30.7 C
Hyderabad
Sunday, May 3, 2026

Live Video

spot_img

అక్కడ తేలాకే.. ఇక్కడ!

  • బీజేపీ తెలంగాణ అధ్యక్ష నియామకంలో మరింత జాప్యం

  • జాతీయ అధ్యక్షుడి ఎంపిక తర్వాతే తెలంగాణపై దృష్టి

  • ఈ దశలో పశ్చిమబెంగాల్, బీహార్, మహారాష్ట్రకే ప్రాధాన్యత

  • తెలంగాణపై ఇంకా ఫీడ్‌బ్యాక్ రావాలంటున్న అధిష్టానం

  • ఇక, మే మొదటి వారంలోనే మోక్షం?

బీజేపీ అధ్యక్షులు ఎవరు? జాతీయ పార్టీతో పాటు.. ఆయా రాష్ట్రాల్లో నియమించాల్సిన అధ్యక్ష పదవులు చాలా కాలంగా పెండింగ్‌లో పడిపోయాయి. అయితే, ఈ అంశంపై రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ కంటే.. జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చే ఎక్కువ. బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకంతో పాటు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా మరో ఆరు రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షుల నియామకం జరగాల్సి ఉంది. నిజానికి ఈ నియామకాలు గత డిసెంబర్‌లోనే జరుగుతాయని అందరూ భావించారు.

ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి అధ్యక్ష ఎన్నిక దాదాపుగా పూర్తయిందని ఒకటి రెండు రోజుల్లోనే పేరు ప్రకటిస్తామని గతంలో స్వయంగా కిషన్ రెడ్డి మీడియాకు తెలిపారు. కారణాలు ఏమైనా ఈ నియామకం దాదాపు ఆరు నెలలుగా పెండింగ్‌లోనే ఉంది. ఒకవైపు ఈ చర్చ జరుగుతూ ఉండగానే.. ఢిల్లీలో జాతీయ నాయకత్వం మరో విధంగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడైతే జాతీయ అధ్యక్ష ఎన్నికను త్వరితగతిన పూర్తి చేయాలని అధిష్టానం భావిస్తోంది. జేపీ నడ్డా పదవీ కాలం ముగిసి చాలా రోజులైనా కొత్త అధ్యక్షుడు ఎవరనే విషయంపై మాత్రం అందరూ సైలెంట్ గానే ఉన్నారు. అయితే, గత నాలుగైదు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే జాతీయ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రెండో వారంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.

మే మొదటి వారం లోపు కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని తాజాగా ఢిల్లీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా సీనియర్ నేతలు రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్ గడ్కరీ పేర్లు బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో వినిపిస్తున్నాయి. అయితే, ఆర్ఎస్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కొత్త అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని అంటున్నారు. చాలా సందర్భాల్లో ఎవ్వరూ ఊహించని నేతను తెరపైకి తీసుకొచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈసారి కూడా అలాంటి పరిణామం నెలకొనే అవకాశం లేకపోలేదని సీనియర్ నాయకులు అంటున్నారు. బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ అడుగులు వేసే అవకాశం ఉంది.

ఇక, తెలంగాణ కొత్త అధ్యక్షుడి విషయంలో మరికొంత కాలం జాప్యం జరిగే అవకాశం ఉందని నాయకులంటున్నారు. మొదట జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తర్వాత తెలంగాణకు సంబంధించిన అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. మరికొద్ది కాలం కిషన్ రెడ్డినే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించాలన్న ఆలోచన అధిష్టానం దృష్టిలో ఉన్నట్టుగా కిషన్‌ రెడ్డి మద్దతు దారులు అంటున్నారు. ఈసారి కొత్త అధ్యక్షుడు ఎవరు వచ్చినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయనే కొనసాగుతారని ఇటీవల కిషన్ రెడ్డి కూడా తెలిపారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ పేరు దాదాపు ఖరారు అయిందని వార్తలు వినిపించినప్పటికీ.. వివిధ కారణాలతో దానికి గ్రీన్ సిగ్నల్ లభించడం లేదు. ఈటల మాత్రం తనకు దాదాపుగా అధ్యక్ష పదవి ఖరారు అయిందని తన వర్గీయులతో అంటున్నారు.

తెలంగాణ కన్నా ముందు మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్‌కు సంబంధించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక ఉంటుందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.ఇటీవల కేరళ, తమిళనాడుకు సంబంధించి అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ సజావుగానే సాగింది. తెలంగాణ విషయంలో మాత్రం ఎందుకు జాప్యం జరుగుతుందో అర్థం కావడం లేదని రాష్ట్ర నాయకులు అంటున్నారు. ఊహాగానాలు ఎలా ఉన్నా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను బట్టి తుది నిర్ణయం ఉంటుందని నేతలు అంగీకరిస్తున్నారు. తెలంగాణ విషయంలో తొందరపాటు నిర్ణయం సరైంది కాదని అభిప్రాయంతో ఢిల్లీలో ఉన్న పెద్దలు ఉన్నారని.. మొదట కీలకమైన పెద్ద రాష్ట్రాలకు సంబంధించి అధ్యక్ష ఎన్నికలు జరిగిన తర్వాత తెలంగాణపై దిష్టి సారించే అవకాశం ఉందని చెబుతున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com