దక్షిణ భారత దేశంలో రాజకీయాలు, సినిమాలు కలిసిపోయి దశాబ్దాలు దాటిపోయాయి. సినిమాల నుండి వచ్చిన ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత, పవన్ కళ్యాణ్ వంటి వారు ఉన్నత పదవులు అధిరోహించారు. ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులైన వాళ్ళు అయితే చాలామందే ఉన్నారు. జనాల్లో సినిమా వాళ్ళకు ఉండే క్రేజ్ వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ రాజకీయంగా తమకు ఉపయోగపడుతుందని పార్టీలు.. సినీ రంగంతో వీలైనంత దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తాయి. కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీల నుండి ప్రాంతీయ పార్టీల వరకు ఎవరూ దీనికి అతీతులు కాదు. అయితే, ఈ విషయంలో వైసీపీ పూర్తిగా వెనక బడిందనే చెప్పాలి.
వైసీపీ మద్దతుదారుడుగా ఉన్న పోసాని కృష్ణ మురళి అరెస్టు అయితే.. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా టాలీవుడ్ నుంచి స్పందించలేదు. నిన్న మొన్నటి వరకు అధికారంలో పార్టీకి ఇలాంటి పరిస్థితి నెలకొనడం వెనక స్వయంకృతాపరాధాలే ఎక్కువ ఉన్నాయనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ కోణంలో వైసీపీ ఒంటరి అయిపోయిందన్న వాదన బలపడుతోంది. స్వయంగా సినిమా రంగం నుండి వచ్చిన ఎన్టీఆరే పెట్టిన పార్టీ కావడం, టాలీవుడ్‌తో మొదటినుంచీ మంచి సంబంధాలు మెయింటైన్ చేయడం టీడీపీకి కలిసివచ్చే బలాలుగా చెబుతున్నారు. సామాజిక వర్గం పరంగా, అప్రోచ్ పరంగా టాలీవుడ్లో టీడీపీకి సానుభూతిపరులు చాలామంది ఉన్నారు. ఎంతలా అంటే 2019 ఎన్నికల తర్వాత పూర్తిగా కుదలైపోయింది టీడీపీ అనే ప్రచారం జరుగుతున్న సమయంలోనూ కొంతమంది టాలీవుడ్ పెద్దలు, స్టార్లు తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నారు. అశ్విని దత్, మురళీమోహన్ లాంటి బడా ప్రొడ్యూసర్లు స్వయంగా టీడీపీ సభ్యులు. రాఘవేంద్రరావు, బోయపాటి లాంటి వాళ్ళు అయితే టీడీపీ కోసం పని చేసిన చరిత్ర కలిగిన వాళ్లు. జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు చాలామంది ఆయనకు మద్దతుగా మాట్లాడిన వాళ్లే ఉన్నారు. ఎన్టీఆర్ తనయుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. టాలీవుడ్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న మెగా ఫ్యామిలీ నుండి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. చిరంజీవి మొదలుకొని మొత్తం మెగా ఫ్యామిలీలో హీరోలు అందరూ ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కు నైతిక మద్దతు ఇస్తున్నారు. పవన్ పిలిస్తే జనసేన వైపు రావడానికి టాలీవుడ్లో కొంతమంది రెడీగా ఉన్నట్టు ఇంటర్వ్యూలో చెబుతూ ఉంటారు. టాలీవుడ్ నిర్మాత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ప్రస్తుతం జనసేనలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. అల్లు అర్జున్‌తో ఫ్యామిలీకి విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్నప్పటికీ బహిరంగంగా రెండు కుటుంబాల హీరోలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సంఘటనలు ఎప్పుడు ఎదురు కాలేదు.
రాజీవ్ గాంధీ రిక్వెస్ట్‌తో రాజకీయాల్లోకి వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి బలమైన సపోర్టుగా నిలిచారు. ఇప్పటికీ పాతకాలం ఆర్టిస్టుల్లో కాంగ్రెస్ సానుభూతిపరులు ఉన్నారు. వైయస్సార్ బతికున్నప్పుడు జయసుధ.. ప్రజారాజ్యం పార్టీ విలీనమైన తర్వాత చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే కొంతకాలం కొనసాగారు. బీజేపీలోనూ సినిమా స్టార్లు బాగానే ఉన్నారు. అయితే, ఈ సంఖ్య ఉత్తర భారతదేశంలో ఎక్కువ. తెలుగు రాజకీయాల్లోనూ గతంలో కోట శ్రీనివాసరావు లాంటివాళ్లు బీజేపీ తరఫున ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధీశ్వరి సైతం సినీ కుటుంబం నుంచి వచ్చినవారే. డైరెక్ట్‌గా బీజేపీలో చేరకపోయినా సైద్ధాంతిక పరంగా ఆ పార్టీకి మద్దతు ఇచ్చే సినీ ప్రముఖులు సినీ రంగంలో బాగానే ఉన్నారు.
మొదటినుంచీ వైసీపీ సినీ ప్రముఖులను ఆకట్టుకోవడంలో విఫలం అవుతూనే వచ్చింది. రాజశేఖర్, జీవిత లాంటి వాళ్ళు మొదట్లో వైసీపీలో చేరినా చాలా తొందరగానే బయటికి వచ్చేసారు. అక్కడి వ్యవహారాలు తమకు సూట్ కావని బహిరంగంగానే ప్రకటనలు చేశారు. 2019 ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన మంచు మోహన్ బాబు కూడా కొద్ది కాలానికి దూరం అయిపోయారు. ఇక, సినిమా ఇండస్ట్రీపై జగన్ ప్రభుత్వం అధికారం చెలాయించాలని చూసిందనే విమర్శలు టాలీవుడ్ నుంచి వినబడతాయి. చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు లాంటి టాప్ స్టార్లను తన ఇంటి ముందు నడిపించి అవమానించారని ఒక వర్గం ఆరోపిస్తూ ఉంటుంది.
సినీ నటుడు పృథ్వికి ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చినా ఆయన ఆరోపణలు ఎదుర్కొని బయటకు వచ్చేసారు. తనపై వైసీపీలో కుట్ర జరిగిందనేది ఆయన వెర్షన్. ప్రస్తుతం జనసేనలో ఆయన కొనసాగుతున్నారు. ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఆలీ.. 2024 ఫలితాల తర్వాత జగన్‌కి బై బై చెప్పేశారు. పార్టీలో చేరకపోయినా మద్దతు దారుడుగా కొనసాగిన పోసాని కృష్ణ మురళి కూడా ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్టు ఎన్నికల తర్వాత ప్రకటించారు. అప్పట్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లొకేష్‌లపై తీవ్రమైన పదజాలంతో పోసాని చేసిన ఆరోపణలు.. ఇప్పుడు ఆయన అరెస్టుకు దారి తీశాయి. కానీ, విచిత్రంగా టాలీవుడ్ నుంచి ఆయనకు మద్దతుగా ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడింది లేదు. పోసాని మాట ఎలా ఉన్నా.. అసలు వైసీపీ పార్టీనే టాలీవుడ్ నుంచి మద్దతు కోల్పోయిందనేది విశ్లేషకులు చెబుతున్న మాట. జగన్ ఫోటోతోనే ఎన్నికల్లో గెలుస్తాం తప్ప వేరే ఎట్రాక్షన్, స్టార్ పవర్ అవసరం లేదంటూ గతంలో వైసీపీ కీలక నేతలు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని టాలీవుడ్‌కు దూరం చేశాయని సినీ రంగ ప్రముఖులు చెబుతూ ఉంటారు. ప్రస్తుతం యాంకర్ శ్యామల లాంటి ఒకరిద్దరు మాత్రం వైసీపీతో ఉన్నా ముందు వరుసలో ఉండే స్టార్లెవరూ వైసీపీలో లేరు. నందమూరి, మెగా ఫ్యామిలీలకు సొంత పార్టీలు ఉన్నాయనుకున్నా ప్రభాస్, మహేష్ బాబు లాంటి టాప్ స్టార్లైతే రాజకీయాల వాసనే దగ్గరకు రానివ్వరు. స్టార్ల విషయం పక్కన పెట్టి ఇతర ప్రముఖులు వైసీపీ వైపు రావడానికి.. అక్కడ ఉన్న పరిస్థితులు అడ్డుపడుతున్నాయన్నది అంతర్గత సమాచారం. సినిమా వాళ్ళతో కలిసి ముందుకు వెళ్లడానికి అనువుగా ఉండాల్సిన సమన్వయం వైసీపీలో లేదనేది ఎక్కువగా వినబడుతున్న మాట. మరి.. వైసీపీ పెద్దలు ఈ విషయాన్ని పట్టించుకుంటారో, లేదో చూడాలి.