- డబుల్ ఇన్ కమ్ నో చిల్డ్రన్ అంటున్న దేశ యువత
- బాధ్యతలు, బాదరబందీలు లేని జీవితం వైపు యువత మొగ్గు
- ఇదే కొనసాగితే దేశం తీవ్ర యువలోటు ఎదుర్కొనే ప్రమాదం
- భవిష్యత్తులో వృద్ధుల సంరక్షణ చూసుకునే నాధుడే ఉండడు
DINK… ప్రపంచానికి నూతనంగా పరిచయమైన ఈ పదం ఇప్పుడు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలోకి ఎక్కే స్ధాయికి అనతికాలంలోనే ఎదిగింది. వర్తమాన తరాల మెదళ్ళను ఆక్రమించిన ఈ పదాన్ని చాలా మంది యువత తారక మంత్రంగా భావిస్తున్నారు. వాస్తవానికి ఇదొక జీవన విధానానికి సంబంధించిన వాఖ్యానికి షార్ట్ ఫామ్. ఇలా డిన్క్(DINK) అంటూ ముద్దుగా పిలుచునేలా వ్యావహారికంలోకి తెచ్చారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ డిన్క్ ప్రభావం ఎలా ఉందన్న సంగతి పక్కన పెడితే మన దేశంలో మాత్రం డిన్క్ జీవన శైలి యువతను విశేషంగా ఆకర్షిస్తోందని అనేక సర్వేలు చెపుతున్నాయి. ప్రధానంగా చదువుకున్న యువత చాలా మంది ఈ జీవన విధానానికి అడాప్ట్ అయిపోతున్నారు. బరువు, బాధ్యతలకు దూరంగా ఉండే యువతరం, విచ్చలవిడి జీవన శైలికి అలవాటు పడిన యువత తమ జీవితాల్లోకి డింక్ ను ఆహ్వానిస్తున్నారు. ఇంతకీ డింక్ అంటే ఏంటనుకుంటున్నారా…? ఏంలేదండి… డబుల్ ఇన్ కమ్ నో కిడ్స్ అని అర్ధం. దీని పరమార్ధం ఏంటంటే పిల్లాజెల్లల బాధ్యతలు లేకుండా భార్యాభర్తలిద్దరూ ఏడంకెల సంపాదనతో జీవితాన్ని విచ్చలవిడిగా అనుభవించడం. మన దేశంలో లేటెస్ట్ లైఫ్ స్టైల్ ఇదే.
బాధ్యత అంటే ఆమడదూరం పరుగుపెట్టే పెంపకం… విచ్చలవిడి ఆధునిక జీవన విధానం… వ్యక్తిగత స్వార్ధాలు పెరిగిపోవడం… వెరసి పిల్లాజెల్లా జంజాటం మనకి ఉండకూడదనుకుంటున్నారు చాలా మంది యవత. భార్యాభర్తలు ఇద్దరూ కలిపి నెలకు లక్షల్లో సంపాదించుకుంటున్నామా… మనసుకు నచ్చినట్లు ఖర్చుపెట్టుకుంటున్నామా లేదా అన్న ఆలోచన తప్పితే మనకి ఒక కుటుంబం ఏర్పరచుకోవాలి… పిల్లల్ని కనాలి అనే ఆలోచనా ధోరణికే చాల మంది యువతీయువకులు దూరమవుతున్నారు. పిల్లల్ని కంటే వారిని పెంచాలి, చదివించాలి, ఉద్యోగాల్లో చేర్పించాలి, పెళ్ళిల్లు చెయ్యాలి వారిని జీవితంలో సెటిల్ చెయ్యాలి… ఇంత తతంగాన్ని బాధ్యతతో నిర్వర్తించే కల్చర్ ని నేటి యువత కోల్పోయారు. ఎంతసేపు మా సంపాదన, మా ఎంజాయ్మెంట్ ఇదే ఆలోచన తప్ప కనీసం పక్క ఇంట్లో ఎవరున్నారో తెలుసుకునే ఓపిక, అవసరం కూడా ఇప్పటి తరానికి ఉండటం లేదు. చీకూ చింతా లేకుండా మేమిద్దరం… మాకు రెండు జీతాలు అన్నట్లు జీవించేస్తున్నారు. ఇటువంటి జీవనవిధానానికే డిన్క్ అని పేరుపెట్టుకున్నారు.
ఎవరి వ్యక్తిగత నిర్ణయాలు వారివి. తమకు పిల్లలు ఉండాలా వద్దా అనే నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతం. కానీ భవిష్యత్ తరాల జ్యన్యుత్పత్తి జరగకపోతే దేశాభివృద్ధి, ఆర్థికాభివృద్ధిలపై ప్రభావం చూపించడమే కాకుండా భారతదేశానికి మాత్రమే సొంతమైన కుటుంబ వ్యవస్ధ, అద్వితీయ మనవ సంబంధాలపై కూడా నీలినీడలు కమ్ముకునే పరిస్ధితుల్లోకి వెళతాము. ఇదే ధోరణ కొనసాగితే రాబోయే సంవత్సరాల్లో భారత సమాజం పెద్ద కుదుపు లోనవడమే కాకుండా పెనుసవాళ్ళను తీసుకు వస్తుందనడంలో అతిశయోక్తి లేదు. వేల సంవత్సరాలుగా భారతదేశం నిర్మించుకున్న ఒక సంస్కృతి, సాంప్రదాయల మనుగడ ఈ డిన్క్ తో ప్రశ్నార్ధకంగా మారుతుంది. ఈ జీవన శైలి వల్ల రానున్న తరాల్లో యువత సంఖ్య గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా వృద్ధుల సంఖ్య ఎక్కువవుతుంది. ఇది భారతదేశ భవిష్యత్తుకు తట్టుకోలేనంత ముప్పును తెచ్చిపెడుతుంది.
ఇదే సమస్యను చైనా, జపాన్ దేశాలు ఎదుర్కొని దాన్ని బయటపడటానికి ఇప్పుడిప్పుడే ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ రెండు దేశాల్లో కూడా యువతీ, యువకుల శాతం తక్కువగా ఉండి వృద్ధుల శాతం విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల వృద్ధిలో ఆ రెండు దేశాలు తీవ్ర వడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. చైనాలో వన్ చైల్డ్ పాలసీ వల్ల ఏర్పడిన సాంస్కృతిక మార్పుల కారణంగా వృద్ధాప్య జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. చరమాంకంలో వృద్ధులను చూసుకోవడానికి చైనాలో యువత కొతర ఏర్పాడింది. అంతేకాకుండా శ్రామిక శక్తి తగ్గిపోయింది. కోట్ల మంది వృద్ధుల సంరక్షణ బాధ్యత అక్కడి ప్రభుత్వాలకు సవాలుగా మారింది. ఇదే సమస్య జపాన్ దేశాన్ని కూడా పట్టి పీడిస్తోంది. జపాన్ పూర్తిగా తాతా, అవ్వల దేశంగా మారిపోయింది. ఈ వృద్ధుల ఆరోగ్య సంరక్షణ, సామాజిక జీవనానికి మద్దతు అందించడం ఇబ్బందికరంగా పరిణమించింది. అగ్రరాజ్యాలుగా ఉన్న ఈ దేశాలు ఇప్పుడు యువతరం లేమితో బాధపడుతున్నాయి. దాదాపు మూడు, నాలుగు దశాబ్దాల పాటు పిల్లల జననాలపై అంక్షలు ఉండటంతో చైనాలో శ్రామిక శక్తి ఆవిరైపోయింది. కొత్త ఆవిష్కరణలు జరగకపోవడం, ఆర్థిక, భౌగోళిక, సామాజిక రాజకీయ ఆశయాలను ముందకు తీసుకువెళ్ళే యువత లేకపోవడంతో సూపర్ పవర్ కంట్రీగా ఎదగాల్సన చైనా రోజు రోజుకీ బలహీన పడుతోంది. జనాభా సమతుల్యతను కోల్పోతే దేశం ఏవిధంగా ఇబ్బందుల పాలవుతుందో చైనాని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఇప్పుడు చాలా మంది భారత యువత మొగ్గు చూపుతున్న డిన్క్ తరహా జీవనవిధానం మన దేశాన్ని కూడా చైనా, జపాన్ల సరసన నిలబెడుతుంది. మరో ఇరవై, ముప్పై ఏళ్ళ తరువాత భారత్ కూడా యువత లేమితో తల్లడిల్లిపోతుంది. నేడు తక్కువ మంది పిల్లల ఉత్పత్తి జరుగుతోందంట భవిష్యత్తులో ఎక్కువ మంది వృద్ధుల వృద్ధి జరుగుతుందనేది కాదనలేని సత్యం. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా వెలుగొందాలనే మన కలలకు ఈ డిన్క్ జీవన విధానం విఘాధం కలిగిస్తుందనడంలో సందేహంలేదు.