ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే మరణిస్తాడని కామెంట్ చేశాడు. దీంతో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందని జోస్యం చెప్పారు.
బుధవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో పారిస్‌లో సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అతను (పుతిన్‌ను ఉద్దేశిస్తూ) త్వరలో చనిపోతాడు. ఇది నిజం. ఆయన మరణంతో రెండు దేశాల మధ్య యుద్ధం ముగుస్తుంది’ అని విలేకరులతో జెలెన్‌స్కీ అన్నారు.
ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనడం రష్యాకు ఇష్టం లేదని జెలెన్‌స్కీ ఈ సందర్భంగా ఆరోపించారు. యుద్ధం ఆపేందుకు రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని ప్రపంచ దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, అమెరికా ప్రతిపాదించిన పాక్షిక కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ విషయంలో రష్యాను ఒప్పించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. అమెరికా ప్రతినిధులు సౌదీ అరేబియా వేదికగా రష్యాతో చర్చలు జరుపుతున్నారు.