రాష్ట్ర అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ప్రవర్తనను నిరసిస్తూ.. ట్రాన్స్‌జెండర్లు, ట్రాఫిక్ అసిస్టెంట్లు ఆందోళనకు దిగారు. ట్యాంక్ బండ్‌పై శ్రీశ్రీ విగ్రహం వద్ద ట్రాఫిక్ అసిస్టెంట్లు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర చట్టసభ అసెంబ్లీ సాక్షిగా తమను అవమానించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ట్రాన్స్ జెండర్లు డిమాండ్ చేశారు.
శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం 50 మంది ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగం కల్పించిందని, ప్రత్యేకంగా పైలట్ ప్రాజెక్ట్ కింద 50 మందిని ఎంపిక చేసి.. ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించిందని, ఈ ప్రాజెక్ట్ విజయ వంతంగా కొనసాగుతోందని మంత్రి శ్రీధర్ బాబు శాసనసభలో ప్రస్తావించారు. అయితే, మంత్రి శ్రీధర్‌బాబు ప్రసంగంలో తమ ప్రస్తావన రాగానే.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వెకిలిగా వ్యవహరించారని ట్రాన్స్ జెండర్లు మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తలసాని తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్‌లు హేళనగా నవ్వారని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు సమాజంలో ఉన్న చిన్న చూపును పోగొట్టేందుకు, తమను మనుషులుగా గుర్తించి, గౌరవమైన హోదాతో ఉద్యోగాలు కల్పించారని ట్రాన్స్ జెండర్లు వివరించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కనీసం తమను పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పుడు మాత్రం తాము అందరితో సమానంగా గౌరవప్రదమైన ఉద్యోగాలు చేస్తుంటే అవహేళన పరిచేలా వ్యవహరించడం తమను తీవ్రంగా బాధించిందన్నారు. అసెంబ్లీలో తమ పట్ల చులకనగా, హేళనగా వ్యవహరించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. ట్రాన్స్ జెండర్‌లకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.