వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయ సాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. వైఎస్ఆర్ సీపీ హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లలో రూ.3,600 కోట్ల విలువైన వాటాలను బలవంతంగా లాగేసుకున్నారన్న అభియోగాలపై సీఐడీ నోటీసులు ఇచ్చింది. కాకినాడ సీ పోర్ట్, సెజ్ యజమాని కర్నాటి వెంకటేశ్వర్రావు నుంచి విజయ సాయిరెడ్డి వాటాలను బలవంతంగా రాయించుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఈనెల 12వ తేదీన బుధవారం ఉదయం సీఐడీ విజయవాడ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలనిసీఐడీ ఆ నోటీసుల్లో పేర్కొంది.
రెండు రోజుల క్రితం సాయిరెడ్డి నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు.. విజయ సాయి అందుబాటులో లేకపోవటంతో, ఆయన సతీమణికి నోటీసులు అందజేశారు. ఈ కేసులో విజయసాయిరెడ్డి రెండో నిందితుడు కాగా, జగన్ బాబాయ్ వై.వి.సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి ఏ1గా ఉన్నారు. కేఎస్పీఎల్, కేసెజ్‌ల్లో వాటాలు లాగేసుకున్న వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించిన ఈడీ.. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపి కేసు నమోదు చేసింది. రెండు నెలల కిందట సాయిరెడ్డిని ఈడీ విచారించింది. ఇదే వ్యవహారంలో ఇప్పుడు సీఐడీ నోటీసులు ఇచ్చింది.