-
హైదరాబాద్-విజయవాడ హైవేపై తగ్గిన టోల్ చార్జీలు
-
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై పెరిగిన టోల్ చార్జీలు
హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవేపై ప్రయాణించే వాహనాదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. ఈ రహదారిపై ఉన్న పలు టోల్ ప్లాజాల్లో టోల్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన టోల్ చార్జీలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. సరిగ్గా యేడాది పాటు.. అంటే వచ్చే యేడాది మార్చి 31వ తేదీ వరకు ఈ కొత్త ధరలు అమల్లో ఉంటాయి.
ముఖ్యంగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న ప్రధాన రహదారి హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి. రెండు రాష్ట్రాలను కలిపే ఈ హైవేపై నిత్యం అత్యంత రద్దీగా ఉంటుంది. ఇది రెండు రాష్ట్రాల మధ్య ఓ వారధిగా ఉండటంతో నిత్యం వేలాది వాహనాలు ఈ రహదారి గుండా వెళ్తాయి. అయితే, ఈ రహదారి గుండా ప్రయాణించే వాహనాదారులకు ఎన్హెచ్ఏఐ గుడ్‌న్యూస్ చెప్పింది. టోల్ ఛార్జీలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణలో రెండు, ఆంధ్రప్రదేశ్‌లో ఒక టోల్ గేట్లు ఉన్నాయి. వాటిలో చౌటుప్పల్ మండలం పంతంగి వద్ద ఒకటి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద మరొకటి.. అటు ఆంధ్రప్రదేశ్‌లో నందిగామ సమీపంలోని చిల్లకల్లు వద్ద ఒక టోల్ ప్లాజా ఉన్నాయి. ఈ రహదారిపై 2012 డిసెంబర్ నుంచి టోల్ రుసుములు వసూలు చేస్తున్నారు.
అయితే, ప్రస్తుతం ఈ టోల్ ప్లాజాల దగ్గర వసూలు చేస్తున్న ఛార్జీలను తగ్గించారు. పంతంగి టోల్ ప్లాజా దగ్గర కార్లు, జీపులు, వ్యాన్లకు అయితే ఒక వైపు ప్రయాణానికి రూ.15, ఇరువైపులా కలిపి రూ.30 తగ్గించనున్నారు. అలాగే, లైట్ వెయిట్ వాహనాలను ఒక వైపు ప్రయాణానికి రూ.25, ఇరువైపులా కలిపి రూ.40 తగ్గిస్తున్నారు. ఇక, బస్సు, ట్రక్కులకు అయితే, ఒక వైపు ప్రయాణానికి రూ.50, ఇరువైపులా కలిపి రూ.75 వరకు తగ్గించారు. ఇక చిల్లకల్లు టోల్‌ప్లాజా వద్ద అన్ని వాహనాలకు ఒక వైపునకు అయితే, రూ.5, ఇరువైపులా కలిపి రూ.10 చొప్పున మాత్రమే తగ్గించారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ ఛార్జీలో 25 శాతం మినహాయింపు లభిస్తుంది.
ఈ రహదారిని జీఎమ్మార్ సంస్థ నిర్మించింది. 2024 జూన్ 31 వరకు వాళ్లే టోల్ వసూలు చేశారు. ఆ తరువాత ఎన్హెచ్ఏఐ టోల్ వసూలు బాధ్యతలు తీసుకుంది. జీఎమ్మార్ సంస్థ ఉన్నప్పుడు ఏడాదికోసారి టోల్ ఛార్జీలు పెంచేవారు. కానీ, ఇప్పుడు ఎన్హెచ్ఏఐ టోల్ వసూలు చేస్తుండటంతో టోల్ ఛార్జీలు తగ్గించారు.
అవుటర్ రింగ్ రోడ్డుపై టోల్ చార్జీ పెంపు :
ఇక, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహన దారులకు ఇది గుడ్ న్యూస్ అయితే, మరోవైపు.. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు నిర్వహణా సంస్థ చేదు వార్త చెప్పింది. ఓఆర్ఆర్పై టోల్ చార్జీలను పెంచింది. ఈమేరకు ప్రకటన జారీ అయ్యింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై పెరిగిన టోల్ ఛార్జీలు రేపటి నుంచి అంటే.. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. ఓఆర్ఆర్పై టోల్ ఛార్జీలను ఐఆర్బీ ఇన్ ఫ్రా సంస్థ వసూలు చేస్తోంది. కారు, జీపు, వ్యాన్, లైట్ వెహికిల్స్‌కు కిలోమీటర్‌కు 10 పైసలు పెంచారు. కారు, జీపు, లైట్ వెహికిల్‌కు.. కిలో మీటర్‌కు ఇప్పటివరకు 2 రూపాయల 34 పైసలు ఉండగా.. పెంచాక 2 రూపాయల 44 పైసలు వసూలు చేయనున్నారు. మినీ బస్, ఎల్సీవీ వాహనాలకు కిలోమీటర్‌కు 20 పైసలు పెంచారు. ఇక, బస్సు, 2 యాక్సిల్ బస్సులకు కిలో మీటర్‌కు 31 పైసలు పెంచారు. అలాగే, భారీ వాహనాలకు కిలో మీటర్‌కు 70 పైసలు పెంచుతూ ఐఆర్బీ నిర్ణయం తీసుకుంది.
ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ చార్జీలు వసూలు చేసుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐఆర్బి ఇన్ఫ్రా సంస్థకు టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో 30 సంవత్సరాలకు లీజుకు ఇచ్చింది 158 కిలోమీటర్ల మేర ఉన్న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పలు జాతీయ రహదారులను కలుపుతోంది. అవుటర్ రింగ్ రోడ్డుపైకి ఎక్కి దిగడానికి 44 పాయింట్లతో పాటు 22 ఇంటర్ ఎక్స్చేంజ్ జంక్షన్లు ఉన్నాయి. ఉన్నాయి. నిత్యం అవుటర్ రింగ్ రోడ్డుపై 1.40 నుంచి 1.45 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
ప్రస్తుతానికి నెలకు రూ.60 కోట్లకు పైగానే ఆదాయాన్ని పొందుతున్న ఐఆర్బీ సంస్థ తాజాగా టోల్ చార్జీలను పెంచింది. దీంతో ఇంకా మరింత ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం వుంది.