వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు
పాఠశాల స్థాయి విద్యకు సంబంధించి కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠ్యాంశాల్లో లైంగిక విద్యను కూడా ప్రవేశపెట్టనుంది. కౌమారదశలో ఉన్న విద్యార్థులకు శారీరక భావోద్వేగ, హార్మోన్ల మార్పులు గురించి కనీస పరిజ్ఞానం ఉండాల్సిన అవసరముందని అక్కడి ప్రభుత్వం స్పష్టంచేసింది. దీంతో, పాఠశాలల్లో పాఠ్యాంశాల్లో లైంగిక విద్యను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం నిలుస్తోంది.
వీటితో పాటు సైబర్, పరిశుభ్రత, విద్యార్థుల వ్యక్తిగత ఆరోగ్యంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. పాఠశాల విద్యలో 8వ తరగతి నుంచి 12వ తరగతుల విద్యార్థులకు బోధించే పాఠ్య పుస్తకాల్లో లైంగిక విద్యను చేర్చనున్నామని, లైంగిక విద్యను వచ్చే విద్యాసంవత్సరం నుంచి బోధించనున్నట్లు కర్నాటక విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. విద్యార్థుల్లో కౌమార దశలో చోటుచేసుకునే శారీరక, భావోద్వేగ, హార్మోన్ల మార్పుల గురించి అవసరమైన జ్ఞానాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
వైద్య నిపుణుల ద్వారా వారానికి రెండుసార్లు లైంగిక విద్య తరగతులు నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు. ఏడాదికి రెండుసార్లు విద్యార్థులు ఆరోగ్యం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పరిశుభ్రతపై విద్యార్థులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది అవగాహన కల్పిస్తారని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది విద్యార్థులకు పరిశుభ్రత, అంటు వ్యాధులు, డ్రగ్స్ వినియోగం, ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తారని చెప్పారు. లైంగిక విద్యతో పాటు.. డిజిటల్ ఎడిక్షన్, ప్రీమెచ్యూర్ సెక్సువల్ యాక్టివిటీ, టీనేజ్ ప్రెగ్నెన్సీ వంటి సమస్యలపై ప్రత్యేక తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు.. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు నైతిక విద్య సబ్జెక్టును కర్నాటక ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వారానికి రెండుసార్లు సెషన్‌లు నిర్వహించే అవకాశం ఉంది. ఈ పాఠ్యాంశాలు సమగ్రత, నిజాయితీ,సహనం వంటి విలువలను విద్యార్థుల్లో అలవర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.