- అతిపెద్ద వార్త బ్లాస్ట్ చేస్తానంటూ ప్రకటన
- సోషల్ మీడియా సేన్సేషన్ గా డోనాల్డ్ ట్రంప్
- వచ్చీ రాగానే DOGE సలహాల అమలు
- వేలాది ఉద్యోగాల ఊస్టింగ్
- దిగుమతి టారిఫ్ లను పెంచేస్తూ నిర్ణయాలు
- రష్యాతో చేరి, ఉక్రెయిన్ పై మాటల తూటాలు
- అమెరికాలో భారీగా పెరగనున్న ధరలు
- ఇప్పటికే అప్పులకుప్పగా అమెరికా
- కాంగ్రెస్ లో ఏం చెప్తారన్నదే అందరి ఉత్కంఠ
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్మీడియా సంచలనంగా మారారు. మంగళవారం రాత్రి ఒక అతిపెద్ద వార్త ను బ్లాస్ట్ చేయబోతున్నట్లు తన పోటస్ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. కాంగ్రెస్ సభ్యులంతా వేచి చూడాలని అందులో కోరారు. ఎన్నికలయ్యాక ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్ నుద్దేశించి చేయనున్న తొలిప్రసంగం ఇదే అవుతుంది. సోషల్ మీడియాను విపరీతంగా వాడే ట్రంప్ ప్రకటనపై ఆయన మద్దతు దారులు ఆనందంతో, ఉత్కంఠతో ఎదురుచూస్తుండగా.. డెమోక్రాట్లు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఇంత అడ్డగోలు పాలన ఎప్పుడూ చూడలేదని అద్భుతాలు ఏమీ జరగవనీ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే తనతో కలసి రాని దేశాలపై ఆయన టారిఫ్ ల బాదుడు బాది కసి తీర్చుకుంటున్నారు. మెక్సికో, కెనడా, దేశాలనుంచి అక్రమ వలసలు, హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్ సరఫరా ఎక్కువగా ఉన్న నేపపధ్యంలో ఆ దేశాలను ఓ ఉతుకు ఉతికేశారు.
అమెరికాకు పరిగెత్తిన గోయల్
మరోవైపు అమెరికా సుంకాల బాదుడుతో మన ఇండియన్ మార్కెట్లు కుప్పకూలాయి. వరుసగా గత రెండు వారాలుగా స్టాక్ మార్కెట్ దారుణంగా పడిపోవడం,అనేక షేర్లు కుప్పకూలడంతో మన వాణిజ్యశాఖ అప్రమత్తమైంది. వాణిజ్యమంత్రి పియూష్ గోయల్ తన పర్యటనలన్నీ రద్దు చేసుకుని సంప్రదింపులకోసం హుటాహుటిన అమెరికాకు వెళ్లారు.దాదాపు వారం రోజుల పాటు అక్కడే ఉండి ట్రంప్బృందాన్ని కలసి సుంకాల ప్రభావం మనదేశంపై పడకుండా జాగ్రత్త పడేలా మంతనాలకు ప్రయత్నిస్తున్నారు.ఒక భారత విదేశాంగ మంత్రి అధికారిక పర్యటన కాకుండా హటాత్తుగా వారం రోజులు అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాల్సిరావడం అంటే కొంచెం పెద్ద వ్యవహారమే.మరి ట్రంప్ ఏమేరకు కరుణిస్తారో చూడాలి. మోడీ అధిరిక పర్యటనలో అక్కడ ఉండగానే టారిఫ్ లమీద నిర్మొహమాటంగా మాట్లాడిన ట్రంప్ ఏ మేరకు కరుణిస్తారో చూడాలి.మరోవైపు కెనడా, మెక్సి్కో,చైనాల మీద 20 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు.
దూసుకుపోతున్న ట్రంప్
రెండోసారి అధికారం చేపట్టిన నాటినుంచి ట్రంప్ తన అజెండా అమలు స్పీడప్ చేశారు. DOGE అడ్వైజర్ గా బిలియనీర్ ఎలన్ మస్క్ ని నియమించుకున్న ఆయన సలహాల మేరకు ఉద్యోగులను తొలగిస్తున్నారు.ప్రభుత్వ శాఖల్లో అందరికీ శ్రీముఖాలు పంపేశారు. వీఆర్ ఎస్ తీసుకోవాల్సిందని, అందే మొత్తంతో ఏదైనా వ్యాపారం లేదా మరో చోట ఉద్యోగాలు వెతుక్కోవాలని సూచించారు. ఇది ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. ఇప్పటికే బర్త్ రైట్ సిటిజన్ షిప్ ను రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలిచ్చిన ట్రంప్ గ్రీన్ కార్డు, వీసాల మంజూరీని కఠినతరం చేశారు. రాజ్యాంగం సవరిస్తే తప్ప అమలు చేయలేని ఈ నిర్ణయాలు చెల్లవని మరో వైపు వాదనలు సాగుతున్నా ఆయన దారిలో ఆయన దూసుకు పోతున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఇప్పటికే అమెరికా అప్పుల కుప్పగా మారింది.
ప్రపంచ పటంలో అమెరికా ఆధిపత్యాన్ని, డాలర్ కరెన్సీని నిలబెడతానని అన్న ట్రంప్ కలసి రాని దేశాలపై ప్రతిచర్యలు మొదలుపెట్టారు. రష్యాతో ఖనిజ ఒప్పందాల తవ్వకంపై సంతకం చేసుకొచ్చి ఉక్రెయిన్ను బెదిరించడం మొదలు పెట్టారు. యుద్ధం అంతం కావాలంటే ఉక్రెయిన్ తాము చెప్పినట్లు చేయాలని బహిరంగ ప్రెస్ కాన్ఫరెన్సులోనే జెలన్ స్కీపై విరుచుకుపడ్డారు.ఉక్రెయిన్ లో అపారంగాఉన్న విలువైన ఖనిజ నిల్వలు తాము తవ్వుకునేలా అనుమతించాలని ఒక ఒప్పందం పత్రం సిద్ధం చేశారు. దాంతో జెలన్ స్కీ ఒప్పందంపై సంతకం చేయకుండానే వెనుదిరిగారు. ఆ వెంటనే ఉక్రెయిన్ కు మిలటరీ ఎయిడ్ ఆపేశారు. దాంతో జెలన్ స్కీ దారికొచ్చి అమెరికా ప్రాధాన్యతను అర్ధంచేసుకున్నామంటూ, ఖనిజ ఒప్పందాల తవ్వకంపై సంతకాలకు సిద్దమని ప్రకటించారు.
మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆచి తూచి నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ రెండోసారి వచ్చీ రాగానే కీలక నిర్ణయాలు తీసేసుకుని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల శరపరంపర వదులుతున్నారు. రెండేళ్లలో రానున్న మధ్యంతర ఎన్నికల నాటికి తన పాలనపై వ్యతిరేకతను తగ్గించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.క్రిప్టో కరెన్సీనిల్వలు అపారంగా పెంచుతున్నారు. బహుశా అమెరికన్ కాంగ్రెస్ నుద్దేశించి చేసే ప్రసంగంలో మరిన్ని నిర్ణయాలను ప్రకటిస్తూ వాటి ప్రాధాన్యతను, తన నిర్ణయాలపై వివరణ ఇచ్చే అవకాశముంది.