తెలంగాణలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగటం రాజకీయ పార్టీలను కలవరపెడుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండగా కాంగ్రెస్, బిజెపి పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి.
కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు నిలబెట్టుకునేందుకు పార్టీ నేతలు చెమటోడ్చారు. కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మూడు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించి..పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వూట్కూరి నరేందర్ రెడ్డి…వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహించారు. బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి అన్ని జిల్లాల్లో పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బిజెపి తరపున కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. బిజెపి శ్రేణులు పట్టభద్రుల స్థానంలో గెలుపు కోసం ఓటర్లను కలుస్తూ ప్రచారం నిర్వహించారు. అంజిరెడ్డి సంగారెడ్డి జిల్లా వాసి అయినా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆ భేదం కనిపించకుండా బిజెపి నేతలు ప్రచారంలో పాల్గొన్నారు.
మరోవైపు బీఎస్పి తరపున బరిలో దిగిన ప్రసన్న హరికృష్ణ చాప కింద నీరులా నిర్వహించిన ప్రచారం…ఫలితాలను తారుమారు చేయబోతోందని వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పోటీలో లేకపోవడంతో మెదక్, కరీంనగర్ జిల్లాల్లో బలంగా ఉన్న ప్రాంతాల్లో గులాబీ నేతలు లోపాయికారిగా హరికృష్ణకు మద్ధతు ఇచ్చారని సమాచారం.
ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వే సంస్థలు విడుదల చేసిన రిపోర్టులను విశ్లేషిస్తే కాంగ్రెస్, బిజెపిలను ఆశ నిరాశల మధ్య దోబోచులాడుతున్నాయి. మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ MLC స్థానంలో పోటీ తవ్రంగా ఉందని వార్తలు వస్తున్నాయి. సర్వే సంస్థల అంచనాల ప్రకారం దీన్ని బిజెపి ఎగురేసుకుపోతుందని సమాచారం. నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానంలో స్వతంత్ర అభ్యర్థి హర్షవర్దన్ రెడ్డిని విజయలక్ష్మి వరిస్తుందని అంటున్నారు.
మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యు యేట్ MLC స్థానంలో అనూహ్యంగా హరికృష్ణ గెలవబోతున్నారని వార్తలు వస్తున్నాయి. బిజెపి రెండో స్థానంలో కాంగ్రెస్ మూడో స్థానంలోకి వెళుతోందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి పచ్చి వెలక్కాయ పడినట్టే. అసలే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా మీనాక్షి నటరాజన్ వస్తున్నారు. పార్టీ వ్యవహారాల్లో నిక్కచ్చిగా వ్యవహరించే మీనాక్షి…ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తేడాగా వస్తే ఏ విధంగా స్పందిస్తారోనని రాష్ట్ర నేతలకు ఆందోళన పట్టుకుంది.