కుటుంబంతో సహా భారత్‌లో పర్యటిస్తున్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్.. ప్రస్తుతం జైపూర్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. నాలుగు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన జేడీ వాన్స్ ఫ్యామిలీ.. అంబర్ కోటను సందర్శించారు. వారికి రాజస్తానీ స్టైల్‌లో గ్రాండ్‌వెల్‌కమ్ దక్కింది. ఏనుగులతో స్వాగతం పలికించగా.. రాజస్థానీ నృత్యాలు అందరిని అలరించాయి. వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్, వారి ముగ్గురు పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్ హోటల్ రాంబాగ్ ప్యాలెస్‌లో బస చేశారు.
రాజస్థాన్ రాజధానిలోని సిటీ ప్యాలెస్ కూడా సందర్శించనుంది జేడీ వాన్స్ ఫ్యామిలీ. వారు బుధవారం ఉదయం ఆగ్రాకు బయలుదేరి వెళ్లనున్నారు. అనంతరం వాన్స్ కుటుంబం గురువారం తెల్లవారుజామున అమెరికాకు తిరిగి బయలుదేరుతుంది.
జేడీ వాన్స్ ఫ్యామిలీ టూర్‌తో పాటు భారత్-అమెరికా మధ్య ఉన్న ద్వైపాక్షిక అంశాలపై చర్చలు కూడా జరుపుతున్నారు. ఆయన ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. తన ఇంటికి వచ్చిన వాన్స్ దంపతులు, పిల్లలకు మోదీ స్వాగతం పలికారు. తన ఇంటిని స్వయంగా తిప్పి చూపించారు. పిల్లలతో సరదాగా ఆడుకున్నారు.
ఈ సందర్భంగా ట్రంప్ టారిఫ్‌లు,వాణిజ్యం, ప్రాంతీయ భద్రతతో పాటు అనేక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేడీ వాన్స్ భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి.
వాన్స్ పిల్లలు భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కన్పించి అందరి అటెన్షన్‌ను గ్రాబ్ చేశారు. ఢిల్లీకి చేరుకున్న అనంతరం వాన్స్ దంపతులు అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శించారు. జేడీ వాన్స్ వైఫ్ ఉష మన భారత సంతతికి చెందిన మహిళ. ఆమె తల్లిదండ్రులు, లక్ష్మీ-క్రిష్ ఇండియాలోని ఏపీ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. ఓ రకంగా చెప్పాలంటే వాన్స్ భారత్ అల్లుడే.