-
యేడాదిగా ఊరిస్తోన్న బీజేపీ అధ్యక్ష పదవి
-
చకోర పక్షుల్లా ఎదురుచూస్తోన్న ఆశావహులు
-
లీకులతోనే కాలం వెల్లదీస్తోన్న అధిష్టానం
-
ఇప్పట్లో నియామకం ఉండబోదన్న క్లారిటీ
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి దాదాపు యేడాది కాలంగా ఊరిస్తూనే ఉంది. అదిగో.. ఇదిగో.. అప్పుడు.. ఇప్పుడు.. అంటూ కాలం గడిచిపోతూనే ఉంది. పైగా.. తరచూ ఈ అంశంపై ముఖ్యనేతలే మీడియాకు లీకులు ఇస్తూ.. చర్చకు కారణమవుతున్నారు. ఫలితంగా.. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న వాళ్లలో ఆశలు నింపుతున్నారు. ఊరించి ఊరించి ఉసూరుమనిపిస్తున్నారు.
వాస్తవానికి గత యేడాది పార్లమెంటు ఎన్నికలు పూర్తయినప్పటినుంచీ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి కొత్త వాళ్లను నియమిస్తామంటూ ఇటు రాష్ట్ర పార్టీతో పాటు.. జాతీయ స్థాయిలో అధిష్టానం కూడా చెబుతూ వస్తున్నాయి. తరచూ డెడ్‌లైన్‌లు కూడా పెడుతూనే ఉన్నాయి. ఆ పదవిపై ఆశలు పెంచుకున్న వాళ్లలో ఉత్సుకతను పెంచుతున్నాయి. కానీ, ప్రకటన మాత్రం ఇంకెంత దూరం? అన్నట్లుగానే సాగిపోతూ ఉంది.
రాష్ట్ర బీజేపీ సారథి పీఠంపై ఆశలు పెట్టుకున్న వాళ్లు.. తమకు ఉన్న దారుల గుండా, సోర్సుల గుండా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ప్రకటన ఉంటుందని చర్చ జరిగినప్పుడల్లా ఢిల్లీకి కూడా వెళ్లి.. అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ, రేపు, మాపు అంటూ.. మరింతగా దాటవేసే ధోరణి అవలంబిస్తోంది బీజేపీ అధిష్టానం. తరచూ ఏదో ఓ కారణం చూపుతూ ఈ నియామక ప్రక్రియకు కామా పెడుతోంది. కానీ, అది కామా కాదని, ఇక.. ఇప్పటికైతే ఫుల్‌స్టాప్ పెట్టినట్లే అని సొంత పార్టీలోనే సెటైర్లు వినిపిస్తున్నాయి.
బీజేపీ అధిష్టానం వ్యవహార శైలిపై ఇక్కడి పలువురు ముఖ్యనేతలు, పార్టీ శ్రేణుల్లో కూడా అసహనం పెరిగిపోయింది. అయితే, ఇదే సమయంలో పలు సందేహాలు కూడా కార్యకర్తలను తొలచి వేస్తున్నాయి. పార్టీలో కీలకమైన ఈ పదవి విషయంలో అధిష్టానం అలసత్వం వహిస్తోందా? లేదంటే అంతర్గతంగా గ్రూపు రాజకీయాలు కారణమా? అన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే, రాష్ట్రంలో పార్టీ బలాన్ని మరింత పెంచాలంటే కొత్త నాయకత్వం అవసరం అనే వాదనలు బలంగా వినిపిస్తున్నా. అధిష్టానం మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులు, పరిణామాలు పార్టీలో జోష్‌ను కూడా దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు.
ఇక, బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి ఇప్పట్లో ఉండదన్న క్లారిటీ వచ్చేసిందంటున్నారు పార్టీ నేతలు. అందుకే ఆ పదవిపై కన్నేసిన వాళ్లు, ఇన్నాళ్లుగా ప్రయత్నాలు చేసిన వాళ్లు కూడా సైలెంట్ అయిపోయారు. ఇక, దాని గురించి ఆశలు పెట్టుకొని, చకోర పక్షుల్లా ఎదురు చూడటం అనవసరమన్న అభిప్రాయానికి వచ్చారంటున్నారు.
ఈ ఆలోచనలకు, అభిప్రాయాలకు కూడా కారణం లేకపోలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అధిష్టానం మొత్తం కశ్మీర్‌వైపే దృస్టి సారించాయి. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. పహల్ గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాలన్న రీతిలో వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ సమయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని మార్చడం అనే అంశం పూర్తిగా కనుమరుగైపోయింది. ప్రస్తుతం పరిస్థితులు అవే సంకేతాలు ఇస్తున్నాయి.