తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఇరుకున పెట్టారా? కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లలేని, వెనక్కి లాక్కోని పరిస్థితిని సృష్టించారా? ఫలితంగా నరేంద్ర మోదీకి ముందు నుయ్యి, వెనుక గొయ్యి లాంటి పరిస్థితిని రేవంత్ రెడ్డి తీసుకొచ్చారా? ఇప్పుడీ ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ ఏంటీ? నరేంద్ర మోదీని ఇరికించడమేంటి? అనుకుంటున్నారా? అవును.. నిజమే. వాస్తవానికి నరేంద్ర మోదీ పొలిటికల్ వ్యూహాలు ఎవరికీ అందవన్నది రాజకీయ వర్గాల్లో ఉన్న అభిప్రాయం. సైలెంట్‌గా తాను చేయాల్సింది చేసుకుంటూ పోతారని, అలా అని దూకుడు, ఇప్పటికిప్పుడే చేయాలన్న ఆవేశం చూపించరన్నది విశ్లేషకుల మాట. కానీ, మహేష్ బాబు సినిమాలో మాదిరిగా.. కత్తి దిగిందా? లేదా? అన్నట్లుగా మోదీ రాజకీయ చాణక్యం ప్రదర్శిస్తారని చెప్పుకుంటూంటారు. అయితే, అలాంటి నరేంద్రమోదీనే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇరుకున పడేశారన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది.
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లు తెచ్చారు. ఆ బిల్లును అటు అసెంబ్లీలో, ఇటు శాసన మండలిలో ప్రవేశ పెట్టారు. అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా బీసీ బిల్లును ఆమోదించాయి. ఫలితంగా బీసీలకు రిజర్వేషన్లు భారీగా పెరగబోతున్నాయి. విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో బీసీలకు ప్రస్తుతం 29 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఆ రిజర్వేషన్ శాతాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ బిల్లు రూపొందించక ముందు.. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా కుల గణన నిర్వహించింది ప్రభుత్వం. ఈ సర్వేలో తెలంగాణలో 56.36 శాతం బీసీలు ఉన్నట్లు తేలింది. ఈ సర్వే నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంబంధింత బిల్లులకు రాష్ట్రంలోని ఇరు చట్ట సభలు కూడా ఆమోద ముద్ర వేశాయి. అంటే ఇక విద్యా సంస్థల్లో, ప్రభుత్వ నియామకాల్లో, అలాగే.. పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పోరేషన్ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయని అందరూ అనుకోవచ్చు. అయితే,ఇంతటితోనే పని పూర్తి కాలేదు.
రాష్ట్రంలోని చట్ట సభలు బిల్లులను ఆమోదించినప్పటికీ ఆ బిల్లులకు కేంద్రం ఆమోదం అవసరం. దేశంలో ఏ రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచాలన్నా, తగ్గించాలన్నా, ఆయా కులాల జాబితాను మార్చాలన్నా రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో అధికారం లేదు. ఈ అంశం కేంద్రం జాబితాలో ఉంటుంది. రాష్ట్రాలు ప్రతిపాదిస్తే.. కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
కాబట్టి రాష్ట్రంలో చట్ట సభల ఆమోదం పొందిన ఈ రిజర్వేషన్ల పెంపు బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తోంది. ఈ బిల్లును పార్లమెంట్ మూడింట రెండు వంతుల మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తే.. ఆ తీర్పుల ప్రకారం ఎస్సీ,ఎస్టీ, బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. అలా మించితే రాజ్యాంగ సవరణ చేసి షెడ్యూల్ -9లో చేర్చాల్సి ఉంటుంది. తెలంగాణలో ఈ ప్రతిపాదన ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచితే.. ప్రస్తుతం ఎస్సీలకు అమలవుతోన్న 15శాతం, ఎస్టీలకు అమలవుతోన్న 10 శాతం రిజర్వేషన్లు కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్ల శాతం 67కు చేరుకుంటుంది. ఇది సుప్రీం కోర్టు తీర్పులు, మార్గదర్శకాలకు విరుద్ధం. అలా సవరణ చేయాలంటే అందుకు సరైన కారణాలు వెల్లడించాలి. అందుకు తగిన గణాంక సమాచారం కూడా అందుబాటులో ఉంటే అప్పుడు తగిన కారణాలతో రిజర్వేషన్లు 50 శాతం కంటే ఎక్కువగా పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఈ కారణాల తోనే రేవంత్ సర్కార్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసి లీగల్‌గా ఎదుర్కొనే రీతిలో న్యాయ సలహాలు తీసుకొని మరీ పటిష్టంగానే బీసీ కుల గణన చేపట్టింది. సమగ్ర కుటుంబ సర్వే తర్వాతనే బీసీ లెక్కలను బహిర్గతం చేసింది. ఆ తర్వాత చట్టసభల్లో ఈ బిల్లులకు ఆమోదం లభించింది.
ఇక, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల పెంపు బంతిని కేంద్రం కోర్టులో పడేసింది రేవంత్ ప్రభుత్వం. పార్లమెంట్లో మూడింట రెండు వంతుల మద్దతు వస్తే రాజ్యాంగ సవరణ వీలవుతుంది. అప్పుడే రాష్ట్రంలో పెంచిన బీసీ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలోనే బీసీ కుల గణన చేపడతామని హామీ ఇచ్చింది. దేశంలో బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ అగ్రనేత రాహూల్ గాంధీ పలు సందర్భాల్లో చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో కూడా రాహుల్‌గాంధీ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపిస్తోంది. అయితే, దేశవ్యాప్త కులగణన విషయంలో మోదీ సర్కార్ సానుకూలంగా స్పందిస్తుందా? అన్నది సందిగ్ధమే. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీసీలంతా ఐక్యంగా ఉండాలని, బీసీ లెక్కలు అవసరం లేదన్న రీతిలో మోదీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇప్పుడు.. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంపు బిల్లుకు ఆమోద ముద్ర వేస్తే అది కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఓ అస్త్రంగా మారుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు తాము బీసీలకు మేలు చేసేలా రిజర్వేషన్లు పెంచామని, పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది చేసి చూపించామని చెప్పుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. అలా బీసీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. మరి.. ఈ కోణంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేలా మోదీ ప్రభుత్వం తెలంగాణ బీసీ రిజర్వేన్ల పెంపు బిల్లుకు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుందా? అన్నది సందేహమే.
తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుకూలంగా ఎన్డీఏ ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే తేనె తుట్టెను కదిపినట్లే అవుతుంది. ఎందుకంటే.. ఇదే రీతిలో అన్ని రాష్ట్రాల నుంచి రిజర్వేషన్ల పెంచాలన్న డిమాండ్లు వస్తాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి కూడా ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే.. ఈ రిజర్వేషన్ల బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండా పక్కన పెడితే బీజేపీకి బీసీ వ్యతిరేక పార్టీగా ఇటు తెలంగాణతో పాటు.. దేశవ్యాప్తంగా కూడా ముద్రపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి డిమాండ్లు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇతర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. వారిని కాదనే పరిస్థితి కేంద్రంలో బలహీనంగా ఉన్న బీజేపీకి లేక పోవచ్చు. ఒక వేళ.. ఈ బిల్లును పాజిటివ్‌గా తీసుకుంటే ఆ సక్సెస్ తన ఖాతాలో పడుతుందా? లేదంటే మొదటి నుంచి బీసీ రాగం వినిపించిన కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడుతుందా? అన్న సందిగ్ధం బీజేపీలో నెలకొంటుంది. మరి.. రేవంత్ రెడ్డి పడేసిన ఇరకాటం లోంచి ప్రధాని నరేంద్ర మోదీ ఏ విధంగా బయట పడతారన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.