తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్ర విభజన అనంతరం పెండింగ్‌లో పడిన పలు అంశాలు ఇప్పుడు పరిష్కారానికి నోచుకుంటున్నాయి. ముఖ్యంగా, అమరావతి నుండి హైదరాబాద్ వరకు కొత్తగా ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే, రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య ప్రయాణ సమయం కేవలం నాలుగు గంటలకు తగ్గనుంది.
రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికే పదకొండు ఏళ్లు కావొచ్చినా, అనేక అంశాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. గతంలో రాజకీయ పరిస్థితుల కారణంగా కేంద్రం చాలా అంశాలను అటకెక్కించింది. కానీ, ఇప్పుడు ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం కావడంతో ఏపీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న సంకేతాలు కొంతకాలంగా కనిపిస్తున్నాయి.
ఇప్పుడు అమరావతి–హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాల్సిందిగా హోంశాఖను కేంద్రం ఆదేశించింది. ఇదే సమయంలో అమరావతి రింగ్ రోడ్ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణలోని రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర విభాగానికి అనుమతుల ప్రక్రియ మొదలైంది. ఈ మార్గాలు పూర్తయితే, రెండు రాష్ట్రాల మధ్య వాణిజ్యం, ప్రజా రవాణా గణనీయంగా మెరుగవుతుందని భావిస్తున్నారు.
అదేవిధంగా, కేంద్రం అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడంలో ప్రత్యేక ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించగా, రోడ్లు, రైల్వే ప్రాజెక్టులకూ గ్రీన్ సిగ్నల్ లభించింది. రైల్వే శాఖ విశాఖ, విజయవాడ, కర్నూలు, హైదరాబాద్ మధ్య రవాణా కారిడార్లపై పరిశీలన మొదలుపెట్టింది. అలాగే, పెట్రోలియం శాఖ ఏపీలో మరో రిఫైనరీ ఏర్పాటు చేసే అంశంపై దృష్టి సారించింది.
తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే డబ్లింగ్‌కు రూ.1,332 కోట్లతో కేంద్రం ఆమోదం
రాయలసీమ రవాణా వ్యవస్థలో ఎంతో కీలకమైన తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే మార్గాన్ని డబుల్ ట్రాక్‌గా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు రూ.1,332 కోట్ల నిధులు కేటాయించి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం ఈ మార్గంలో సింగిల్ ట్రాక్ కారణంగా ప్రజలకు ప్రయాణ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే ఎక్కువ రైళ్ల రాకపోకలకు కూడా సదుపాయం లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రవాణా సామర్థ్యం పెరగడంతో పాటు, టెంపుల్ టూరిజానికి కూడా ఊతమివ్వనుంది. అదేవిధంగా విద్యా, వైద్య అవసరాల కోసం వెల్లూరును ఆశ్రయించే ప్రయాణికులకు ఇది ఉపయోగపడనుంది.
ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే ప్రాంతీయ అభివృద్ధికి అవకాశం ఉండటంతో పాటు.. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, సిమెంట్, స్టీల్ రంగాలకు కూడా ప్రోత్సాహం లభించనుందని పరిశ్రమల వర్గాలు భావిస్తున్నాయి.