వెనుకబడిన వర్గాల కోసం పోరాడుతున్నారో? ఎవరు ప్రచార ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారో? అనే ప్రశ్నలకు ప్రజలే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మొత్తానికి కుల గణన రాజకీయంగా మరొక కీలక మైలురాయిగా మారుతోంది. ఎవరి వాదనలు ప్రజలను మెప్పిస్తాయో, ఎవరి చర్యలు నిజమైన సామాజిక న్యాయానికి దోహదపడతాయో చూడాలి.