తెలంగాణలో కారు కదులుతుందా? రోడ్డెక్కుతుందా? పూర్వ వైభవం వస్తుందా? టాప్ గేర్‌తో రహదారిపై దూసుకెళ్తుందా? ఇప్పుడీ ప్రశ్నలు, సెటైర్లు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అంటే పార్టీ గుర్తుతో పిలుచుకుంటున్నా.. బీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితిపై ఒకరకంగా నైరాశ్యం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అసలు బయటకు వస్తారా? వచ్చే ఉద్దేశ్యం ఉందా? లేదంటే ప్రకటనలు, వాయిదాలతోనే కాలం వెల్లదీస్తారా? అన్న సందిగ్ధం ఆ పార్టీ నేతలను, కార్యకర్తలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
అసలు కేసీఆర్ వైఖరిలో ఇప్పటికైనా మార్పు కనిపించక పోతే కష్టమంటున్నారు సొంత పార్టీ నేతలు. అంతేకాదు.. మరోసారి అధికారంలోకి రావడం కూడా అనుమానమే అంటున్నారు. ఇప్పటిదాకా కేసీఆర్ ఫామ్ హౌజ్‌కే పరిమితమవుతున్నారు. ఫలితంగా పార్టీ శ్రేణులంతా నైరాశ్యంలోనే ఉంచుతున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాది దాటింది. అయినప్పటికీ ఇంకా ప్రజా సమస్యలపై పోరాటానికి సన్నద్ధం కాకపోవడంతో కేసీఆర్ తీరుపై క్యాడర్‌లో విమర్శలు వస్తున్నాయి. ఏడాది కాలంగా దాదాపు కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు, ఎన్నికలప్పుడు మినహా ఆయన జనంలోకి రాలేదు.
రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పడు.. కేసీఆర్ చేసిన తప్పిదాలే పార్టీకి శాపంగా పరిణమించాయని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. పార్టీ నాయకులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నా.. ఆయన మాత్రం జనంలోకి రావడానికి ఇష్టపడటం లేదు. కేసీఆర్ గత ఎన్నికల్లో ఓటమిని ఊహించలేదు. కేసీర్ ఏం చెప్పినా, ప్రచారం చేసినా జనం ఆయనను నమ్మలేదు. కేవలం సంక్షేమ పథకాలను చూసి మాత్రమే ఓట్లు వేయబోరన్న విషయం ఎన్నికల అనంతరం తెలిసి వచ్చింది. ఆయన వ్యవహార శైలి కూడా ఓటమికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా బయటకు రాకపోవడంతో పాటు వారిని కలిసేందుకు ఇష్టపడక పోవడంతో జనం తమ ఓటుతో తీర్పు చెప్పారు. అయినా.. నేటికీ ఆయనలో మార్పు రావడం లేదంటున్నారు పార్టీ శ్రేణులు. జనంలో ఉండి వారి సమస్యలను వింటేనే దగ్గరవుతారని, యేడాది కాలం పాటు ఫామ్‌హౌజ్‌కే పరిమితమైనా ఏదో కారణం చెప్పుకోవచ్చని, కానీ, యేడాది గడిచిన తర్వాత కూడా ఫామ్ హౌజ్‌ను వీడి బయటకు రాకపోవడం, ప్రజా సమస్యలపై స్పందించక పోవడంపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. అదిగో వస్తారు.. ఇదిగో వస్తారంటూ.. అప్పుడప్పుడూ మీడియాకు లీకులు ఇవ్వడం తప్పితే.. కేసీఆర్ మాత్రం ఫామ్ హౌజ్ నుంచి బయటకు తొంగి చూడటం లేదు. అంతేకాదు.. అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చేసిన కుటుంబ సభ్యులే ఇప్పుడు కూడా పార్టీలో కీలకంగా మారడం కూడా కొన్ని సామాజికవర్గాల వారికి మింగుడు పడటం లేదు. ఇప్పటికైనా కేసీఆర్ తన వైఖరిని మార్చుకుని పార్టీలో కొంత మార్పులు తెచ్చి, తాను మారితే తప్ప గెలుపు గురించి ఆలోచించకూడదని గులాబీ పార్టీ నేతలు డిసైడ్ అయినట్లే కనిపిస్తోంది.