27 C
Hyderabad
Monday, June 29, 2026

Live Video

spot_img

రామగుండంలో భూకంప వార్నింగ్‌ : EPIC సంస్థ అంచనా

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్న అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం రామగుండం ప్రాంతంలో భూకంపం సంభవించే అవకాశముందన్న అంచనాలు కలకలం సృష్టిస్తున్నాయి. అయితే, ఇది ప్రజలను భయపెట్టేందుకు కాదని, పక్కా అంచనాలతో ఈ విషయం చెబుతున్నట్లు ఎపిక్‌ అనే సంస్థ పేర్కొంటోంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికే ముందస్తు హెచ్చరికలు చేస్తున్నట్లు ప్రకటించింది.

భూకంపాలపై పరిశోధనలు చేసే EPIC సంస్థ తాజా నివేదిక ప్రకారం, రామగుండం సమీపంలో ఏప్రిల్ 10 నుంచి 17 మధ్యలో రిక్టర్ స్కేల్‌పై 5 మాగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం రావొచ్చని అంచనా వేసింది. ఈ సంస్థ ప్రభుత్వానికి సంబంధించినదేం కాదు. శివ సీతారామ్ అనే భూకంపాలపై ఆసక్తి ఉన్న పరిశోధకుడు దీన్ని ప్రారంభించారు. ఆయన అభివృద్ధి చేసిన ప్రత్యేక అల్గారిథమ్ ఆధారంగా ఈ అంచనాలు ఇస్తున్నారు.

తెలంగాణలో సింగరేణి గనులతో పాటు.. పలు భారీ పరిశ్రమలు ఉన్న గోదావరిఖని, రామగుండం వంటి ప్రాంతాలు భూకంపాలకు అనుకూలంగా ఉండటంతో, గతంలో నుంచే వీటిపై అధ్యయనాలు సాగుతున్నాయి. 2004 సునామీ తర్వాత భూకంపాలపై ఆసక్తి పెరిగిన సీతారామ్, తన సొంత పరిశోధనలతో ఈ వ్యవస్థను నిర్మించారు. www.seismo.in అనే వెబ్‌సైట్‌ ద్వారా ఈ అంచనాలను ప్రజలతో షేర్‌ చేసుకుంటున్నారు.

ఇప్పటి వరకు 22 భూకంపాలను కచ్చితంగా అంచనా వేసిన EPIC, ఇటీవల మయన్మార్‌లో జరిగిన భూకంపాన్ని కూడా ముందుగానే చెప్పింది. సాధారణంగా వారి అంచనాల్లో 1-1.5 మాగ్నిట్యూడ్ తీవ్రత, 2-3 నెలల కాలవ్యవధిలో తేడా ఉండొచ్చు. మయన్మార్ భూకంపాన్ని ఫిబ్రవరిలో జరగనుందని చెబితే, అది మార్చి 28న 7.7 మాగ్నిట్యూడ్‌తో సంభవించింది.

ఈ ప్రక్రియలో సోలార్ రేడియేషన్, ఎలక్ట్రోమాగ్నిటిక్ వేవ్స్, వాతావరణ డేటా, వెదర్ మోడల్స్ వంటి అనేక పారామీటర్ల ఆధారంగా అంచనాలు చేస్తారు. ప్రస్తుతం ధర్మశాలలో కూడా భూకంపం సంభవించవచ్చని వారు చెబుతున్నారు — అది 7 మాగ్నిట్యూడ్ స్థాయిలో ఉండవచ్చని అంచనా.

తెలంగాణ భూభాగం డెక్కన్ పీఠభూమిలో ఉండటంతో, తరచూ తక్కువ తీవ్రత గల భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. కానీ 2024 డిసెంబర్ 4న ములుగు వద్ద సంభవించిన 5.3 తీవ్రత గల భూకంపం గత 50 ఏళ్లలోనే అతిపెద్దదిగా నమోదైంది.

ఇంతకముందు, ఏప్రిల్ 13, 1969న భద్రాచలం వద్ద 5.7 మాగ్నిట్యూడ్‌తో భూకంపం సంభవించిన రికార్డు ఉంది. ఇది 20 కిలోమీటర్ల లోతులో రావడం వల్ల ప్రభావం తక్కువగా ఉంది. ప్రాణనష్టం జరిగినట్టు నమోదు కాలేదు.

ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో 4 మాగ్నిట్యూడ్ కంటే ఎక్కువగా భూకంప తీవ్రత నమోదైతే వెంటనే ప్రజలకు హెచ్చరికలు అందించే వ్యవస్థలు ఉన్నాయి. అలాంటి అవగాహన భారతదేశంలోనూ రావాలని EPIC ఆశిస్తోంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com