గత ప్రభుత్వంలో కొందరు ఐటి కంపెనీల్లో కూడా వాటాలు అడగడంతో వారు రాష్ట్రం విడిచి వెళ్లిపోయారని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖలో ఐటి పరిశ్రమ అభివృద్ధిపై శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, ఈశ్వరరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ… ప్రపంచవ్యాప్తంగా ఐటిరంగంలో 20శాతం మంది తెలుగువారు ఉండటం హర్షణీయం. 2014-19 నడుమ రాష్ట్రానికి దాదాపు 150 కంపెనీలు రావడంతో 50వేలమందికి ఉపాధి లభించింది. డాటా సెంటర్ ను రప్పించేందుకు అప్పట్లో అదానీతో ఒప్పందం చేసుకున్నాం. విశాఖలో ఐటి రంగం ప్రముఖులతో కాంక్లేవ్ పెట్టాం. ఐటి రంగంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న తరుణంలో గత ప్రభుత్వం చర్యలతో బ్రేక్ పడింది.
గతప్రభుత్వంలో ఒక మంత్రి కోడిగుడ్డు కథలతో రాష్ట్రాన్ని నవ్వుల పాల్జేశారు. ఇదివరకెన్నడూ లేనివిధంగా ఐటి కంపెనీల్లో వాటాలడిగారు. నాటి ప్రభుత్వ అనాలోచిత చర్యలతో నిక్సీ, ఎస్ టిబిఐ వెళ్లిపోయాయి. త్వరలో విశాఖకు టిసిఎస్ రాబోతోంది. మూడునెలల్లో టిసిఎస్ విశాఖలో టిసిఎస్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. దీంతోపాటు విశాఖలో క్యాంపస్ ఏర్పాటుకు కూడా వారు ఒప్పకున్నారు. ఇన్ఫోసిస్ సంస్థను కూడా క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరా. ఇందుకు అవసరమైన భూముల కోసం వెదుకుతున్నాం. ఐటి పరిశ్రమలు రావడానికి అవసరమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఐటి రంగంలో రాబోయే 5ఏళ్లలో 5లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నాం.
డాటారంగంలో పెట్టుబడులపై దృష్టి
ఇటీవల తాను యుఎస్ పర్యటనకు వెళ్లి పలువురు డాటా సెంటర్ల అధినేతలతో మాట్లాడాను. 2019-24 నడుమ డాటా సెంటర్లపై ఎటువంటి ఫోకస్ పెట్టలేదు. దాంతో ఆయా సంస్థలు ముంబయ్, తమిళనాడు, తెలంగాణకు వెళ్లిపోయాయి. సరైన పాలసీతో ముందుకు వెళ్లుంటే విశాఖ డాటా సెంటర్ క్యాపిటల్ అయ్యేది. ఈ రంగంలో ప్రతిఏటా 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయి, అందులో వంద బిలియన్ డాలర్లు ఎపికి తేవాలన్నది నా లక్ష్యం.
సోషల్ ఎకో సిస్టమ్ ఏర్పాటులో భాగంగా భారత్ లోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ త్వరలో విశాఖకు రాబోతోంది. దీంతోపాటు వేలాదిగా హోటల్స్ కూడా రావాల్సి ఉంది. ఇటీవలే టూరిజంను ఇండస్ట్రీగా గుర్తించే పాలసీ తెచ్చాం. విశాఖలో గ్రేడ్ ఎ ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి తేవాల్సి ఉంది. ఇందుకోసం రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తో కూడా చర్చిస్తున్నాం. డేటా సెంటర్ పాలసీ – అవుట్ రీచ్ – సోషల్ ఎకో సిస్టమ్ కోసం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నాం.