34.1 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

నాగ్ పూర్ హింసలో కుట్ర కోణం

మహారాష్ట్రలో ఔరంగాజేబు సమాధి వివాదం చినికి చినికి గాలివానగా మారింది. నాగ్‌పూర్‌లో ఇది అల్లర్లకు దారితీసింది. సోమవారం రాత్రి చెలరేగిన అల్లర్లలో 33 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కీలక ప్రకటన చేశారు. అల్లర్ల వెనుక భారీ కుట్ర ఉందన్నారు. అల్లర్లలో ప్రమేయమున్న 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాగ్‌పూర్‌కు ప్రశాంతమైన నగరంగా పేరుంది. 1993 నుండి ఇక్కడ మతపరమైన అల్లర్లు జరగలేదు. నేడు హింసాకాండతో మండుతోంది. నాగ్‌పూర్ పోలీసులు ఈ ఘటనను కుట్రగా అంగీకరించడానికి నిరాకరిస్తున్నప్పటికీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా ఈ వాస్తవాన్ని అంగీకరించి, దానికి సంబంధించిన ఆధారాలను కూడా అందించారు.

ఈ సంఘటనకు అల్లరి మూకలు సన్నాహాలు చేశాయని, ఛావా సినిమా తరువాత ఔరంగాజేబు అకృత్యాలు ప్రజలకు తెలిశాయని, శంభాజీ వీరత్వంపై జనం ప్రశంసలు కురిపిస్తున్నారని ఫడ్నవీస్‌ అన్నారు. ఇది తట్టుకోలేక కొన్ని అరాచక శక్తులు హింసను రెచ్చగొట్టాయన్నారు. 11 పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ కొనసాగుతున్నట్టు వెల్లడించారు. అల్లర్లలో ముగ్గురు డీసీపీలకు కూడా గాయాలైనట్టు తెలిపారు. ప్రజలు సంయమనం పాటించాలని సీఎం ఫడ్నవీస్ పిలుపునిచ్చారు.

నాగ్‌పూర్‌ హింసపై విపక్షాలు మహాయుతి సర్కార్‌ను నిలదీశాయి. సీఎం ఫడ్నవీస్‌ మహారాష్ట్రను మణిపూర్‌లా మార్చేశారని శివసేన ఉద్దవ్‌ వర్గం నేత ఆదిత్యా ఠాక్రే ఆరోపించారు. హోంశాఖ కూడా ఫడ్నవీస్‌ దగ్గరే ఉందని, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఫడ్నవీస్‌ రాజీనామా చేయాలని ఉద్దవ్‌ ఠాక్రే డిమాండ్‌ చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలో హింస రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతోందన్నారు సంజయ్‌ రౌత్‌. ఔరంగజేబు సమాధి చుట్టూ మహారాష్ట్రలో రాజకీయ, మతపరమైన వివాదాలు ఉద్రిక్తతలకు దారితీశాయి.

నాగ్‌పూర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా హైటెన్షన్‌ వాతావరణం ఉంది.ఇదిలావుంటే, నాగ్‌పూర్ హింసను ప్రత్యక్షంగా చూసిన వారు మాట్లాడుతూ, అల్లర్లకు పూర్తిగా సిద్ధమై వీధుల్లోకి ప్రవేశించి ఇళ్ళు, భవనాలు, దుకాణాలు, వాహనాలను రాళ్లతో రువ్వడం ద్వారా ధ్వంసం చేశాయని చెప్పారు. అది చాలా భయంకరమైన దృశ్యమని, ప్రజలు ఇప్పటికీ భయం నీడలోనే జీవిస్తున్నారని చెప్పారు. ఈ ఘటన గురించి పెద్ద ప్రశ్న ఏమిటంటే 1993 తర్వాత ఇక్కడ అల్లర్లు జరగలేదు, మరి ఇంత పెద్ద గొడవ అకస్మాత్తుగా ఎలా జరిగింది? పరిస్థితి ఎలా తయారైందంటే, ఇప్పటికీ 11 చోట్ల కర్ఫ్యూ ఉంది. మహల్, హంసపురి ప్రాంతాలు ఉద్రిక్తంగా మారిపోయాయి.

పోలీసుల సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో ఒక పుకారు వ్యాపించింది. దీని తరువాత, వందలాది మంది అల్లరిమూకలు కొద్దిసేపటిలోనే అక్కడికి చేరుకున్నారు. ఈ అల్లరిమూకలు రాళ్ళు, కర్రలు, రాడ్లు, కత్తులు, ఈటెలు, హాకీ కర్రలతో వచ్చారు. ఈ అల్లర్లలో కొందరు కాలినడకన వచ్చారు. మరికొందరు నంబర్ ప్లేట్లు లేని బైక్‌లు, స్కూటర్లపై వచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు. మంగళవారం సాయంత్రం వరకు కూడా దానిని సడలించలేకపోయారు. పుకార్లు వ్యాప్తి చేసేవారిని, అల్లర్లమూకలను గుర్తించడానికి పోలీసులు ఎలక్ట్రానిక్ నిఘాను ఉపయోగిస్తున్నారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) ఏర్పడి ఈ ఏడాది వందేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో దేశమంతా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమవుతుండగా సంఘ్ ప్రధాన కార్యక్షేత్రం ఉన్న నాగ్‌పూర్‌ లో అల్లర్లు చెలరేగడం అనుమానాలకు తావిస్తోంది.

ఆర్ఎస్ఎస్ ను అప్రతిష్టపాలు చేసేందుకే కొన్ని శక్తులు ప్రణాళిక ప్రకారం నాగ్‌పూర్‌ హింసరచనకు కుట్ర చేశాయని వార్తలు వస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com