పాకిస్తాన్ ప్రభుత్వం దాష్టికాలు భరిస్తూ కటిక పేదరికం అనుభవిస్తున్న బలూచిస్థాన్ ప్రజల్లో… అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. బలూచిస్థాన్ అపారమైన సహజవనరులకు ప్రసిద్ది. ఖనిజ సంపదలో బలూచిస్థాన్ ఆ దేశానికి బంగారు గని లాంటిది. సంపద పంపిణీలో ఈ రోజు వరకు ఫెడరల్ ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా రావటం లేదు.
పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘానిస్తాన్ దేశాల్లో మూడు ముక్కలుగా బలొచిస్థాన్ ప్రాంతం విడిపోయి ఉంది. మూడింటిలో పాకిస్తాన్ లోని బలూచిస్థాన్ పెద్ద రాష్ట్రం. స్వతంత్ర భావాలు కలిగిన బలోచ్ ప్రజలు ఇతరుల అధికారాన్ని సహించరు. దీంతో వేర్పాటువాద ఉద్యమం రాచపుండులా రగులుతూనే ఉంది.
పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వంలో పంజాబీల ఆధిపత్యం అధికం. బలూచ్ వనరులు పంజాబ్ తరలిపోతున్నాయని ఆగ్రహం. పంజాబీలను బలూచ్ ప్రజలు ఆగర్భశత్రువులుగా చూస్తారు. బలూచిస్థాన్ నుంచి వనరులు కొల్లగొడుతున్నా సంక్షేమానికి వాటా దక్కడం లేదు. కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉండే కీలుబొమ్మ నేతల ఏలుబడితో ప్రజల కష్టాలు తీరటం లేదు. దీంతో బలూచిస్థాన్ లో పేదరికం పెరిగిపోతోంది. నిరుద్యోగం, అవినీతి, వ్యవసాయానికి యోగ్యమైన భూమి తక్కువగా ఉండటం ప్రజల పాలిట శాపంగా మారింది.
పాక్ స్వార్థం – చైనా దోపిడీ
ఇక్కడి ఖనిజ సంపద మీద కన్నేసిన చైనా పాకిస్థాన్‌తో స్నేహం చేసి చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్( సీపెక్-) పేరుతో గ్వదార్‌లో ఓడరేవు అభివృద్ధి చేసింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటీవ్‌లో భాగమైన దీని ద్వారా ఇక్కడి సంపద చైనా తరలించుకుపోతోంది. గ్వదార్ పోర్టులో స్థానికులకు ఉపాధి కల్పించ లేదు. కార్మికుల నుంచి ఉన్నతాధికారుల వరకు చైనా నుంచే రప్పిస్తున్నారు. ఓడరేవులో స్థానికులకు ఉపాధి కల్పించాలని నేతలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చైనా కంపనీలు, పాకిస్తాన్ ప్రభుత్వం పట్టించుకోలేదు.
గ్వదార్ పోర్టుకు ముందే సైనదాక్ గనిలో రాష్ట్ర ప్రభుత్వానికి 30 శాతం వాటా వస్తుండగా, దుద్దర్ గనిలో లాభాలు రావటం లేదని… కేవలం 10 శాతం వాటానే చైనా కంపెనీ ముట్టచెబుతోంది. గనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించక కార్మికులు చనిపోవటం నిత్యకృత్యంగా మారింది. బెలుచ్ ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో ఎక్కువ భాగం గనుల దగ్గరికి వెళ్ళే రోడ్ ల నిర్వహణకే సరిపోతోంది. ప్రజా సంక్షేమానికి అరకొరగా నిధులు ఖర్చు చేస్తూ, స్థానిక నేతలు అవినీతికి పాల్పడుతున్నారు. ప్రభుత్వంలోని పెద్దల్ని తమ గుప్పిట్లో పెట్టుకొని చైనా కంపెనీలు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
స్థానికులకు న్యాయం చేయాలని హక్కుల సంఘాలు, నేతలు డిమాండ్ చేస్తే… అలాంటి వారిని హతమార్చటం సాధారణమైంది. బలోచ్ అసంతృప్త వాదుల నుంచి ముప్పు పొంచి ఉందని పాక్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాల్ని మోహరించింది. చైనా కంపనీలు వచ్చినప్పటి నుంచి దోపిడీ మరింత పెరిగి పోయింది.
ఆ దేశ జియోలాజికల్ సర్వే సంస్థ వివరాల ప్రకారం 80 రకాల ఖనిజ నిల్వలు సమృద్దిగా ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే వెలికి తీయగా ప్రభుత్వ విధానాలు సరిగా లేక మరెన్నో అలాగే ఉండిపోయాయి. బంగారం, కాపర్, జింక్, సిల్వర్ నిల్వలతో పాటు సహజవాయువు నిల్వలు సమృద్దిగా ఉన్నాయి.
దుద్దేర్, సైనదాక్, రీకో-డిక్ గనుల్లో మైనింగ్ జరుగుతోంది. వాటిలో మొదటి రెండు చైనాకు చెందిన మేటలర్జికల్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (MCC) ఆదీనంలో నడుస్తున్నాయి. MCC – పాకిస్తాన్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో కలిసి ఈ గనుల్ని నిర్వహిస్తోంది. రీకో- డిక్ గని న్యాయ పరమైన చిక్కుల్లో పడి పాక్ 6 బిలియన్‌ల రాబడి చేజార్చుకొంది.
నిధుల పంపిణీలో వివక్ష – మిలిటరీ ఆగడాలు
దేశ సంపదలో సరైన వాటా దక్కక అనేక సార్లు తిరుగుబాటు జరిగిన సందర్బాలు ఉన్నాయి. భారత–పాక్ ఏర్పాటు సమయంలో రాజధాని క్వెట్టా తో పాటు ఇతర నగరాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయగా భారత దేశంలో విలీనం చేయాలనే డిమాండ్లు వచ్చాయి. భౌగోళికంగా భారత్ లో విలీనం సాథ్యం కాదని ఆ డిమాండ్ పక్కన పెట్టేశారు.
ఈ ప్రాంతంలో అభివృద్దికి నిధులు కేటాయించక పోగా మిలిటరీ స్థావరాలు పెంచుతున్నారని బలోచ్ నేత నవాబ్ అక్బర్ ఖాన్ బుగ్తి , మీర్ నవాబ్ మర్రి లు అనేక సార్లు నిరసన వ్యక్తం చేశారు. 2006 లో పర్వేజ్ ముషారఫ్ పాక్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పాక్ మిలిటరీ కి బలోచ్ తిరుగుబాటు వర్గాలకు మధ్య జరిగిన గొడవల్లో బుగ్తి మరణించారు. పాక్ మిలిటరీ చర్చల పేరుతో రప్పించి కాల్చి చంపిందనే అనుమానం బలోచ్ ప్రజల్లో నాటుకు పోయింది.
ఆనాటి నుంచి బలోచ్ ప్రజల తరపున నాయకత్వం తీసుకునే నేతలు లేక పోగా… పాక్ కొమ్ము కాసే నేతలు పెరిగిపోయారు. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కిడ్నాప్ చేసి చంపటం, ఎన్‌కౌంటర్ చేయటం సాధారణంగా మారింది. రాజధాని క్వెట్టాలో నిరసనలు, ఆందోళనలు ప్రతి రోజు జరుగుతుంటాయి.
ఇప్పటి వరకు మూడు వర్గాలుగా ఉన్న బలోచ్ తిరుగుబాటుదారులు..ఇటీవల ఒకే గొడుగు కిందకు వచ్చి బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(BLA)గా ఏర్పడ్డారు. విలీనం అయ్యాక జరిగిన ఘటనే రైలు హైజాక్. చైనా పౌరులు, పాకిస్థాన్ సైన్యం కనిపిస్తే ఒంటికాలి మీద లేచే బలోచ్ ప్రజలు వారిపై దాడి చేసేందుకు ప్రాణాలకు తెగిస్తారు.
కెనడా రాజధాని టొరంటోలో నివసించే బలోచ్ కార్యకర్త కరీమా బలుచ్ 2016లో రక్షా భందన్ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఘటన పాకిస్థాన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది జరిగిన కొద్ది రోజులకే కరీమా బలుచ్ హత్యకు గురయ్యారు.
ఈ క్రమంలో నరేంద్ర మోడీ 2018 భారత స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో బలూచిస్థాన్ అంశాన్ని ప్రస్తావించటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ తర్వాత అంతర్జాతీయ వేదికలపై బలుచ్ ప్రజల కష్టాలను భారత్ ఎప్పుడు ప్రస్తావించలేదు. నరేంద్ర మోడీ వ్యాఖ్యలతో బలూచిస్థాన్ ప్రజలకు మేలు కన్నా నష్టమే ఎక్కువ జరిగిందని చెప్పాలి.
తాజాగా రైలు హైజాక్, తిరుగుబాటుదారుల దాడులు జరిగితే భారత నిఘా సంస్థ Research Aanalysis Wing (RAW) హస్తం ఉందని పాక్ మీడియాలో వార్తలు వస్తుంటాయి.
అయితే తెరవెనుక అమెరికా రాజనీతి ఉందనే విశ్లేషణ ఉంది. పాక్ పాలకులు చైనాతో అంటకాగటం… గ్వదార్ పోర్టు చైనా ఆధీనంలో ఉండటం ఇష్టంలేని అమెరికా లోపాయికారిగా తిరుగుబాటుదారులను ప్రోత్సహిస్తోందనే వాదన ఉంది.
సిరియా, జోర్డాన్, ఇరాక్, ఇరాన్ తదితర గల్ప్ దేశాల్లో జరిగిన మార్పుల మాదిరిగానే తొందరలో పాకిస్థాన్‌లో కొత్త శకం రాబోతోందని అంతర్జాతీయ రాజకీయ పండితులు చెప్పుకొస్తున్నారు.