తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ కోసం బడ్జెట్‌లో రూ.774 కోట్లు కేటాయించారు. ఈమేరకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో వివరాలు తెలియజేశారు.
హైదరాబాద్‌కు సమాంతరంగా నిర్మించ బోతున్న ఫ్యూచర్ సిటీలోనే ఈ ఏఐ సిటీని నిర్మించబోతున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీలోనే ప్రత్యేకంగా 200 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ – ఏఐ సిటీని నిర్మిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు.
ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం నడుస్తోంది. డిజిటల్ యుగంలోనూ ఇప్పుడంతా ఏఐ మయం అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ టెక్నాలజీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలోనే ఏఐ సిటీకి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది.
కొత్తగా నిర్మించనున్న ఏఐ సిటీ ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజ కంపెనీలకు కేంద్రంగా మారుతుందన్నారు. ఆ స్థాయిలో సిటీకి రూపకల్పన చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఏఐ సిటీలో గూగుల్ కంపెనీ తన AI ఆధారిత యాక్సిలరేటర్ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతోందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ సిటీ కోసం ఐటీ డిపార్ట్‌మెంట్‌కు బడ్జెట్‌లో రూ.774 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
సేవా రంగంలో అభివృద్ధికి దోహదపడేలా తెలంగాణ ప్రభుత్వం అనేక సానుకూల నిర్ణయాలు తీసుకుంటోందని, ఈ కీలక నిర్ణయాల ఫలితంగా.. ఐటీ రంగంలో పురోగతి సాధిస్తున్నామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, బ్లాక్ చైన్ వంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఫలితంగా ఆధునిక ప్రక్రియల అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.