ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రస్తుతం టీమిండియా అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతుంది. ఇందులో తన వంతుగా కీలక పాత్ర పోషిస్తున్నాడు మహ్మద్ షమీ. ఆస్ట్రేలియాపై 10 ఓవర్లు వేసిన ఈ బౌలర్.. మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం టీమిండియాలో ఇద్దరు స్పెషలిస్ట్ బౌలర్లు లేరు.. వారి లేని లోటును తీరుస్తున్నాడు షమీ. అలాంటి షమీని టార్గెట్ చేశారు కొందరు. అది కూడా రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం లేదని. అది కూడా సాధారణమైన వ్యక్తి ఏమీ కాదు. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షమబుద్దీన్ రజ్వీ బరేల్వీ ఇప్పుడు షమీపై విమర్శలు చేశారు. రంజాన్ మాసంలో అతను ఉపవాసం ఎందుకు ఉండటం లేదని ప్రశ్నించారు. ఆయనను అల్లాహ్ శిక్షిస్తాడని కూడా చెబుతున్నారు రజ్వీ.
సెమీస్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో డ్రింక్ తాగుతూ కనిపించాడు షమీ. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక కొందరు షమీని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడం ప్రారంభించారు. ఇది ద్రోహం కిందకే వస్తుందని కొందరు విమర్శించారు. ఇదే సమయంలో రజ్వీ కూడా స్పందించారు. ముస్లింలంతా తప్పనిసరిగా రంజాన్ మాసంలో ఉపవాసం ఉండాలని.. అలా ఉండని వారు నేరస్థులు అవుతారని ఆయన చెబుతున్నారు. షమీ అందరికి తప్పుడు సందేశాన్ని పంపుతున్నారని.. ఇది నేరమే అని.. షరియా ప్రకారం అతడు నేరస్థుడన్నారు. అంతేకాదు షమీ దేవుడికి సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు రజ్వీ.
రజ్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. అతను దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడని.. ఇందులోకి మతాన్ని ఎందుకు చొప్పిస్తున్నారని కొందరు.. అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ఆడేందుకు ఎనర్జీ అవసరమని.. అతను బౌలర్ కాబట్టి మరింత అవసరమని.. ఇందులో ఒకరోజు ఉపవాసాన్ని కొనసాగించకపోతే సమస్య ఏంటని మరికొందరు.. దేశం తర్వాతే మతమని మరికొందరు.. ఇలా అనేక రకాలుగా షమీకి మద్దతిచ్చే వారి సంఖ్య పెరిగిపోయింది. మరోవైపు షమీ పాపం చేశారని.. దీనికి తగిన శిక్ష అనుభవిస్తారంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం షమీ వ్యవహారంపై రెండు వర్గాలుగా చీలిపోయి కామెంట్ల వర్షం కురిపించుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఏదేమైనా చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తున్నారనేది మాత్రం అసలైన వాస్తవం.