- ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు
- అవుతు కేసులో పోలీసులు అత్యుత్సాహం చూపారని వ్యాఖ్య
- రిమాండ్ విధించిన కింది కోర్టుని తప్పుపట్టిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్షర్లను అరెస్ట్ చేయడం పట్ల రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు నగరానికి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్షర్ అవుతు శ్రీధర్‌రెడ్డిని రిమాండ్‌ని గౌరవ హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఈ కేసులో పోలీసులు అత్యుత్సాహం చూపించారని హైకోర్టు వ్యాఖ్యానించింది. అసలు రిమాండ్ రిపోర్ట్ తప్పుల తడకగా ఉన్నప్పుడు జడ్జి దానిని తిరస్కరించకుండా రిటర్న్ చెయ్యడాన్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం తప్పుపట్టింది. అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పోలీసులు పెడుతున్న సెక్షన్ల విషయంలో కూడా కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. శ్రీధర్‌రెడ్డి విషయంలో బీఎన్‌ఎస్ 111, 196 సెక్షన్లు ఏవిధంగా నమోదు చేస్తారని పోలీసులను కోర్టు నిలదీసింది. వెంటనే అవుతు శ్రీధర్‌రెడ్డిని విడుదల చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తలు పెట్టిన ఒక పోస్టులో శ్రీధర్‌రెడ్డి కామెంట్ పెట్టినందుకు ఫిబ్రవరి 24వ తేదీ విజయవాడ సూర్యారవుపేట పోలీసులు అవుతు శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్ చేసి అదే కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే రిమాండ్ రిపోర్ట్‌లో అనేక అవకతవకలు ఉన్నాయని సదరు న్యాయమూర్తి దాన్ని రిటన్ చేశారు. దీంతో పోలీసులు అదే రోజు అర్ధరాత్రి 12 గంటలకు మరో రిమాండ్ రిపోర్ట్‌తో న్యాయమూర్తి నివాసానికి తీసుకువెళ్లి శ్రీధర్‌రెడ్డిని ప్రవేశపెట్టారు. జడ్జి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు.