అప్పన్న సనిధిలో ప్రహరీ కూలి ఏడుగురు మృతి చెందిన సంఘటనపై విచారణకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ ఘటనా స్ధలిని పరిశీలించింది. గురువారం ఉదయం సింహాచలం చేరుకునన త్రిసభ్య కమిటీ ముందుగా సింహాద్రి వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని అనంతరం దుర్ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తిసభ్య కమిటీ వేయాలని ఆదేశించిన వెంటనే మున్సిపల్ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శ ఎస్.సురేష్‌కుమార్ అధ్యక్షతన ఐజీ ఆకే రవికృష్ణ, నీటిపారుదల శాక ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావులను సభ్యులగా నియమిస్తూ సీయం విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. 72 గంటల్లో సింహాచలం ఘటనపై నివేదిక ఇవ్వాలని సీయం ఈ త్రిసభ్య కమిటీని ఆదేశించారు. దీంతో గురువారం ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్న త్రిసభ్య కమిటీ బృందం అక్కడ మట్టి శాంపిల్స్ ను సేకరించారు. అదేవిధంగా గోడ నిర్మాణంపై కూడా కమిటీ ఆరా తీసింది. ప్రహరీ గోడ నిర్మాణం కేంద్రప్రభుత్వ ప్రసాదం స్కీమ్ లో జరిగిన నేపథ్యంలో దేవాదాయ శాఖ అదికారులతో పాటు పర్యాటక శాఖ అధికారులను కూడా పిలిచి విచారణ కమిటీ వారితో సమావేశం అయ్యింది.
గోడను నిర్మిచి ఎన్ని రోజులైంది. అనుమతులు ఎవరు ఇచ్చారు. డిజైన్ చేసి కట్టారా లేదా అన్న వివరాలను కమిటీ సభ్యులు సేకరించారు. గోడ నిర్మాణంలో సూచనలు టూరిజం శాఖ అధికారులు ఇచ్చారా లేక దేవాదాయ శాఖ అధికారులు ఇచ్చారా అన్న విషయంపై కూడా విచారణ కమిటీ ఆరా తీసింది. అధికారుల సూచనల మేరకే గోడను నిర్మించామని కాంట్రాక్టర్ విచారణ కమిటీకి స్పష్టం చేశారు. ఈ విచారణలో త్రిసభ్య కమిటీకి కాంట్రాక్టర్ విస్తుపోయే నిజాలు చెప్పినట్లు సమాచారం. అధికారులు నాపై ఒత్తిడి తెచ్చి గోడ కట్టించారని, చందనోత్సవానికి సమయం తక్కువగా ఉంది… భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.. ఈ గ్యాప్ లో నేను గోడ కట్టనని అధికారులకు చెప్పానని, ఆరు రోజుల్లో గోడ నిర్మాణం సాధ్యం కాదని తాను అధికారులకు స్పష్టంగా చెప్పానని కాంట్రాక్టర్ త్రిసభ్య కమిటీ ముందు చెప్పినట్లు తెలుస్తోంది. అయినా సరే గోడ కట్టమని తనపై దేవాలయ, పర్యాటక శాఖ అధికారులు ఒత్తిడి తెచ్చినట్లు సదరు కాంట్రాక్టర్ త్రిసభ్య కమిటీకి వెల్లడించినట్లు సమాచారం. టెంపరరీ గోడ అని చెప్పడంతో నాలుగు రోజుల ముందే పని మొదలు పెట్టినట్లు కాంట్రాక్టర్ లక్మణరావు కమిటీకి చెప్పాడని తెలుస్తోంది. గురువారం సేకరించిన వివరాలతో పాటు కొందరు ప్రత్యక్ష సాక్షులు, దేవాలయ అర్చకులు, భక్తులతో కూడా మాట్లాడి 72 గంటలలోగా త్రిసభ్య కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించనుంది.