29.1 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

యనమల ఎమ్మెల్సీ పదవికి తుని మున్సిపాలిటీ బ్రేకులు

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పాలిట్‌బ్యూరో సీనియర్ సభ్యుడు యనమల రామకృష్ణుడు రాజకీయ జీవితం ఇక్కడితో ఆగిపోతుందా లేక కొనసాగుతుందా అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. మార్చి 29వ తేదీతో ప్రస్తుతం యనమల రామకృష్ణుడి ఎమ్మెల్సీ పదవీకాలం ముగియనుంది. ఆయనతో పాటు మరో నాలుగు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్ధానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇప్పుడు ఎన్నికలు జరుగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్ధానాల్లో యనమలకు బెర్త్‌ దక్కుతుందా లేదా అనే చర్చ టీడీపీలో నడుస్తోంది. వాస్తవానికి టీడీపీ చీఫ్‌గా చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ అధికారం మాత్రం లోకేష్‌ చేతిలో ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో లోకేష్‌ ఎంత వరకూ యనమల అభ్యర్ధిత్వాన్ని పరిగణలోకి తీసుకుంటారనే సంశయం అందరిలో ఉంది. వాస్తవానికి ఈ సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లోకేష్‌ అపాయిట్మెంట్లు అన్నీ సీనియర్లను పక్కన పెట్టి యువకులకు పెద్దపీట వేసేవిలా ఉన్నాయి. ఈ పరిస్ధితుల్లో ఎంతవరకూ యనమల రామకృష్ణుడ్ని ఎమ్మెల్సీగా కొనసాగిస్తరనేది అనుమానమే. దీనికి తోడు యనమల విషయంలో మైనస్‌ పాయింట్లు కూడా పెరుగుతున్నాయి. దాదాపు నలభై ఏళ్ళ పాటు టీడీపీలో, చంద్రబాబు వద్ద చక్రం తిప్పిన యనమల ఇప్పుడు తన ఎమ్మెల్సీ పదవి కొనసాగింపు కోసం నానా తిప్పలు పడాల్సి వస్తోంది.

1983 నుంచి వరుసగా ఆరు పర్యాయాలు తుని నుంచి గెలిచిన యనమల 2009 నుంచి ఆ నియోజకవర్గంలో విజయానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. చివరికి 2024లో జరిగిన ఎన్నికల్లో యనమల కుమార్తె ఎట్టకేలకు గెలుపొందారు. అయితే 2009 తరువాత ఎమ్మెల్సీగా చట్టసభల్లో ప్రాతినిద్యం మాత్రం కోల్పోకుండా యనమల జాగ్రత్త పడ్డారు. కుమార్తె శాసనసభ్యురాలైనా యమలకు మాత్రం ఇంకా తుని నియోజకవర్గంపై తిరిగి పట్టు సాధించడానికి తల ప్రాణం తొకకి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వైస్ ఛైర్మన్ల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. తిరుపతి కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్, పిడుగురాళ్ల వైస్ ఛైర్మన్ పదవిని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. కానీ తుని విషయానికి వచ్చేసరికి రామకృష్ణుడు ఎత్తులు పారడం లేదు. సుదీర్ఘ కాలం తరువాత తునిని టీడీపీ గెలుచుకున్న ఆనందం, తన కుమార్తె తుని ఎమ్మెల్యే అయిందన్న సంతోషం కన్నా ఈ వైస్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకోలేకపోతున్నాననే బాధ యనమలలో ఎక్కువగా కనిపిస్తోంది. తుని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవి కైవశం చేసుకుందామని యనమల చేసిన నాలుగు ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఇది యమలకు సెట్‌బ్యాక్‌ గా నిలుస్తోందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఇప్పటికే యనమల రామకృష్ణుడుకు పార్టీ అధినాయకత్వానికి మధ్య గ్యాప్ బాగా పెరిగిందనే ప్రచారం ఉంది. యనమల కుటుంబంలో అనేక మందికి టిక్కెట్లు ఇచ్చినప్పటికీ తనకు ఇంకా మంత్రి పదవి కావాలని పట్టుబట్టడం ఏంటన్నది పార్టీ అధినాయకత్వం ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో తాను సీనియర్ గా పార్టీకి ఎంతో సేవలు చేశానని, కష్ట సమయంలో వెన్నుదన్నుగా ఉన్నానని, అలాంటి తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడమేంటన్నది యనమల రామకృష్ణుడి భావన. యనమల బీసీలకు అనుకూలంగా, కాకినాడ పోర్టుపై చేసిన కామెంట్స్ కూడా అధినాయకత్వానికి ఇబ్బందికరంగా మారాయి. దీంతో ఆయనకు టీడీపీ అగ్రనాయకత్వంతో మరింత దూరం పెరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలో ఐదు స్ధానాలకు జరగబోయే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో యనమలకు పార్టీ అధిష్టానం షాకు ఇవ్వబోతోందని టీడీపీలో అంతర్గతంగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే యనమల రామకృష్ణుడి నలభై సంవత్సరాల రాజకీయ జీవితం వచ్చే మార్చి 29వ తారఖుతో ముగిసినట్లే అని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com