38.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

రాహుల్‌ క్యాంపెయిన్‌పై బీజేపీ బిగ్‌ స్ట్రోక్‌

  • మోదీ, మోహన్ భగవత్‌ భేటీ వెనుక మెయిన్‌ రీజన్‌
  • కేంద్రం కులగణన ప్రకటనకు దిమ్మదిరిగే వ్యూహం

నిన్నా మొన్నటిదాకా కులగణన అంటేనే పెదవి విరిచిన, ముఖం చాటేసిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అకస్మాత్తుగా తద్విరుద్ధంగా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టనున్నట్లు ప్రకటించింది. వచ్చే జనాభా లెక్కలతో పాటే కుల గణన కూడా నిర్వహిస్తామని తెలిపింది. ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్‌ కూడా ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ మేరకు ఈ సంచలనం నిర్ణయం తీసుకున్నారు.

ఇన్నాళ్లూ అసలు కులగణన ప్రసక్తే లేదన్న బీజేపీ.. ఇప్పటికిప్పుడు ఎవరూ ఊహించని విధంగా నిర్ణయం తీసుకోవడం వెనుక విస్మయం వ్యక్తమవుతోంది. సరిహద్దుల్లో పహల్గాం ప్రకంపనలు కొనసాగుతున్న వేళ.. యుద్ధ మేఘాలు అలుముకుంటున్న సమయంలో.. ఇప్పుడీ రాజకీయ నిర్ణయం తీసుకోవడంపై పలు రకాల విశ్లేషణలు సాగుతున్నాయి.

కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పటినుంచీ నరేంద్రమోదీ ప్రధాన మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మొన్నటికి మొన్న మూడోసారి కూడా ఎన్టీయే విజయఢంకా మోగించడంతో.. ఇప్పుడు కూడా కేంద్రంలో కాషాయ జెండా రెపరెపలాడుతోంది. అయితే, నరేంద్రమోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచీ.. 2014 నుంచి ఇప్పటివరకు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ప్రధాన మంత్రి అధికారిక నివాసానికి వెళ్లలేదు. రాజకీయ, దేశ సమకాలీన అంశాలపై నేరుగా చర్చించలేదు. కానీ, కేంద్రం కులగణన ప్రకటించక ముందు రోజు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ సర్‌ సంఘ్‌ చాలక్ మోహన్‌ భాగవత్‌ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. న్యూఢిల్లీలోని నెంబర్‌ 7, లోక్‌ లగ్యాన్‌ మార్గ్‌లోని ప్రధాని అధికారిక నివాసానికి భగవత్‌ వెళ్లారు. ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ భాగవత్‌ సమావేశం తర్వాతే జాతీయ స్థాయిలో కులగణనకు ప్రకటన వెలువడింది. మరి.. మోదీతో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ భేటీకి, కుల గణన ప్రకటనకు సంబంధం ఉందా? ఉందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

పహల్‌గాం దాడి తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ పలు వేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. తాము బలమైన ప్రతిస్పందన ఆశిస్తున్నామని, పర్యాటకుల మతం అడిగిన తర్వాతే వాళ్లు ప్రజలను చంపేశారని, హిందువులు ఎప్పటికీ అలాంటి పని చేయరని మోహన్‌ భాగవత్‌ వ్యాఖ్యానించారు. అలాగే… ఈ పరిణామంతో తమ హృదయాల్లో బాధ ఉందని, తాము కోపంగా ఉన్నామని కూడా బహిరంగ సభా వేదికపై నుంచి ప్రసంగించారు. దీంతో పాటు.. ప్రధాని మోదీ పేరు చెప్పకుండానే ఆయన బాధ్యతను గుర్తు చేశారు. “మన పొరుగువారిని మనం ఎప్పుడూ అవమానించబోం, లేదా హాని చేయం. కానీ ఎవరైనా చెడు వైపు తిరిగితే, వేరే మార్గం ఏమిటి? ప్రజలను రక్షించడం రాజు విధి. రాజు తన విధిని నిర్వర్తించాలి. పోకిరీలకు గుణపాఠం నేర్పడం కూడా విధిలో భాగమే” అని మోహన్‌ భాగవత్‌ వ్యాఖ్యానించారు.

మోదీతో భేటీలో భాగవత్‌ ప్రధానంగా ఇదే అంశంపై చర్చించి ఉంటారని అందరూ భావించారు. కానీ, ఈ భేటీలో కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారని ఈ ప్రకటన తర్వాత అర్థమవుతోంది. కేబినెట్ భేటీలో పాక్ పై తీసుకోవాల్సిన చర్యల విషయంలో వ్యూహాల గురించి ఏ నిర్ణయమూ బయటకు రాలేదు. కానీ, కులగణన అంశం తెరపైకి రావడంతో వీరిద్దరి భేటీ ఇప్పుడు రాజకీయంగా మరింత ప్రాధాన్యతగా మారింది.

తెలంగాణలో కులగణన నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదించడం, త్వరలో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కుల గణన నిర్ణయం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి బీజేపీపై కులగణన అంశాన్ని ప్రధానాస్త్రంగా ప్రయోగించింది. తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడుతామని రాహుల్‌గాంధీ ప్రకటిస్తూ వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో.. ఇక్కడ కుల గణన చేపట్టి.. దేశ వ్యాప్తంగా ఈ అంశాన్ని ఎన్నికల క్యాంపెయిన్‌గా వాడుకుంటున్నారు. ఇదే మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నామని రాహుల్ ప్రచారం చేస్తున్నారు. కులగణన క్యాంపెయిన్‌తోనే బీజేపీని కార్నర్ చేయాలని ఆయన తన ప్రణాళికలకు పదును పెడుతున్నారు. ఈ దేశంలో కులగణనకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని అందుకే మోడీ ప్రభుత్వం కులగణన చేయడం లేదని కూడా రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే, ఈ విషయంలో ఇన్నాళ్లు మౌనంగా ఉంటూ వచ్చిన బీజేపీ అనూహ్యంగా కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాహుల్ గాంధీ ప్రణాళికతో పాటు కాంగ్రెస్ పార్టీని వ్యూహాత్మకంగా నిలువరించేలా కేంద్రం ఈ బిగ్ స్టెప్ వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో బిగ్ పొలిటికల్ స్ట్రోక్‌గా మారబోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రాహుల్ గాంధీపై బీజేపీ ప్రయోగించిన బలమైన అస్త్రం అనే చర్చ జరుగుతోంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com