మార్చి 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు తిరుమలలోని శ్రీవారి ఆలయ పుష్కరిణిలో నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలపై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తెప్పోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ముందు జాగ్రత్తగా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
కాగా తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 09వ తేదీన శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండవ రోజు మార్చి 10వ తేదీన రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై మూడుసార్లు విహరిస్తారు. ఇక, మూడవరోజు మార్చి 11వ తేదీన శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి వారు మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదేవిధంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగో రోజు మార్చి 12వ తేదీన ఐదుసార్లు, చివరి రోజు మార్చి 13వ తేదీన ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. ప్రతి రోజూ రాత్రి 7 నుండి 8 గంటల మధ్య తెప్పోత్సవాలు జరగనున్నాయి.
ఆర్జిత సేవలు రద్దు :
శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల కారణంగా మార్చి 09, 10వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 11, 12, 13వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఈఈలు సుబ్రమణ్యం, సుధాకర్, వేణుగోపాల్, డీఈ చంద్ర శేఖర్, వీజీవోలు రామ్ కుమార్, సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.