బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం, థాయిలాండ్ లోని భారతీయ పౌరుల కోసం అత్యవసర నంబర్‌ను ఏర్పాటు చేసింది. బ్యాంకాక్‌లో శక్తివంతమైన భూకంపం కారణంగా అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం భారతీయులెవరైనా ఈ హెల్ప్ లైన్ నెంబర్‌ను సంప్రదించ వచ్చని ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్‌కు సంబంధించిన పోస్ట్ చేసింది. భారతీయులు ఎవరైనా +66 618819218 అనే అత్యవసర నెంబర్‌ను ఉపయోగించవచ్చని తెలిపింది.
బ్యాంకాక్, థాయిలాండ్‌లోని పలు ప్రాంతాల్లో శక్తివంతమైన భూకంప ప్రకంపనలు నమోదైన తర్వాత, థాయ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని ఇండియన్ ఎంబసీ ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో పేర్కొంది. ఇప్పటివరకు, ఏ భారతీయ పౌరుడికి సంబంధించిన అవాంఛనీయ సంఘటనలు నివేదించబడలేదని వెల్లడించింది. బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం, చియాంగ్ మాయిలోని కాన్సులేట్ సభ్యులందరూ సురక్షితంగా ఉన్నారని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేసింది.