దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్న శాటిలైట్ బేస్డ్ టోల్ సిస్టం అమలుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఈ విధానం అమలు చేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఫాస్టాగ్ బేస్డ్ టోల్ సిస్టం స్థానంలోనే శాటిలైట్ టోల్ సిస్టంను మే 1వ తేదీ నుంచే అమలు చేయబోతున్నారంటూ వార్తలొచ్చాయి. సోషల్ మీడియాతో పాటు.. కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ వార్తలు ప్రచురించాయి. దీనిపై కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టత ఇచ్చింది.
వాహనాల టోల్ ఫీజు వసూలు చేసేందుకు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆపే అవసరం లేకుండా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ -ANPR విధానాన్ని ముందుగా కొన్ని సెలెక్టెడ్ టోల్‌ప్లాజాల దగ్గర బిగిస్తారు. ఇందులో ఏఎన్‌పీఆర్‌తో పాటు ఫాస్టాగ్ కలగలిపిన సర్వీసులు అందిస్తారు. టోల్ గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏఎన్పీఆర్ కెమెరాలు వాహనం నంబర్ ప్లేట్లను గుర్తిస్తే.. వెహికిల్స్ ఆగకుండానే ఫాస్టాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా టోల్ వసూలు చేస్తారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఇ-నోటీసులు జారీ చేస్తారు. ఫాస్టాగ్ రద్దు సహా జరిమానాలు విధిస్తారు. అయితే, ఈ విధానాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది.