27 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

పథకాల్లో కోతలు – లబ్ది దారులకు వాతలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్టహాసంగా సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రకటించింది. వాటిలో రెండు పథకాలకు మాత్రమే బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. అది కూడా ఆ రెండు పథకాలు అమలు చేయడానికి అవసరమైనన్ని నిధులు కేటాయించలేదు. సగానికి సగం నిధుల్లో కోత విధించింది. దీంతో, అసలు ప్రకటించిన రెండు పథకాలనైనా సరిగా అమలు చేస్తారా? లేదా? అన్న సందేహం మొదలయ్యింది.

కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాల్లో అన్నదాతా సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. అయితే ఈ పథకాలకు సంబంధించి నిధులు సరిపోతాయా? లేవా? అన్నదానిపై ఇప్పుడు సీరియస్‌గా చర్చ జరుగుతోంది. ఈ యేడాది రెండు సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని ప్రకటించడంతో బడ్జెట్‌లో ఎంత మేరకు నిధులు కేటాయిస్తారన్న దానిపై నిన్నటిదాకా సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, ఆ రెండు పథకాలకు కూడా అరకొరగా నిధులు కేటాయించారని, ఇది దేనికి సంకేతమని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

అన్నదాత సుఖీభవ పథకానికి బడ్జెట్‌లో రూ.6,300 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. ఈ పథకం అమలు చేయాలంటే దాదాపు రూ.10వేల కోట్లు అవసరం కాగా, రూ.6,300 కోట్ల రూపాయలను కేటాయించడం చర్చనీయాంశమైంది. ఇక ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తామనేది బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల కేశవ్ చెప్పలేదు. ఈ ఏడాది మాత్రం అమలు చేస్తామని చెప్పారు. అంటే వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేస్తారని భావించాలి. కేంద్ర ప్రభుత్వం జూన్ లేదా జులై నెలలో విడుదల చేసే పీఎం కిసాన్ పథకం నిధులతో పాటు అన్నదాత సుఖీ భవ పథకాన్ని కూడా అమలు చేసే అవకాశాలున్నాయి. రైతులు ఇందుకోసం మరో మూడు నెలలు ఎదురు చూడాల్సి ఉంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఇక, తల్లికి వందనం పథకం కూడా ఈ ఏడాది ప్రభుత్వం అమలు చేయనుంది. మే నెల నుంచి అమలు చేస్తామని స్పష్టంగా బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. అయితే, ఈ పథకం కింద రూ.9,407 కోట్ల రూపాయల నిధులను మాత్రమే కేటాయించారు. దాదాపు రూ.13వేల కోట్ల నుంచి రూ.14వేల కోట్ల దాకా ఈ పథకం అమలు చేయడానికి అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. చదువుకునే ప్రతి విద్యార్థికి యేడాదికి రూ.15వేలు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇంత తక్కువ స్థాయిలో నిధులు కేటాయించడం పై పలు అనుమానాలు కలుగుతున్నాయని విపక్ష నేతలు అంటున్నారు.

ఈ రెండు పథకాలను ప్రస్తుతం బడ్జెట్‌లో కేటాయించిన నిధులతో అమలు చేయాలంటే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందేమో అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా లబ్దిదారుల ఎంపికలోనే జల్లెడ పట్టే అవకాశముందంటున్నారు. స్పష్టమైన అర్హతలతో పాటు దారిద్ర్య రేఖకు దిగువన ఉండటమే కాకుండా.. విద్యార్థుల హజరును కూడా తల్లికి వందనం పథకం అమలు చేసేందుకు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే, అన్నదాత సుఖీభవ పథకం కింద కూడా పీఎం కిసాన్ పథకం పొందే రైతులకు మాత్రమే చెల్లించే అవకాశలున్నాయి. ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే జమ చేస్తామని కూటమి సర్కారు చెబుతుంది కాబట్టి.. ఆ రకమైన నిర్ణయం తీసుకునే అవకాశముందని చెబుతున్నారు.

వచ్చే ఏడాది పాఠశాలలు ప్రారంభం కాగానే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద తల్లి ఖాతాలోనే నిధులను జమ చేసేవారు. అయితే, చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఇంట్లో ఎంత మంది విద్యార్థులున్నా వారికి ఈ పథకం వస్తుందని కూడా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం పాఠశాలలు జూన్ నెల నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఉండాలంటున్నారు. ప్రత్యేకంగా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారికే ఈ పథకం వర్తింప చేయనున్నారు. అంటే.. తెలుపు రంగు రేషన్ కార్డు తప్పనిసరి. హాజరు శాతం కూడా 75 శాతం పైగా ఉంటేనే నిధులు విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా ఈ పథకం వర్తించదని తెలుస్తోంది.

అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల కు పెట్టుబడి సాయం కింద యేడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించారు. మేనిఫేస్టోలో కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. మూడు విడతలుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరువేల రూపాయల నిధులకు మరో పధ్నాలుగు వేల రూపాయలు జత చేసి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా విడతకు రెండు వేల రూపాయల చొప్పున అందచేస్తుంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకం కింద విడతకు నాలుగు వేల రూపాయలు జత చేసి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com