35.9 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

వర్మకు ప్రాధాన్యత దక్కకుండా పవన్‌ కల్యాణ్‌ కుట్ర?

  • బీజేపీకి కలిసొచ్చిన పవన్‌ కల్యాణ్‌ వైఖరి

  • పిఠాపురం వర్మకు ఎమ్మెల్సీ ఖాయమని సంకేతాలు

  • చివరి నిముషంలో మోకాలడ్డిన పవన్‌ కల్యాణ్‌!

  • పవన్‌ ఒత్తిడికి తలొగ్గిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం!

  • మరొకరికి ఇస్తే వివాదమవుతుందని బీజేపీకి వదిలేసిన టీడీపీ

  • చివరి నిముషం దాకా సోము వీర్రాజుకు లేని సమాచారం

  • ఉదయం బీజేపీ అధిష్టానం నుంచి ఫోన్‌ కాల్‌

  • అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకొని విజయవాడ బయలుదేరిన సోము వీర్రాజు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం టీడీపీ సీనియర్‌ నేత వర్మకు కంట్లో నలుసులా మారారా? వర్మకు ప్రాధాన్యత దక్కకుండా పవన్‌ కల్యాణ్‌ అడ్డుకుంటున్నారా? తన కోసం సీటును త్యాగం చేసి.. స్వయంగా శ్రేణులను ఒప్పించి గెలిపించిన ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మకు.. ఇప్పుడు పవన్ కల్యాణే ప్రాధాన్యత తగ్గించేలా ప్రవర్తిస్తున్నారా? పిఠాపురంలో ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మకు ప్రాధాన్యత పెరిగితే.. తనకు ఇబ్బంది అవుతుందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కుట్రలు చేస్తున్నారా? ఈ పరిణామమే భారతీయ జనతా పార్టీకి కలిసొచ్చిందా? పై ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానాలే వస్తున్నాయి.

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యాయి. అసెంబ్లీలో ఉన్న బలాబలాలు, పొత్తు ధర్మాలు చూసుకున్నా.. ఒక సీటు జనసేనకు, నాలుగు ఎమ్మెల్సీ సీట్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలని మొదటినుంచీ భావించారు. అయితే, ఈ జాబితాలో ముందువరుసలో ఉన్న పేరు ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ. ఆయన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే. పిఠాపురంలో తనకు ఎదురులేని పరిస్థితులను పవన్‌ కల్యాణ్‌ వైపు మళ్లించి.. స్వయంగా ప్రచారం చేసి పవన్‌ కల్యాణ్‌ను గెలిపించిన నాయకుడు. దీంతో, పవన్‌ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే.. న్యాయం చేసినట్లవుతుందని టీడీపీ అధిష్టానం భావించింది. అయితే, ఎట్టి పరిస్థితుల్లో వర్మకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వొద్దంటూ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. స్వయంగా చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చి వర్మకు జాబితాలో పేరు లేకుండా చూశారన్న టాక్‌ నడుస్తోంది.

ఈ పరిణామం బీజేపీకి కలిసొచ్చింది. అసలు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ ఆశించలేదని చెబుతున్నారు. త్వరలో ఏపీ నుంచి భర్తీ కావాల్సిన రాజ్యసభ సీటును బీజేపీ ఆశిస్తున్నట్లు భోగట్టా. అయితే, పవన్‌ కల్యాణ్ ఒత్తిడి కారణంగా తెలుగుదేశం పార్టీ ఆలోచనలో పడింది. ఆ స్థానంలో సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా వర్మకు కాకుండా.. మరో ఓసీ అభ్యర్థికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే.. తీవ్ర వివాదమయ్యే పరిస్థితి ఉంది. అందుకే బీజేపీకి అడగకున్నా ఎమ్మెల్సీ సీటును ఇచ్చేశారు చంద్రబాబు. ఆదివారం రాత్రి పొద్దుపోయే దాకా ఈ నిర్ణయం బాహాటం కాకపోవడంతో.. బీజేపీ అధిష్టానం ఆ సీటును ఎవరికి ఇవ్వాలన్న విషయంలో రాత్రంతా తర్జన భర్జనలు పడింది. అందుకే సోము వీర్రాజును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు ఇవాళ ఉదయానికి గానీ బీజేపీ అధిష్టానం నుంచి ఉత్తర్వులు వెలువడలేదు. ఈ పరిస్థితి ఊహించని సోము వీర్రాజు.. నామినేషన్‌ దాఖలు చేయ డానికి అవసరమైన ఏర్పాట్లు ఏవీ చేసుకోలేదు. అధిష్టానం నుంచి కాల్ వచ్చిన తర్వాత ఇవాళ ఉదయం హుటాహుటిన విజయవాడ బయలు దేరి వెళ్లారు.

ఇక, ఎస్‌వీఎన్‌ఎస్‌ వర్మ విషయానికి వస్తే.. తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. ఎన్నికలకు ముందు.. బీజేపీతో టీడీపీ పొత్తు విషయంలో కీలకంగా వ్యవహరించారు. ఈ కారణంగా వపన్‌ కల్యాణ్‌ ఏస్థానం నుంచి పోటీ చేస్తారన్నది ఆయన నిర్ణయానికే వదిలిపెట్టారు. దీంతో, పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంలో పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించారు. దీంతో, పిఠాపురం టీడీపీ శ్రేణుల్లో తొలుత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఉద్రిక్తతలు తలెత్తాయి. వర్మ ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని, పవన్‌ కల్యాణ్‌ను ఓడిస్తామని టీడీపీ వర్గాలు శపథం చేశాయి. అయితే, ఈ పరిస్థితులను వర్మనే స్వయంగా అదుపులోకి తెచ్చారు. పార్టీ శ్రేణులను శాంతింపజేశారు. పొత్తు ధర్మంలో భాగంగా పవన్‌ కల్యాణ్‌ను దగ్గరుండి మనం గెలిపించాలని అందరినీ ఒప్పించారు. దీంతో, పవన్‌ కల్యాణ్‌ గెలుపు నల్లేరు మీద నడక మాదిరిగా నడిచివచ్చింది.

అయితే, ఇప్పుడు మరోసారి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం విషయంలో వర్మకు అన్యాయం జరిగింది. ఈ పరిస్థితులను కూడా పిఠాపురం టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేదు. ఉదయం నుంచి ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. కానీ, ఇప్పుడు కూడా వర్మనే జోక్యం చేసుకొని పార్టీ శ్రేణులను శాంతింప జేశారు. స్వయంగా ప్రకటన చేశారు. 23 యేళ్లుగా తాను చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటున్నానని, పార్టీ అవసరాలు, కూటమి అవకాశాలు, పొత్తు ధర్మాల కారణంగా పార్టీ కొన్ని సార్లు న్యాయం చేయలేక పోవచ్చునని, చంద్రబాబు, లోకేష్‌ ఆదేశాలు తనకు శిరోధార్యమని వర్మ ప్రకటించారు. ఎవరూ ఆవేశ పడవద్దని.. పిఠాపురంలో పార్టీ శ్రేణులకు సేవ చేస్తున్నానని, ఆ అవకాశం కూడా తనకు గొప్పే అని అభివర్ణించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com