30.6 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

ఢిల్లీ అసెంబ్లీపై బీజేపీ కన్ను

 

కేంద్ర ప్రభుత్వాన్ని లీడ్‌ చేస్తున్న భారతీయ జనతాపార్టీ ఇకపై దేశ రాజధాని ఢిల్లీపై సీరియస్‌గా దృష్టిపెడుతోంది. తమ అస్త్ర శస్త్రాలన్నీ హస్తినవైపు మళ్లించబోతోంది. మూడు దశాబ్దాలుగా అందని ద్రాక్షగా మారిన ఢిల్లీ పీఠం ఈసారి చేజారనీయొద్దన్న కృతనిశ్చయంతో పావులు కదుపుతోంది. మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఊహించని విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో వచ్చే యేడాది ప్రారంభంలో జరగనున్న ఢిల్లీ ఎన్నికలపై పూర్తిస్థాయి శక్తి సామర్థ్యాలను ప్రయోగించాలని బీజేపీ అధిష్టానం డిసైడ్‌ అయ్యింది. కేంద్రంలో మూడోసారి జెండా ఎగురవేసినా.. పార్లమెంటు భవనం ఉన్న రాజధాని ఢిల్లీ పీఠం ప్రతిసారీ కాషాయం చేజారిపోవడంపై మంతనాలు సాగిస్తోంది. దశాబ్ద కాలానికిపైగా కేంద్రంలో అధికారం తమ గుప్పిట్లో ఉన్నప్పటికీ.. ఢిల్లీ అసెంబ్లీలో జెండా పాతలేకపోవడం వెనుక ఏయే అంశాలు ఇమిడి ఉన్నాయో సమీక్షించుకుంటోంది. దశాబ్దాలుగా ఢిల్లీ సీఎం పదవి అందని ద్రాక్షగానే మిగిలిపోవడంపై కాషాయ దళం మధనపడిపోతోంది. అయితే, ఇప్పుడు మహారాష్ట్రలో తిరుగులేని విజయం వైపు దూసుకెళ్తున్న క్రమంలో ఢిల్లీ పీఠంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని నిర్ణయించుకుంది.

కేంద్రపాలితంగా ఉన్న ఢిల్లీలో 69వ రాజ్యాంగ సవరణ ద్వారా శాసనసభ ఏర్పాటుకు కూడా అవకాశం కల్పించిన తర్వాత తొలిసారి 1993లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ హస్తిన పీఠంపై కాషాయ జెండాను ఎగురవేసింది. సుష్మాస్వరాజ్‌ చిన్న వయసులోనే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఇప్పటివరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ బీజేపీ ఢిల్లీలో అధికార పీఠం అధిష్టించలేదు. 1998 నుంచి మూడుసార్లు వరుసగా కాంగ్రెస్‌పార్టీ ఢిల్లీ అసెంబ్లీని చేజిక్కించుకొని హ్యాట్రిక్‌ కొట్టింది. ఆ తర్వాత 2013 నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ ఢిల్లీ శాసనసభలో తిష్టవేసుకొని కూర్చుంది. 2013లో ఎక్కువ అసెంబ్లీ స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కాంగ్రెస్‌ పొత్తుతో ఆప్‌ బీజేపీకి దగ్గరగా వచ్చిన అధికారాన్ని ఎత్తుకుపోయింది. ఫలితంగా ప్రతిసారీ అసెంబ్లీ ఎన్నికల్లో పరిహాసం ఎదుర్కొంటున్న భారతీయ జనతాపార్టీ ఈసారి ఏమాత్రం ఇతరులకు ఆ ఛాన్స్‌ ఇవ్వొద్దని గట్టిగా డిసైడయ్యింది.

వాస్తవానికి మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఢిల్లీలో కూడా ఎన్నికల హడావిడి మొదలయ్యింది. ఇప్పుడు ఫలితాలు వెలువడిన తర్వాత మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అంతేకాదు.. పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఆరు స్థానాల్లో బీజేపీ ఆధిక్యం కనబరిచింది. అలాగే, రాజస్థాన్‌, అసోం, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లోనూ బీజేపీ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడం ఆ పార్టీలో జోష్‌ నింపింది. దీంతో, ఇదే ఊపుతో ఇక హస్తినపై సర్వశక్తులూ ప్రయోగించాలనుకుంటోంది. ఇప్పటికే ఎన్నికల కార్యాచరణను కూడా మొదలు పెట్టేసింది. అధికార ఆప్‌కు దీటుగా ప్లాన్‌లు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఆప్‌ను బలహీనం చేసే దిశగా తనదైన వ్యూహాలకు తెరతీసింది. ఆప్‌నేత కైలాష్‌ గహ్లోత్‌ను చేర్చుకొని ఆ పార్టీపైకే ఉసిగొల్పుతోంది. మరోవైపు.. ఢిల్లీలో తమ కేడర్‌ను క్రియాశీలం చేస్తోంది. ఇప్పటికే మూడు సార్లు ఢిల్లీ అసెంబ్లీలో హవా సాగించిన ఆమ్‌ ఆద్మీ పార్టీని ఢీకొనడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. వాస్తవానికి ఆప్‌ను దెబ్బతీసే, ఆ పార్టీని బలహీనం చేసే ప్రయత్నాలను బీజేపీ గతేడాదే మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఆ పార్టీ నేతలను టార్గెట్‌ చేసింది. ఆప్‌ ఎంపీ, మంత్రి, డిప్యూటీ సీఎంనే కాదు.. ఏకంగా ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను కూడా జైలుకు పంపించడంలో బీజేపీ పాత్ర ఎంతన్నది రాజకీయంగా కాస్తంత అవగాహన కలిగిన వాళ్లు కూడా అర్థం చేసుకోగలుగుతారు. రాజకీయంగా ఆప్‌ను దీటుగా ఎదుర్కొంటూనే ప్రజలను, ముఖ్యంగా ఓటర్లను కూడా తమవైపు తిప్పుకునే వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో భాగంగానే.. యమునా నది కాలుష్యం, ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం, రాజధాని నగరంలో నీటి ఎద్దడి, ముంపు ప్రాంతాల్లో బాధితులకు అందని పరిహారం వంటి కీలక అంశాలను బీజేపీ అస్త్రాలుగా వాడుకుంటోంది. మరోవైపు.. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా బీజేపీ ఉపయోగించుకుంటోందన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. అంతేకాదు.. ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పటికీ ఆప్‌కు పూర్తిస్థాయి అధికారాలు ఇవ్వకుండా.. లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు ఆసాధారణ అధికారాలు కట్టబెట్టిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అటు.. ఆప్‌ అసంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన నేపథ్యంలో.. బీజేపీ కూడా అభ్యర్థులను వీలైనంత తొందరగా ఖరారు చేయాలని, అభ్యర్థులను ముందుగానే ప్రచారంలోకి దింపాలని రాష్ట్ర కమిటీ కసరత్తులు చేస్తోంది.

తొలినుంచీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పార్టీల సరళిని ఓసారి పరిశీలిద్దాం…

స్వతంత్ర భారతావనిలో 1952లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మొత్తం 48 సీట్లకి గానూ.. కాంగ్రెస్‌ 39 సీట్లు గెలవగా.. బీజేపీ ఐదు సీట్లకు పరిమితమైంది. సోషలిస్ట్‌ పార్టీ 2, అఖిల భారతీయ హిందూ మహాసభ ఒక స్థానంలోనూ, మరోస్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. దీంతో, కాంగ్రెస్‌ పార్టీ సీఎం పీఠాన్ని చేజిక్కించుకుంది.

1952లో సీ కేటగిరిలో ఉన్న ఢిల్లీ.. ఆ తర్వాత ఏర్పాటైన స్టేట్‌ రియార్గనేజేషన్‌ కమిషన్‌ ప్రక్రియ కారణంగా ఢిల్లీ అసెంబ్లీ రద్దయ్యింది. కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించింది. తిరిగి 1991లో 69వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు శాసన సభ ఏర్పాటుకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలోనే 1993లో ఢిల్లీ శాసన సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయదుందుబి మోగించింది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 49 సీట్లు గెలుచుకుంది. చిన్న వయస్సులోనే దివంగత సుస్మా స్వరాజ్‌ సీఎం పీఠం అధిరోహించారు. 14 సీట్లతో కాంగ్రెస్‌ ప్రతిపక్షానికి పరిమితమైంది. జనతాదల్‌ నాలుగు, స్వతంత్రులు మూడు చోట్ల గెలిచారు.

1998లో జరిగిన ఎన్నికల్లో హస్తం పార్టీ ఢిల్లీ పీఠాన్ని గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 52 సీట్లు గెలుచుకుని అధికార బీజేపీని మట్టికరిపించింది. బీజేపీ 15 స్థానాలకు పరిమితమైంది. మిగిలిన మూడు స్థానాల్లో స్వతంత్రులు, ఇతర పార్టీలు గెలిచాయి. కాంగ్రెస్‌ తరఫున దివంగత నేత షీలా దీక్షిత్‌ ముఖ్యమంత్రి అయ్యారు. 2003 ఎన్నికల్లోనూ 1998 ఎన్నికల ఫలితాలే రిపీట్‌ అయ్యాయి. వరుసగా రెండో సారి కాంగ్రెస్‌ విజయం సాధించింది. 47 స్థానాలు గెలుచుకుని షీలా దీక్షిత్‌ రెండో సారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. బీజేపీ 20 స్థానాలు గెలుచుకుంది. ఎన్సీపీ, జేడీఎస్, స్వతంత్రులు ఒక్కో చోట గెలుపొందారు. ఆ తర్వాత 2008 ఎన్నికల్లోనూ కాంగ్రెనస్‌ పార్టీ గెలిచి..హాట్రిక్‌ కొట్టింది. 43 స్థానాలతో వరుసగా మూడో సారి షీలా దీక్షిత్‌ సీఎంగా ఎన్నికయ్యారు. బీజేపీ అప్పుడు కూడా ప్రతిపక్ష స్థానానికే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 23 సీట్లు గెలుచుకుంది. బీఎస్పీ 2, లోక్‌జనసత్తా పార్టీ 1, స్వతంత్రులు ఒక్క స్థానంలో గెలుపొందారు.

ఇక, అప్పటిదాకా కొనసాగిన కాంగ్రెస్‌ జైత్రయాత్రకు 2013 ఎన్నికల్లో తెరపడింది. ఢిల్లీలో తొలిసారి త్రిముఖ పోరు నడిచింది. ఫలితంగా ఢిల్లీ అసెంబ్లీ చరిత్రలో తొలిసారి హంగ్‌ ఏర్పడింది. 70 స్థానాలకు గాను బీజేపీ 31 సీట్లు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. తొలిసారి పోటీ చేసి ఆమ్‌ ఆద్మీ పార్టీ 28 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌ ఎనిమిది స్థానాలకు పడిపోయింది. అయితే, కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో 2013లో ఆప్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి అర్వింద్‌ కే జ్రీవాల్‌ బాధ్యతలు చేపట్టారు. అయితే, అప్పటి సంకీర్ణ ప్రభుత్వం కేవలం 13 నెలలు మాత్రమే కొనసాగింది. సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామాతో 2015లో ఫిబ్రవరిలో ఢిల్లీ శాసన సభకు మళ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆప్‌ ఘన విజయం సాధించింది. 67 సీట్లు గెలుచుకుని ఢిల్లీ అసెంబ్లీలో రికార్డు విజయం సాధించింది. మిగిలిన మూడు స్థానాల్లో బీజేపీ గెలిచింది.ఢిల్లీ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్‌ పార్టీ కనీసం బోణీ చేయలేదు.

1993 తర్వాత వరుసగా పదిహేనేళ్లు పాటు అధికారానికి దూరమైన బీజేపీ 2013, 2015, 2020లో జరిగిన ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేపట్టాలన్న కృతనిశ్చయంతో పని చేసింది. అయితే ఆ పార్టీ ఆశలు అడియాశలయ్యాయి. 2020లో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలతోపాటు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల సీఎంలు ఢిల్లీలో ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. దీంతో, దాదాపు మూడు దశాబ్దాలుగా బీజేపీకి ఢిల్లీ అసెంబ్లీ అందని ద్రాక్షగానే మిగిలి పోయింది. కానీ, ఈసారి మాత్రం ఈ ఫలితాలను రిపీట్‌ కాకుండా.. ఏమేం చేయాలో, ఎలా చేయాలో సర్వ శక్తులూ ఒడ్డుతోంది. ఏది ఏమైనా వచ్చే యేడాది ప్రథమార్థంలో జరిగే ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీపై కాషాయ జెండా ఎగురవేయాలని పట్టుదలతో వ్యూహాలు రచిస్తోంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com