39.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

తెలంగాణ రైజింగ్ ఎవరూ ఆపలేరు: మేడే వేడుకల్లో సీఎం రేవంత్

కార్మికులే రాష్ట్ర నిర్మాణానికి వెన్నెముకలుగా నిలుస్తున్నారని, వారి చెమట చుక్కలే ప్రపంచ అభివృద్ధికి బాటలు వేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో కార్మిక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కార్మికుల ఉద్యమం ప్రపంచంలోని అన్ని విప్లవాలకు ప్రేరణగా నిలుస్తోందని అన్నారు.

తెలంగాణ సాధనలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్‌, అసంఘటిత కార్మికులు పోషించిన పాత్రను సీఎం గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తోందని స్పష్టం చేశారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా ఇచ్చి బోనస్ అందించడం ప్రజా ప్రభుత్వం ప్రత్యేకత అన్నారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టామనీ, విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో అక్కడ తీవ్ర నష్టాలు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం ఒక విధానంతో విద్యుత్ వ్యవస్థను తిరిగి నిలబెడుతున్నామని వివరించారు.

గత పదేళ్ల పాలన రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిందని ఆరోపించిన రేవంత్, ప్రభుత్వానికి చేతిలో ఉన్నది అప్పులే అన్నారు. గత ప్రభుత్వం రూ.8.29 లక్షల కోట్ల బకాయిలు మిగిల్చిందని, కేవలం కాంట్రాక్టర్లకే రూ.50 వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టిందని విమర్శించారు.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిందని గుర్తుచేశారు. సర్పంచులకు బకాయిలు కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందన్నారు. గత పదేళ్ల ఆర్ధిక దోపిడీ ఫలితంగా నేడు రాష్ట్రం బతుకు దెరువు కోసం పోరాడుతోందని సీఎం రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. “సమ్మె మానేయండి, ఇది మీ సంస్థ, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది,” అంటూ విజ్ఞప్తి చేశారు. సమస్యలు ఉంటే మంత్రులతో చర్చించాలి కానీ, పంతాలు పట్టింపులకు పోకూడదన్నారు. “ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలోకి వస్తోంది. సమ్మె చేస్తే సంస్థకు, రాష్ట్రానికి నష్టం కలుగుతుంది,” అని హెచ్చరించారు. సమ్మెను అణచివేసి 50 మంది కార్మికులను తొలగించిన ఘటన గత పాలకుల ఘాతుకానికి ఉదాహరణన్నారు.

“మీరు పంపిన పిల్లలు అసెంబ్లీలో ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేకపోయినా, కనీసం ప్రధాన ప్రతిపక్షనేతగా అవకాశం ఇవ్వలేదా?” అంటూ రేవంత్ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కపట నాటకాల సూత్రధారి మళ్లీ రంగంలోకి దిగాడని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గత పదిహేను నెలలు తాను, తన మంత్రులు నిద్రలేని రాత్రులు గడిపారని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోందని, మరో ఏడాదిలో గాడిలో పడుతుందని తెలిపారు. వచ్చే ఆదాయాన్ని కార్మికులకే అప్పగిస్తామని, ఎలా ఖర్చు చేయాలో వారు నిర్ణయించాలని చెప్పారు. “అణాపైసా కూడా ఇంటికి తీసుకెళ్లే ప్రసక్తే లేదు. ప్రజల కోసమే ఖర్చు చేస్తాం” అని భరోసా ఇచ్చారు.

అసంఘటిత కార్మికుల కోసం గిగ్ వర్కర్స్ పాలసీ త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు సీఎం తెలిపారు. ఇది దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందని, కార్మికులకు మేలు చేయడమే తమ ప్రభుత్వ విధానమని తెలిపారు. “తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు” అని ధీమా వ్యక్తం చేశారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com