గ్రహసంచారం… ఈ సంవత్సరం మే 14 వరకు గురుడు వృషభరాశిలో సంచరిస్తాడు. తదుపరి మే 15 నుండి అక్టోబర్‌వరకు మిథునరాశిలోనూ, అక్టోబర్19 నుండి నవంబర్‌వరకు కొంతకాలం కర్కాటకరాశిలో సంచరిస్తాడు. ఆ తరువాత నవంబర్12 నుండి వక్రీకరించి మిథునరాశిలో పునఃప్రవేశించి సంవత్సరమంతా అదే రాశిలో సంచారం. ఇక శని మార్చి 29 వరకు కుంభరాశిలో సంచారం తరువాత 30వ తేదీ నుండి సంవత్సరమంతా మీనరాశిలో ఉంటాడు. అలాగే, రాహు, కేతువులు మే 19 వరకు మీనం, కన్యారాశులలోనూ, తదుపరి కుంభం, సింహరాశుల్లోనూ సంచరిస్తారు.
మేషం… (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆదాయం– 2, వ్యయం–14
రాజపూజ్యం– 5, అవమానం–7
ఈ ఏడాది వీరికి ఏల్నాటి శని ప్రారంభమైంది. గురుడు మిథునరాశిలో సంచారం, రాహు, కేతువుల సంచారం అనుకూలం. కొన్ని ఇబ్బందులు ఎదురైనా మొత్తానికి సుఖసంతోషాలతోనే గడుపుతారు. శని ప్రభావం వల్ల ఆదాయం కంటే ఖర్చులు అధికంగా మీదపడడంతో పాటు అప్పుల వేటలో పడతారు. కొందరితో మాటపడతారు. ఇక గురుడు మే 18 వరకు గురుడు వృషభరాశిలో సంచార సమయంలో ఆర్థిక లాభాలు, ఆస్తులు కొనుగోలులో అవరోధాలు తొలగడం, సంతానపరమైన సౌఖ్యం వంటి ఫలితాలు పొందుతారు. ఇక రాహు, కేతువులు వీరికి అనుకూల ఫలితాలే ఇస్తారు.
ఈతిబాధలు, సమస్యల నుంచి కొంతవరకూ బయటపడతారు. సోదరులు, బంధువుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు శ్రమ ఫలించి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నేర్పు, పట్టుదలతో కొన్ని విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు నిలబెట్టుకుంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ చూపండి, ముఖ్యంగా ఉదర సంబంధిత రుగ్మతలు బాధించే వీలుంటుంది. ఇంటిలో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు, తద్వారా ఖర్చులు తప్పకపోవచ్చు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అనూహ్యంగా కొన్ని విద్యావకాశాలు సాధిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపంలో పెడతారు. విరివిగా తీర్థయాత్రలు చేస్తారు. ఐటీ,శాస్త్రవేత్తలకు మిశ్రమంగా ఉన్నా మొత్తానికి అనుకూలతే అధికం. వ్యాపారస్తులు ఊహించని విధంగా లబ్ధి పొందుతారు. పెట్టుబడుల విషయంలోనూ అడుగు ముందుకేస్తారు. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తారు. వీరు పైవారి మన్ననలు పొందుతారు. కొందరికి ట్రాన్సఫర్లు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాల కృషి ఫలించి ముందడుగు వేస్తారు. రాజకీయవర్గాలకు ఉన్నతమైన పదవులు దక్కే అవకాశం. క్రీడాకారులు, కళాకారులకు వదులుకున్న అవకాశాలు తిరిగి దక్కవచ్చు. వ్యవసాయదారులకు తగిన సమయంలో పెట్టుబడులు సమకూరతాయి. మే–అక్టోబర్‌మధ్యకాలం, నవంబర్‌నుండి సంవత్సరాంతం వరకు సామాన్యంగానే గడుస్తుంది. వీరు శనైశ్చరునికి తైలాభిషేకాలు, ఆంజనేయ స్వామికి అర్చనలు, దుర్గాస్తోత్రాల పఠనం చేయడం ఉత్తమం.
వృషభం… (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)
ఆదాయం– 11, వ్యయం–5
రాజపూజ్యం– 1, అవమానం–3
వీరికి శని,గురుల అనుకూల సంచారం విశేషంగా కలిసివస్తుంది. అలాగే, రాహువు కూడా కొంత శుభఫలితాలు ఇస్తాడు. ఈరాశి వారికి ఆదాయం సమృద్ధిగా ఉండి ఉత్సాహం, ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు తగ్గించి పొదుపు మార్గాలు అన్వేషిస్తారు. సమాజంలో గౌరవం పొందినా కుటుంబంలో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది తద్వారా మనశ్శాంతి లోపిస్తుంది. మొత్తానికి వీరికి అన్ని విధాలా గతం కంటే శుభఫలితాలు ఎక్కువగా ఉంటాయి. బంధువుల ద్వారా సంపూర్ణ సహాయసహకారాలు అందుతాయి. వివాహాది శుభకార్యాల హడావిడితో ఉత్సాహంగా గడుపుతారు. వాహనచోదకులు కొంత జాగ్రత్తలు పాటిస్తే మంచిది. కొన్ని ముఖ్య వ్యవహారాలలో అనూహ్యంగా విజయం సాధిస్తారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. శాస్త్ర, సాంకేతికరంగాల వారికి విశేష గుర్తింపు, విదేశీ అవకాశాలు ఉండవచ్చు. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి మరింత ఫలిస్తుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారులు పెట్టుబడులను పెంచి విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. అలాగే, లాభాలు అందుతాయి. ఉద్యోగవర్గాలకు విధుల్లో అవాంతరాలు తొలగి ఊరట లభిస్తుంది. మే– అక్టోబర్‌మధ్య మార్పులు జరిగే వీలుంది. పారిశ్రామిక, రాజకీయవర్గాల చిరకాల ఆశలు ఫలిస్తాయి. గతం నుండి వేధిస్తున్న సమస్యలు తీరతాయి.క్రీడాకారులకు, కళాకారులకు శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. ఏడాది మధ్యలో ఘనవిజయాలు చూస్తారు. వ్యవసాయదారులకు రెండు పంటలూ సానుకూలం. అక్టోబర్, నవంబర్, జనవరి నెలల్లో కొన్ని సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా చికాకులు, ధనవ్యయం, మానసిక ఆందోళన వంటి ఫలితాలు ఉంటాయి. వీరు కేతువుకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మిథునం… (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
ఆదాయం–14, వ్యయం–2
రాజపూజ్యం–4, అవమానం–3
ఈ రాశివారికి మే 15 నుండి గురుడు రాణిస్తాడు. అలాగే, దశమంలో శని, భాగ్యస్థానంలో రాహువు, తృతీయంలో కేతువులు మిశ్రమ ఫలితాలు ఇస్తారు. ఆదాయంతో పాటు, సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. అయితే ఖర్చులు కూడా తట్టుకోవలసి వస్తుంది. బంధువర్గం నుంచి సాయంతో పాటు విమర్శలు, ఒత్తిడులు కూడా పెరుగుతాయి. స్నేహాల పరంపరం కొనసాగుతుంది. కుటుంబసభ్యుల కంటే స్నేహితుల సహకారమే అధికంగా అందుకుంటారు. అయితే ఆర్థికపరమైన హామీలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబంలో చికాకులు, సమస్యలు మధ్యలో కొంత ఇబ్బంది కలిగిస్తాయి. అయినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ప్రతి విషయంలోనూ ముందడుగు వేస్తారు. ఆరోగ్యపరమైన సమస్యలు సైతం చికాకు పరుస్తాయి. ముఖ్యంగా నరాలు, చర్మ సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. జీవిత భాగస్వామి తరఫు నుండి ఎంతోకొంత ధన లేదా ఆస్తి లాభం కలుగుతుంది. వారసత్వ ఆస్తి కూడా లభించవచ్చు. ఇంటి నిర్మాణయత్నాలు వేగం తగ్గినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. వివాహాది శుభకార్యాల నిర్వహణతో హడావిడిగా గడుపుతారు. పొగడ్తలకు లొంగిపోవద్దు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలతో పాటు కొద్దిపాటి నష్టాలు కూడా చూడాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం తగ్గి సత్తా చాటుకునే సమయం. ద్వితీయార్థంలో పదోన్నతులకు అవకాశం. పారిశ్రామికవర్గాలకు తరచూ విదేశీ పర్యటనలు, కొత్త సంస్థలకు శ్రీకారం. రాజకీయవర్గాల వారు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఐటీ రంగంవారి ఆశలు ఫలించే సమయం. క్రీడాకారులకు, కళాకారులకు అవకాశాలు మరింతగా దక్కించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు. వ్యవసాయదారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఏప్రిల్, జూలై, నవంబర్‌నెలలు సామాన్యంగా ఉండవచ్చు. వీరు తరచూ ఆంజనేయ స్వామికి అర్చనలు చేయడం ఉత్తమం. అలాగే, విష్ణుధ్యానం మంచిది.
కర్కాటకం… (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం–8, వ్యయం–2
రాజపూజ్యం–7, అవమానం–3
వీరికి మే 14వరకు గురుడు విశేషంగా రాణిస్తాడు. తదుపరి అక్టోబర్18 వరకు ఖర్చులు పెరుగుతాయి. సంపాదన అంతా వివిధ రూపాల్లో ఖర్చులు చేయాల్సిన పరిస్థితి, ఆ తరువాత నవంబర్11 వరకు కర్కాటరాశిలో సంచారం శుభకరం. ఇది గురునికి ఉచ్ఛస్థితి కావడం కలిసివచ్చే అంశం. ఇక ఇంతవరకూ ఇబ్బందులు పెట్టిన అష్టమ శని దోషం తొలగినా మే 19 నుండి అష్టమ రాహువు, కుటుంబస్థానంలో కేతు సంచారం ప్రతికూలం. మొత్తానికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాబడి ఉన్నా ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు నెమ్మదిస్తాయి. ఎంతగా కష్టించినా ఫలితం ఆశించినస్థాయిలో ఉండదు. ఆప్తుల ద్వారా వివిధ విషయాలపై ఒత్తిడులు ఎదుర్కొంటారు. కుటుంబపరంగా కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. జీవిత భాగస్వామితో విభేదిస్తారు. సంతానపరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అక్టోబర్–నవంబర్‌నెలల్లో సానుకూలమవుతాయి. అష్టమ రాహు దోషం వల్ల వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అలాగే ఉదర, ఎముకలకు సంబంధించిన రుగ్మతలు ఇబ్బంది కలిగిస్తాయి. ప్రథమార్థంలో బంధువుల రాకతో కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఇంటిలో శుభకార్యాల హడావిడి ఉంటుంది. ఆస్తుల వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు కొనసాగుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. కొంత అదనపు బాధ్యతలు మీదపడి సతమతం కాగలరు. పారిశ్రామికవర్గాలకు అనుకున్న కార్యాలలో అడ్డంకులు కొంత తొలగుతాయి. రాజకీయవర్గాల వారికి మిశ్రమంగా ఉంటుంది.క్రీడాకారులు, కళాకారులు అనుకున్నది సాధించినా కొంత కష్టపడాలి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. అయితే విదేశీ విద్యావకాశాల యత్నాలు నెమ్మదిగా సాగుతాయి. ఐటీ రంగం వారికి కొంత ఊరట కలుగుతుంది. వ్యవసాయదారులలో కొత్త ఆశలు చిగురిస్తాయి. వీరు గురు, రాహు, కేతువులకు పరిహారాలు చేయడం మంచిది.
సింహం… (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ఆదాయం–11, వ్యయం–11
రాజపూజ్యం–3, అవమానం–6
వీరికి గురుడు అక్టోబర్18 నుండి నవంబర్11 మధ్య కర్కాటకరాశిలో సంచారం మినహా, మిగతా కాలమంతా శుభదాయకుడు. అష్టమశని ప్రభావం చూపుతుంది. అలాగే, జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహువు కూడా మిశ్రమంగా ఫలితాలు ఇస్తారు. గురుని ప్రభావం అనుకూలమై ఆదాయం సమకూరినా శని ప్రభావంతో కొన్ని అదనపు ఖర్చులు వచ్చిపడతాయి. అలాగే, కుటుంబంలో కలహాలు, మానసిక సంఘర్షణ మధ్య గడుపుతారు. అయితే గురుబలం వల్ల కొంత గట్టెక్కుతారు. ఇక కేతువు ప్రభావం వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలపై అధికంగా దృష్టి సారిస్తారు. సప్తమ రాహువు కారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొనవచ్చు. కొంత సంయమనం పాటిస్తూ ముందుకు సాగడం ఉత్తమం. అలాగే, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతూ, సమయానుసారం ఆహారవిహారాదులు పూర్తి చేయడం మంచిది. అత్యవసర పరిస్థితుల్లో మీరు నమ్ముకున్న వారే రిక్తహస్తాలు చూపే అవకాశం ఉంది. సమాజంలో విశేష గౌరవం పొందుతారు. అయితే కుటుంబంలో మాత్రం వ్యతిరేకభావాలు కనిపిస్తాయి. మీ ఆశయాల సాధనకు కృషి చే సి కొంత సఫలమవుతారు. వివాహయత్నాలు సఫలమవుతాయి. వ్యవహారాలు కొంత ఆలస్యంగా పూర్తి కాగలవు. వాహనాలు, కొత్త ఇల్లు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు మాత్రం ఇంకా నలుగుతూనే ఉంటాయి. వ్యాపార, వాణిజ్యరంగాల వారికి పెట్టుబడులకు ఇబ్బంది ఉండదు. అయితే సరైన గిరాకీ లేకపోవడంతో ఆందోళన చెందుతారు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. శాస్త్ర,సాంకేతిక రంగాల వారికి మంచి గుర్తింపు లభించే కాలం. పారిశ్రామికవర్గాలకు తరచూ విదేశీ పర్యటనలు చేస్తారు. రాజకీయవర్గాలకు ఒక పిలుపు ఊరటనిస్తుంది. ఐటీ రంగం వారి యత్నాలు సఫలం.క్రీడాకారులకు, కళాకారులకు కొత్త అవకాశాలు ఉత్సాహాన్నిస్తాయి. విద్యార్థులు శ్రమానంతరం ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది. అక్టోబర్– నవంబర్‌మధ్య అన్నింటా మరింత అప్రమత్తతో మెలగాలి. వీరు శనికి పరిహారాలు చేయించుకోవాలి. అలాగే, నృసింహస్తోత్రాలు పఠించండి.
కన్య… (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
ఆదాయం–14, వ్యయం–2
రాజపూజ్యం–6, అవమానం–6
వీరు విశేష గురుబలంతో దూసుకువెళతారు. అలాగే, సప్తమంలో శని కొంత ప్రతికూలం కాగా, షష్టమంలో రాహువు, వ్యయంలో కేతువు ప్రభావం మిశ్రమంగా ఉంటుంది. మొత్తానికి వీరు ఎదురులేని విధంగా గడుపుతారు. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో ఎనలేని ప్రగతి సాధిస్తారు. ఒక సందర్భంలో ఆశలు వదులుకున్న ధనం కూడా అందుతుంది. కోర్టు వ్యవహారాలలో మీకు అనుకూల తీర్పులు రావచ్చు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులు ఆచరిస్తారు. కొన్ని సమస్యలు వీడి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఆస్తులు కొనుగోలులో ముందుంటారు. ఈ ఏడాది గృహయోగం, వివాహాది శుభకార్యాల నిర్వహణ వంటి వాటికి ఖర్చు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యాపార, వాణిజ్యరంగాల వారికి ఇతోధికంగా లాభాలు రాగలవు. అలాగే, భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు, ఉన్నత హోదాలు రావచ్చు. పారిశ్రామికవర్గాల కృషి ఎట్టకేలకు ఫలించి నూతన ప్రాజెక్టులు చేపడతారు. ఐటీ నిపుణులకు చెప్పుకోతగిన మార్పులు ఉంటాయి. రాజకీయవేత్తలకు పదవులు, సన్మానయోగాలు కలుగుతాయి.క్రీడాకారులు, కళాకారులు అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. వ్యవసాయదారుల ఆశలు నెరవేరతాయి. అయితే సప్తమ శని, వ్యయంలో కేతువు ప్రభావం వల్ల చర్మ, నరాలు, జ్వర సంబంధిత రుగ్మతలు బా«ధించవచ్చు. అలాగే, జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు నెలకొంటాయి. తొందరపాటు మాటలు లేకుండా, ఆచితూచి వ్యవహరిస్తూ సాగడం మంచిది. మే 18 వరకు ప్రయాణాలు, ఇతర ముఖ్య వ్యవహారాలలో మరింత జాగ్రత్తలు పాటించాలి. మిగతా నెలలు అనుకూలమే. వీరు శని, కేతువులకు పరిహారాలు చేయించుకోవాలి. శ్రీదత్తాత్రేయ స్వామి స్తోత్రాలు పఠించండి.
తుల… (చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
ఆదాయం–11, వ్యయం–5
రాజపూజ్యం–2, అవమానం–2
వీరికి మే 14 నుండి అష్టమ గురుదోషం తొలగిపోనుంది. ఇక అంతా మంచిరోజులే. ప్రధాన గ్రహాలైన గురు, శని అనుకూల సంచారం శుభదాయకం. ఇక రాహు, కేతువులు సామాన్య ఫలితాలు ఇస్తారు. మొత్తానికి గతం కంటే అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ముఖ్యంగా ఆర్థికంగా పరిపుష్ఠి సాధిస్తారు. ఇతరుల వద్ద నిలిచిపోయిన ధనం చేతికందుతుంది. స్థిరాస్తులు సైతం సమకూరతాయి. ముఖ్యంగా తండ్రి ద్వారా రావలసిన ఆస్తులు దక్కవచ్చు. కుటుంబంలోనూ ప్రశాంతత చేకూరుతుంది. గతకొంత కాలంగా భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్ధలు తొలగి సమన్వయంతో ముందుకు సాగుతారు. సంతాన విషయంలో మీ అంచనాలు నిజం కాగలవు. శత్రువులుగా మారిన బంధువులు కొందరు తప్పిదాన్ని తెలుసుకుంటారు. వివాహాది శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. కొన్ని సమస్యలు వాటంతట అవే తీరి ఊరట చెందుతారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు, పేరుప్రతిష్ఠలు పొందుతారు. వాహన, గృహయోగాలు కలుగుతాయి. కాంట్రాక్టర్లకు ఊహించని టెండర్లు దక్కవచ్చు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభాలదిశగా సాగుతాయి. కొత్త పెట్టుబడులకు సైతం అనుకూలం. ఉద్యోగస్తులకు పైస్థాయి వారి ప్రశంసలు అందుతాయి. కొందరికి పదోన్నతులు సంభవం. పారిశ్రామికవర్గాలకు చిక్కులు తొలగి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ నాయకుల ఆశయాలు ఫలించే శుభకాలం. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. ఐటీ రంగం వారికి ద్వితీయార్థం అనుకూలిస్తుంది. వ్యవసాయదారులకు నూతనోత్సాహం. శాస్త్రసాంకేతిక రంగాల వారు పరిశోధనల్లో విజయాలు సాధిస్తారు. మే వరకూ ఆరోగ్య, కుటుంబసమస్యలు. వృథా ఖర్చులు ఎదురవుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఈకాలంలో గురునికి పరిహారాలు చేయించుకోవాలి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌నెలలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. వీరు నిత్యం ఆంజనేయ దండకం పఠించడం ఉత్తమం.
వృశ్చికం… (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఆదాయం–2, వ్యయం–14
రాజపూజ్యం–5, అవమానం–2
వీరికి ఈ సంవత్సరం గురు, రాహువులతో పరీక్షాకాలంగా ఉంటుంది. మే 14 నుండి అక్టోబర్18 వరకు, తిరిగి నవంబర్11 నుండి అష్టమ గురు దోషం. అలాగే, మే 19 నుండి సంవత్సరమంతా అర్థాష్టమ రాహు దోషం ఇబ్బంది పెడతాయి. ఈరీత్యా చూస్తే ఆర్థికంగా ఇబ్బందులు లేకున్నా ఖర్చులు అధికమై సతమతం కాగలరు. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలు సైతం చేజారి నిరాశ చెందుతారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు చేస్తారు. మీ మాటకు కుటుంబంలోనే వ్యతిరేకత రావచ్చు. ప్రతి వ్యవహారాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. ఏ నిర్ణయమైనా ఆప్తుల సలహా మేరకు తీసుకోవడం ఉత్తమం. మిత్రులు, సన్నిహితులతో అకారణంగా వైరం. వాహనాలు, భూములు కొనాలన్న ఆలోచన కలిగి ఆదిశగా అడుగులు వేస్తారు. అయితే కష్టసాధ్యమైనా ప్రయత్నం ఫలిస్తుంది. ఇంతకాలం మీరే సాయం అందించగా, ప్రస్తుతం వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి. చిత్రవిచిత్రమైన సంఘటనలు ఎదురై ఆశ్చర్యపడతారు. అక్టోబర్–నవంబర్‌మధ్య గురుబలం వల్ల ఆకస్మిక ధనలబ్ధి. మానసిక ప్రశాంతత, పరిపూర్ణ ఆరోగ్యం సమకూరతాయి. ఐటీ రంగం వారు, శాస్తవేత్తలు తమ ప్రతిభను చాటుకుంటారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమస్థాయిలో ఉండవచ్చు. ఉద్యోగస్తులకు విధుల్లో కొన్ని అవాంతరాలు వచ్చిన అధిగమిస్తారు. కొన్ని బదిలీలు నిలిచిపోయే అవకాశం ఉంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు, కొత్త సంస్థలకు అనుమతుల కోసం యత్నిస్తారు. రాజకీయవర్గాలకు సరైన గుర్తింపు దక్కవచ్చు. క్రీడాకారులకు, కళాకారులకు అనుకోని అవకాశాలు కొంత ఊరటనిస్తాయి. విద్యార్థుల యత్నాలు శ్రమానంతరం ఫలిస్తాయి. వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది. గురుని అష్టమస్థితి, రాహువు అర్థాష్టమ స్థితి వల్ల మానసిక ఆందోళన. చికాకులు. ఇతరులతో మాటపడాల్సిన పరిస్థితి ఉంటుంది. వీరు కనకధారా స్తోత్రాలు పఠిస్తే మంచిది.
ధనుస్సు… (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఆదాయం–5, వ్యయం–5
రాజపూజ్యం–1, అవమానం–5
వీరు కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా అత్యంత చాకచక్యంగా అధిగమిస్తారు. మనోబలమే వీరికి ఆయుధం. ఏ మాత్రం దిగాలు చెందక దీక్షగా ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధిస్తారు. వీరికి అర్థాష్టమ శనితో పాటు, మే 14వరకు, తిరిగి అక్టోబర్– నవంబర్‌మధ్య అష్టమ గురుడు దోషకారులు. రాహు,కేతువులు శుభదాయమైన ఫలితాలు ఇస్తారు శని, అష్టమ గురుడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతారు. ఆయా కాలాల్లో కొంత జాగ్రత్తలు పాటించడం మంచిది. అలాగే, నేత్ర, ఉదర, హృదయ సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. పేరుప్రతిష్ఠలకు కూడా భంగం కలుగుతుంది. ఎవరినీ అతిగా విశ్వసించకుండా దైవంపై భారం మోపి ముందుకు సాగడం మంచిది. ప్రయాణాల్లోనూ విలువైన వస్తువులు చేజారే వీలుంది. కుటుంబంలో సమస్యలు పెరిగి సవాలుగా నిలుస్తాయి. కొన్ని వ్యవహారాలలో పట్టువిడుపు ధోరణి మంచిది. ఇక డిసెంబర్‌నుండి గురుడు శుభఫలితాలు ఇస్తాడు. ఆదాయం పెరిగి అవసరాలకు లోటు రాదు. అలాగే, మానసిక ప్రశాంతత, ఒడిదుడుకుల నుండి విముక్తి లభిస్తుంది. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో లాభనష్టాలను సమానంగా స్వీకరించాల్సి వస్తుంది. అయితే భాగస్వాముల చేయూతతో సమస్యలు తీరతాయి. ఉద్యోగస్తులకు పనిభారం మరింతగా పెరిగినా కొంత కీర్తి కూడా దక్కుతుంది. అయితే సంవత్సరాంతంలో పదోన్నతులు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు చేసే యత్నాలు ముందుకుసాగని పరిస్థితి. అధికారుల నుండి సమస్యలు రావచ్చు. రాజకీయవర్గాలకు గందరగోళ పరిస్థితి నెలకొన్నా గౌరవానికి లోటు రాదు.క్రీడాకారులు, కళాకారులు అనుకున్న అవకాశాలు సాధించేందుకు శ్రమపడాలి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. ఐటీ రంగం వారికి ఇబ్బందులు వచ్చినా అధిగమిస్తారు. వ్యవసాయదారులకు ద్వితీయార్థంలో అనుకూలస్థితి. వీరు శని, గురులకు తగిన పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. రుద్రాభిషేకాలు చేయించుకుంటే మంచిది.
మకరం… (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
ఆదాయం–8 వ్యయం–14,
రాజపూజ్యం–4, అవమానం–5
వీరికి మే 14 వరకు, తిరిగి అక్టోబర్–నవంబర్‌మధ్య గురుడు యోగకారకుడు, మిగతా కాలమంతా దోషకారి. అలాగే, శని సంవత్సరమంతా శుభఫలితాలు ఇస్తాడు. ఇక రాహు, కేతువుల సంచారం మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడతారు. ఖర్చులు అధికమై అప్పుల కోసం యత్నిస్తారు. అయితే సమాజంలోనూ, కుటుంబంలోనూ మీ మాటకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. ఎంతోకాలంగా మీకు దూరంగా ఉన్న వ్యక్తులు దగ్గరకు చే రి సాంత్వన చేకూరుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారానికి చేరువుగా ఉంటాయి. ఆపన్నులకు చేతనైన సహాయం అందించేందుకు ముందుంటారు. ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించి పూర్తి చేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో సఫలత చెందుతారు. జీవితభాగస్వామితో మరింత సఖ్యత నెలకొంటుంది. బంధుమిత్రులతో మీ అభిప్రాయాలను పంచుకుంటారు. కొన్ని సేవాకార్యక్రమాలు చేపడతారు. తరచూ ప్రయాణాలు సంభవం. విదేశీ ప్రయాణాలు కూడా ఉండవచ్చు. శుభకార్యాల నిర్వహణకు సమాయత్తమవుతారు. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం కూడా తరచూ ఇబ్బంది కలిగిస్తుంది. వైద్యసేవలు అవసరం కావచ్చు. రాహు, కేతువులు, మే– అక్టోబర్, డిసెంబర్‌తరువాత గురుని ప్రభావంతో కొన్ని హఠాత్తు పరిణామాలు, సంఘటనలు ఎదురుకాగలవు. రక్త, నరాలు, చర్మ సంబంధిత రుగ్మతలు కలిగే అవకాశం.మొత్తానికి వీరు మనోనిబ్బరంతో గడపడం ఉత్తమం. ఇక వ్యాపారాలలో సమతుల్యత పాటించాలి. లాభాలు దక్కినా వాటిని నిలబెట్టుకోవాలి. ఉద్యోగస్తులు విధుల పట్ల అంకితభావం చూపుతారు. సరైన గుర్తింపు ఇంతకాలానికి దక్కుతుంది. పారిశ్రామికవర్గాలకు ఊహించని విధంగా అనుమతుల దక్కి అగ్రిమెంట్లు కుదురుతాయి. రాజకీయవేత్తలకు నవంబర్‌నెల అత్యంత శుభదాయకంగా ఉంటుంది.క్రీడాకారులు, కళాకారులు స్వయంగా నిర్ణయాలు తీసుకుని అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ఐటీ నిపుణులు, శాస్త్రవేత్తలకు మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు ఆశించిన విధంగా ఫలితాలు రావచ్చు. వ్యవసాయదారుల కృషి, యత్నాలు ఫలిస్తాయి. వీరు గురు, రాహు, కేతువులకు పరిహారాలు చేయడం, దుర్గాదేవిని ఆరాధించడం మంచిది.
కుంభం… (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఆదాయం–8, వ్యయం–14,
రాజపూజ్యం–7, అవమానం–5
ఈరాశి వారికి ఏల్నాటి శని చివరి భాగానికి చేరుకుంది. అయితే శని సువర్ణమూర్తి కావడం శుభకరం. గురు సంచారం కూడా శుభదాయకమే. ఇక జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతువు సంచారం ప్రతికూల అంశాలు. మొత్తానికి వీరికి శని, గురులు మంచి ఫలితాలు ఇస్తారు. ధనానికి లోటు రాకుండా గడిచిపోతుంది. ఎవరిపైనా ఆధారపడకుండా వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు. ఒక సమాచారం మీకు విశేషలాభాన్నిస్తుంది. ఇంట్లో శుభకార్యాల హడావిడి పెరుగుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. భార్యాభర్తల మధ్య నెలకొన్న అపోహలు తొలగుతాయి. వాహనాలు, ఖరీదైన ఇళ్లు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల చిరకాల కోరిక నెరవేరే కాలం. సమాజంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ఎక్కువ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కోర్టు వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశముంది. అక్టోబర్– నవంబర్‌మధ్యకాలంలో ఆరోగ్యం ముఖ్యంగా నరాలు, జ్వర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుని లాభాలు ఊరటనిస్తాయి. కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులతో కూడిన బదిలీలు ఉంటాయి. అదనపు పనిభారం తగ్గవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కే సూచనలు. వీరి మాటకు తిరుగు ఉండదు.క్రీడాకారులు, కళాకారుల కలలు ఫలిస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. విద్యార్థులకు రెండుమూడు అవకాశాలు దక్కవచ్చు. ఐటీ రంగంవారి కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట లాభసాటిగా ఉంటుంది. శనికి తైలాభిషేకాలు, దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయడం ఉత్తమం.
మీనం… (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి)
ఆదాయం–5, వ్యయం–5
రాజపూజ్యం–3, అవమానం–1
వీరికి జన్మరాశిలో శని సువర్ణమూర్తి కావడం, రాహువు, కేతువులు కూడా సువర్ణమూర్తులుగా సంచారం, మే 14 తరువాత గురుని ప్రభావంతో అనుకూల ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండానే సర్దుబాటు కాగలదు. అప్పులు చేసినా వెనువెంటనే తీరుస్తారు. ఇష్టమైన వ్యక్తులు మరింత దగ్గరవుతారు. తీర్థయాత్రలు విరివిగా చేసి ఆధ్యాత్మికతను పెంచుకుంటారు. సంవత్సర ప్రారంభంలో కొన్ని సమస్యలు, కార్యక్రమాలలో అవాంతరాలు ఎదురైనా మనోబలంతో అధిగమిస్తారు. అలాగే, ఆరోగ్యం కొంత సహకరించక ఇబ్బంది పడతారు. అయితే త్వరగానే స్వస్థత చేకూరుతుంది. చేసే పనిపై ఏకాగ్రత కలిగి సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. బలమైన ప్రత్యర్థులు కూడా మీ మంచితనానికి విధేయులై మసలుకుంటారు. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగార్ధులు తమ ప్రయత్నాలలో సఫలం చెందుతారు. వాహనాలు, ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలాగే, ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు సన్నద్ధమవుతారు. సోదరులు, సోదరీల నుంచి శుభవార్తలు అందుతాయి. కాంట్రాక్టర్లు, రియల్‌ఎస్టేట్‌వ్యాపారులు ద్వితీయార్థంలో మరింత లబ్ధి పొందుతారు. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు అంది ముందడుగు వేస్తారు. సంస్థలను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు పెరిగినా అధిగమిస్తారు. పైస్థాయి నుంచి ప్రోత్సాహం ఉంటుంది. రాజకీయవర్గాలకు ప్రజాదరణ పెరుగుతుంది. పారిశ్రామికవర్గాలకు తరచూ విదేశీ పర్యటనలతో గడుపుతారు. ఐటీరంగంవారు, క్రీడాకారులకు నూతనోత్సాహం.క్రీడాకారులు, కళాకారులకు అవకాశాలతో పాటు విజయాలు వరిస్తాయి. విద్యార్థులకు శ్రమానంతరం మంచి ఫలితాలు రాగలవు. వ్యవసాయదారులు రెండవ పంటలో లాభాలు పొందుతారు. వీరు శని, రాహు, ప్రథమార్థంలో గురునికి పరిహారాలు చేయాలి. అలాగే, నృసింహస్తోత్రాలు పఠనంతో మనస్సులోని సంకల్పాలు నెరవేరతాయి.
సర్వేజనాం సుఖినోభవంతు…
–––––––––––––––––––––––––––––