తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాము తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న ప్రోత్సాహకాలతో సన్నరకాల వరి సాగు గణనీయంగా పెరిగిందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన భట్టి విక్రమార్క.. బడ్జెట్ ఆసాంతం వివరంగా చదివి సభ్యులకు వినిపించారు. ప్రతి అంశంపైనా స్పష్టంగా వివరణ ఇచ్చారు. త
రాష్ట్రంలో రైతుల నుంచి కొనుగోలు చేసే సన్న బియ్యానికి ప్రతి క్వింటాలుకు రూ.500 చొప్పున అదనపు ప్రోత్సాహకాన్ని చెల్లిస్తున్నామని చెప్పారు. ఈ బోనస్ అందిస్తున్న కారణంగా తెలంగాణలో సన్న బియ్యం వరి సాగు భారీగా పెరిగిందన్నారు.
అకాల వర్షాలతో ధాన్యం పాడవకుండా, పండిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో ఎటువంటి నష్టం జరుగకుండా ఉండేందుకు.. గంట గంటకూ వాతావరణ సూచనలను అటు రైతులకు, ఇటు కొనుగోలు కేంద్రాలకు తెలియజేస్తున్నామన్నారు. అధునాతన డ్రయర్లు, ధాన్యం క్లీనర్లు, తగినన్ని టార్పాలిన్లను సైతం రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.
2024-25 ఖరీఫ్ సీజన్‌లో పది లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఎనభై నాలుగు (10,35,484) మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేశామన్న ఉప ముఖ్యమంత్రి.. అన్నదాతల అకౌంట్లలో రూ.12,511.76 కోట్లు జమ చేశామని వివరించారు.
అలాగే, రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును విస్తృతంగా చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని భట్టి విక్రమార్క చెప్పారు. దీని కోసం ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తున్నామని చెప్పారు. మొత్తానికి వ్యవసాయ శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.24,439 కోట్లు ప్రతిపాదిస్తున్నామని చెప్పారు.