డీలిమిటేషన్ పేరుతో చెన్నైలో స్టాలిన్ అధ్యక్షతన జరిగేది దొంగల ముఠా సమావేశమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ‘‘ఆ సమావేశంలో పాల్గొనే పార్టీలు లిక్కర్ దందాతో దొరికినోళ్లే. స్టాలిన్ ప్రభుత్వం కూడా రూ.వెయ్యి కోట్ల లిక్కర్ స్కాంకు పాల్పడింది. ప్రజలు స్టాలిన్ ప్రభుత్వంతో విసిగిపోయారు. తెలంగాణలోనూ అవినీతి పాలన, 6 గ్యారంటీల పేరుతో చేసిన మోసాలవల్ల జనం కాంగ్రెస్ అంటేనే అసహ్యించుకుంటున్నారని చెప్పారు. గత పదేళ్ల పాలనలో చేసిన అవినీతి స్కాంల నుండి తప్పించుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తోందన్నారు. రెండు పార్టీలు ఒక్కటేననే విషయం మరోసారి రుజువైందన్నారు. ఆయా పార్టీలన్నీ డీలిమిటేషన్ పేరుతో దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారంటూ మోదీ ప్రభుత్వంపై బురదచల్లుతూ స్వార్ధ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. అసలు డిలిమిటేషన్ పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదన్నారు. గైడ్ లైన్స్ కూడా రూపొందించిన అంశంపై అవాకులు చవాకులు పేలడం సిగ్గు చేటన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, ఆప్ పార్టీల తీరు ‘ఆలు లేదు..చూలు లేదు..అల్లుడి పేరు సోమలింగం’’అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
ఈరోజు కరీంనర్ లోని చామనపల్లిలో బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చెన్నైలో డీఎంకే ఆధ్వర్యంలో జరుగుతున్న డీలిమిటేషన్ మీటింగ్ తీరును తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. దోచుకున్నది దాచుకోవడానికి, అవినీతి స్కాంల నుండి బయటపడే దానిపైనే చెన్నైలో స్టాలిన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగిందని ఎద్దేవా చేశారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో సీట్లు తగ్గే ప్రసక్తే ఉండదని పార్లమెంట్ లోనే కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సంజయ్ గుర్తు చేశారు.
డీలిమిటేషన్ పై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేశారు. గైడ్ లైన్స్ కూడా వెలువడని అంశంపై ఏది పడితే అది మాట్లాడుతూ దక్షిణాదికి అన్యాయం జరుగుతోందంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా దక్షిణాదిలో వికసించేది కమలమేనని ఉద్ఘాటించారు. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే గతంలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారమంతా ఒట్టిదేనని చెప్పారు. ‘‘నేను రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేను. జాతీయ నాయకత్వం, మోదీగారు నాకు కేంద్ర మంత్రి బాద్యతలు అప్పగించారు. మీడియా, సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమొద్దు. రాష్ట్ర అధ్యక్ష పదవిపై జరుగుతున్న ప్రచారమంతా ఒట్టిదే. ఎందుకంటే జాతీయ నాయకత్వం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అమలు చేయడమే క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తల పని’’అని పేర్కొన్నారు.
తాను గతంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశానని, కార్యకర్తలతో కలిసి అనేక పోరాటాలు చేశానని చెప్పుకొచ్చారు. 8 ఎంపీ, 8 ఎమ్మెల్యే, 3 ఎమ్మెల్సీ సీట్లతో బీజేపీ రాష్ట్రంలో బలంగా ఉందన్నారు.
కేసీఆర్ మళ్లీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారంటూ మాజీమంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ తనదైన శైలిలో తిప్పికొట్టారు. ‘‘మహారాష్ట్ర ఎన్నికల టైంలో ఇట్లనే మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంచులు పంపి ఇట్లనే మాట్లాడారు. ఏమైంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఇయాళ ఫాంహౌజ్ లో గడ్డి పీకుతున్నడు. మళ్లీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఇక కల్ల’’అని వ్యాఖ్యానించారు.