తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. సుదీర్ఘ కాలం తర్వాత ప్రజాప్రతినిధిగా బాధ్యతలు చేపట్టి ఆనందంగా ఉన్న సమయంలో ఈ బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా, ఇటీవలే అధికార పార్టీ నుంచి విజయశాంతికి ఎమ్మెల్సీగా అవకాశం లభించింది.
ఈ ఘటనపై విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. చంద్ర కిరణ్ రెడ్డి అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం తమను సంప్రదించి, తాను సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్నని పరిచయం చేసుకున్నాడని తెలిపారు. అప్పట్లో విజయశాంతికి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలు హ్యాండిల్ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరాడని చెప్పారు.
అంతేకాదు, కంటెంట్ క్రియేటర్‌గా పనిచేస్తూ ఆ తర్వాత స్వంతంగా వ్యాపారాలు ప్రారంభించి, తమ పేరు వాడుతూ వ్యాపారం చేశాడని గుర్తించడంతో అతడి సర్వీసులను ఆపేశామని వెల్లడించారు. అప్పట్లో బీజేపీలో ఉన్న సమయంలో కూడా చంద్ర కిరణ్ తమను కలిశాడని, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తన స్వప్రయోజనాల కోసం ప్రయత్నించాడని తెలిపారు.
తమ పేరు వాడుకొని లాభాలు పొందిన చంద్ర కిరణ్ రెడ్డి, తాము బీజేపీ నుంచి బయటకు వచ్చిన తరువాత.. బకాయిలు చెల్లించాలంటూ మెసేజ్ చేశాడని తెలిపారు. అయితే.. తాము చెల్లించాల్సిన బకాయిలు ఏమీ లేవని స్పష్టంగా చెప్పినప్పటికీ, చంద్ర కిరణ్ రెడ్డి ఏప్రిల్ 6వ తేదీన బకాయిలు తీర్చకపోతే శత్రువులుగా మారతాం, మీపై చర్యలు తీసుకుంటా, బజారుకీడుస్తా, మీ సంగతి చూస్తా” అంటూ బెదిరింపు మెసేజ్ పంపాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ కుటుంబాన్ని బెదిరిస్తున్న చంద్ర కిరణ్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ మొదలు పెట్టారు.